జంట భవనాలు.. మనకెన్నో గుణపాఠాలు

దేశ రాజధాని దిల్లీ శివార్లలోని నోయిడాలో సూపర్‌టెక్‌ కంపెనీ అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాల కూల్చివేత దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ.వందల కోట్ల విలువైన స్థిరాస్తిని అధికార యంత్రాంగం

Updated : 03 Sep 2022 08:05 IST

కట్టాక కూల్చడం కంటే ఉల్లంఘనలను ఆదిలోనే అడ్డుకోవాలి

ఈనాడు, హైదరాబాద్‌

దేశ రాజధాని దిల్లీ శివార్లలోని నోయిడాలో సూపర్‌టెక్‌ కంపెనీ అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాల కూల్చివేత దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ.వందల కోట్ల విలువైన స్థిరాస్తిని అధికార యంత్రాంగం నేలమట్టం చేసింది. ఒక్కసారి భవనం కట్టిన తర్వాత ఇక తమ జోలికి ఎవరొస్తారులే అని భావిస్తున్న నిర్మాణదారులకు ఇదొక గుణపాఠం. అనుమతులు లేకుండా... ఒకవేళ తీసుకున్న అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే అక్రమం కాబట్టి ఎప్పుడైనా కూల్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అందులో ఇల్లు కొన్నవారు, కట్టిన బిల్డరు ఇద్దరికి నష్టమే. మన దగ్గర సైతం కొందరు బిల్డర్లు ముఖ్యంగా శివార్లలో కట్టే అపార్ట్‌మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. వ్యక్తిగత ఇళ్లలోనూ 200 నుంచి 300 చదరపు గజాల నిర్మాణాల్లో విపరీతంగా ఉల్లంఘనలు ఉంటున్నాయి. యంత్రాంగం కొరఢా ఝలిపిస్తే పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టం అవుతాయి. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని.. ఆదిలోనే అక్రమాలను అరికట్టాలని రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు అంటున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటింగ్‌ యాక్ట్‌(రెరా) అనుమతి పొందిన ప్రాజెక్టులైతేనే కొనుగోలుదారులకు భరోసా అని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.

ఆదిలోనే నియంత్రిస్తే..

- ప్రభాకరరావు, అధ్యక్షుడు, తెలంగాణ బిల్డర్స్‌ సమాఖ్య

అక్రమ కట్టడాలు ఎప్పటికైనా నష్టమే. గతంతో పోలిస్తే నిబంధనల ఉల్లంఘనలు తగ్గినా.. ఇలాంటి వాటిని ఆదిలోనే అరికట్టాలి. గతంలో తనిఖీలైనా ఉండేవి. జీవో 86, తనఖా నిబంధన, రెరా వచ్చాక అవి కూడా లేవు. ఇవన్నీ అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చినవే. తనిఖీలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో నియంత్రణ కొరవడింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం పూర్తిచేసి..అందులో ఫ్లాట్లను అమ్మేసి, వారు పొజిషన్‌లోకి వస్తే మన దగ్గర ఖాళీ చేయించడం సాధ్యమవుతుందా? ఎన్నో ఒత్తిళ్లు పనిచేస్తాయి. కాబట్టి ప్రారంభం నుంచే పర్యవేక్షణ, తనిఖీలు ఉంటే ఇలాంటి వాటికి ఆదిలోనే నిరోధించవచ్చు. వ్యక్తిగత ఇళ్లలో ఎక్కువ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. 300 గజాల స్థలంలో ఐదు అంతస్తులు.. కొన్నిచోట్ల ఏడు అంతస్తులు కడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నోటీసు ఇస్తున్నారు. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోమని వాళ్లే చెబుతున్నారు. సరైన నియంత్రణ ఉంటే ఇలాంటి ఉల్లంఘనలు చేసేందుకు భయపడతారు. దిల్లీలో భవనాల కూల్చివేత గొప్పగా చెప్పినా.. జాతీయ వృథాగా భావిస్తాను. అనుమతులు వచ్చాయి.. రుణాలు తీసుకుని కొనుగోలు చేశారు. వీరికి బిల్డరే తిరిగి సొమ్ము చెల్లించాలి. కానీ నా దగ్గర లేవు అంటే ఎవరేం చేయగలరు? అలాంటివి ఎన్ని చూడటం లేదు. కాబట్టి యంత్రాంగం ఆదిలోనే వీటికి చెక్‌పెట్టాలి. కొనుగోలుదారులు సైతం బిల్డర్‌ చరిత్ర, గతంలో ఏవైనా ప్రాజెక్టులు సక్రమంగా పూర్తిచేశారా? ఏవైనా సమస్యలు ఉన్నాయి? కట్టిన ప్రాజెక్టు ఉంటే అక్కడికి వెళ్లి నివాసితులతో మాట్లాడితే ఇవన్నీ తెలుస్తాయి. ఏం చూసుకోకుండా.. కేవలం ధర ఒక్కటే బేరమాడి కొనేస్తున్నారు.

రెరా అనుమతి ఉన్న ప్రాజెక్టులోనే కొనాలి

- సునీల్‌చంద్రారెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌(ట్రెడా)

కొనుగోలుదారులు రెరా అనుమతి ఉన్న ప్రాజెక్టులోనే కొనుగోలు చేస్తే ఇలాంటి అనుకోని సంఘటనలు ఎదురవ్వవు. మున్సిపల్‌ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాతనే రెరా అనుమతి ఇస్తుంది. బిల్డర్‌ సైతం తమ ప్రాజెక్టు ప్లాన్లను, ఎప్పుటికి పూర్తిచేసేది అన్ని వివరాలు రెరాకు సమర్పిస్తారు. కాబట్టి ప్లాన్‌లో ఎవరైనా మార్పులు చేయాలన్నా.. కొనుగోలుదారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి రెరాలో నమోదైన ప్రాజెక్టులో కొంటే అన్ని విధాలా శ్రేయస్కరం అని తాము పదే పదే కొనుగోలుదారులకు చెబుతున్నాం. తక్కువ ధర అని ప్రీలాంచ్‌లో కొంటే.. వాస్తవిక వ్యయం కంటే సగం ధరకే అమ్మేస్తే ప్రాజెక్టు పూర్తిచేయగలడా లేదా అని కొనుగోలుదారుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రెరా వస్తుందని.. ఇప్పుడైతే తక్కువ ధర అంటే కొనేస్తుంటారు. మా విన్నపం ఏంటంటే రెరా వచ్చాకనే కొనుగోలు చేయండి. లేదంటే మీ కష్టార్జితం మోసగాళ్ల పాలవుతుంది. కట్టిన తర్వాత కూల్చే పరిస్థితులు తెచ్చుకోకుండా బిల్డర్లు సైతం నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలి. రెరా అనుమతి వచ్చాకనే విక్రయాలు చేపట్టాలి.

వీటితో అప్రమత్తం..

* రెరా అనుమతి లేకుండానే పలు అపార్ట్‌మెంట్లు నగరంలో నిర్మిస్తున్నారు. వీటిలో కొనేటప్పుడు జాగ్రత్త.

* శివార్లలో 400 గజాల నివాసంలోనే 16 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. సెట్‌బ్యాక్‌ వదలడం లేదు. వీటిలో సరైన పార్కింగ్‌ సదుపాయం ఉండదు. జీ+3 అనుమతి తీసుకుని అక్రమంగా మరో అంతస్తు వేస్తుంటారు.

* హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి లేకుండానే శివార్లలో ఫాంల్యాండ్‌ పేర్లతో లేఅవుట్లలో స్థలాలు విక్రయిస్తున్నారు. వీటిలో కొనుగోలుతోనూ ఎలాంటి రక్షణ ఉండదు. ఎప్పుడైనా ఈ తరహా లేఅవుట్లలోని రహదారులు, నిర్మాణాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది.

ప్రీలాంచ్‌ పేరుతో ఇప్పటికీ పలు సంస్థలు రెసిడెన్షియల్, కమర్షియల్‌ స్పేస్‌ను విక్రయిస్తున్నాయి. అనుమతులు రాకముందే కొనుగోలు అంటే నష్టభయం ఎక్కువ.

* చెరువులు, నాలాల సమీపంలో భూములను అక్రమించి కొందరు లేఅవుట్లు వేస్తుంటారు. అపార్ట్‌మెంట్లు కడుతుంటారు. వీటిలో కొనేటప్పుడు సరైన ఎన్వోసీలు ఉన్నాయో లేవో చూసుకోవాలి.

* ప్రాజెక్టులో రకరకాల సౌకర్యాలు కల్పిస్తామని.. ఖాళీ స్థలం 70 శాతం అని కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. చెప్పిన మేరకు స్థలాలను నివాసితుల సొసైటీకి అప్పగించాలి. కానీ కొందరు బిల్డర్లు అక్కడ ఉన్న ఖాళీ స్థలం తమకు చెందుతుందని.. అక్కడ వాణిజ్య భవనం కడతామని చెబుతుంటారు. ఇక్కడే వివాదాలు వస్తుంటాయి. వీటిపై కొనే సమయంలోనే లిఖిత పూర్వక హామీ తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని