రియల్‌.. ఎంతెంత దూరం?

రాజధాని హైదరాబాద్‌ చుట్టుపక్కల మున్ముందు రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు మరింతగా విస్తరించనున్నాయి. హైదరాబాద్‌ నడిబొడ్డు నుంచి ఏటు చూసినా 30 కి.మీ. వరకు జనావాసాలతో నగరం నిండిపోయింది.

Updated : 26 Nov 2022 12:48 IST

భవిష్యత్తులో హైదరాబాద్‌ వృద్ధిపై భారీ అంచనాలు
100 కి.మీ. వరకు విస్తరించిన స్థిరాస్తి మార్కెట్‌

రాజధాని హైదరాబాద్‌ చుట్టుపక్కల మున్ముందు రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు మరింతగా విస్తరించనున్నాయి. హైదరాబాద్‌ నడిబొడ్డు నుంచి ఏటు చూసినా 30 కి.మీ. వరకు జనావాసాలతో నగరం నిండిపోయింది. ప్రస్తుతం 30 నుంచి 50 కి.మీ. మధ్య స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది. ఇది ఇక్కడితో ఆగలేదు. ప్రాంతీయ వలయ రహదారి లోపల, బయట పలు పరిశ్రమలు సెజ్‌లు, విద్యాసంస్థలు ఉండటం, కొత్తగా మరిన్ని ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండటంతో సిటీ నుంచి 80-100 కి.మీ. వరకు స్థిరాస్తి వ్యాపారం విస్తరించింది. హైదరాబాద్‌ అభివృద్ధికి ఢోకా లేకపోవడంతో భవిష్యత్తు దృష్ట్యా దూరాన్ని సైతం కొనుగోలుదారులు లెక్క చేయడం లేదు. తమ పెట్టుబడులను భూములు, స్థలాలపై పెడుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌  

గరంలో జనాభా కోటి వరకు ఉంటుంది. భవిష్యత్తులో రెండుకోట్ల జనాభా వరకు సిటీ విస్తరించే అవకాశం ఉంది.  దేశం మధ్యలో హైదరాబాద్‌ నగరం ఉండటం వంటి భౌగోళిక, వాతావరణ, భాష, సాంస్కృతిక అనుకూలతలతో ఇక్కడికి వలసలు పెరుగుతున్నాయి. ఉత్తరాది నుంచి, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడుతున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇవన్నీ రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి దోహదం చేస్తున్నాయి.

ఓఆర్‌ఆర్‌ బయట విల్లాలు...

అవుటర్‌ చుట్టుపక్కల, బయట ఎక్కువగా విల్లా ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. రూ.కోటి, అంతకంటే ఎక్కువ వెచ్చిస్తే తప్ప విల్లాలను సొంతం చేసుకోలేరు. 200 గజాల స్థలం కొనుగోలు చేసి సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు అవుతోంది. పైగా జనావాసాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నలుగురు కలిసి గ్రూప్‌ హౌజింగ్‌లో ఇళ్లు కట్టుకున్నా ఒక్కొక్కరు రూ.కోటి వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. వీటి దృష్ట్యా సిటీలో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేసి.. డబ్బు సర్దుబాటైతే అవుటర్‌ బయట స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్లాట్‌ ఉన్నవారు అధికాదాయ వర్గాలు విల్లాలు, విల్లా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అవుటర్‌ బయట గ్రోత్‌ కారిడార్‌ దాటిన తర్వాత చదరపు అడుగు రూ.10వేల నుంచి 20 వేల వరకు ధరలు చెబుతున్నారు. పాత వెంచర్లలో కొన్నిచోట్ల ఆరేడు వేలకు సైతం లభిస్తున్నాయి. కోహెడ మార్గంలో అందుబాటులో ఉన్నాయి. గౌరెల్లి మార్గంలో అనుమతి ఉన్న లేఅవుట్లలోనూ ఓఆర్‌ఆర్‌ లోపలే చదరపు గజం రూ.20వేల లోపు దొరుకుతున్నాయి. సమీప భవిష్యత్తు అవసరాలకు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్‌ హోమ్స్‌గా ఉపయోగించుకున్నారు. నగరం మధ్య నుంచి ఈ ప్రాంతాలు 40 నుంచి 50 కి.మీ. దూరంలో ఉంటాయి. ఉన్నతోద్యోగులు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు,  ప్రవాస భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

ప్రాంతీయ వలయ రహదారి

త్రిపుల్‌ ఆర్‌ ప్రతిపాదనతో 50 కి.మీ. దాటిన దగ్గర్నుంచి 100 కి.మీ. వరకు  హైదరాబాద్‌ రియల్‌ మార్కెట్‌ విస్తరించింది.  ఇక్కడ భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలు కొంటున్నారు. యాదాద్రి, ఫార్మాసిటీ,  లైఫ్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌, ఆటోమొబైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్లాస్టిక్‌, పాలీమర్స్‌, ఎఫ్‌ఎంసీజీ, లాజిస్టిక్స్‌, జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ రంగంలో పెట్టుబడులు ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కలనే ఎక్కువగా రాబోతున్నాయి. ప్రభుత్వం ప్రధానంగా 9 రంగాల్లో  ఇక్కడ పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఇవే రియల్‌ ఎస్టేట్‌ ఇరుసుగా ఇక్కడ పనిచేస్తున్నాయి. స్థలాలు, ఫామ్‌ల్యాండ్‌ వెంచర్లు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలానికి వీటిలో కొనుగోలు చేస్తున్నారు. శంకర్‌పల్లి, చేవెళ్ల, కందుకూరు ప్రాంతాల్లో ఫామ్‌ల్యాండ్‌ చదరపు గజం రూ.7వేల వరకు విక్రయిస్తున్నారు. డీటీసీపీ అనుమతి ఉన్న వాటిలో రూ.పదివేలపైనే ధరలు చెబుతున్నారు. బాలానగర్‌, జడ్చర్ల సమీపంలోని అనుమతి ఉన్న ఫామ్‌ల్యాండ్లలో చదరపు గజం రూ.4వేల ధరల్లో దొరుకుతున్నాయి. బడ్జెట్‌ దృష్ట్యా కొనుగోలుదారులు సిటీ నుంచి దూరం వెళుతున్నారు.


భవిష్యత్తుపై ఆశాజనకం ఎందుకంటే..

* సిటీ నుంచి వెళుతున్న పలు జాతీయ రహదారులను విస్తరించనున్నారు. విజయవాడ, బెంగళూరు, శ్రీశైలం ఇలా పలు రహదారుల విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి.

* ఫార్మాసిటీ, ప్రాంతీయ వలయ రహదారి, విమానాశ్రయం రన్‌వే విస్తరణ, కొత్త ప్రాంతాల్లో ఐటీ పార్కుల ఏర్పాటు, మెట్రో రైలు నెట్‌వర్క్‌ విస్తరణ వంటివి రాబోయే సంవత్సరాల్లో కార్యరూపం దాల్చనున్నాయి.

* తెలంగాణ రెండో ఐసీటీ పాలసీ ప్రకారం 2026 నాటికి రూ.3 లక్షల కోట్ల విలువైన ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకుంది. పలు ఎంఎన్‌సీ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యాలయాల ఏర్పాటుతో కొత్తగా ఉపాధి అవకాశాలు రానున్నాయి. గృహ, కార్యాలయ, రిటైల్‌ నిర్మాణాలకు డిమాండ్‌ పెరగనుంది.

* తెలంగాణ లాజిస్టిక్‌ పాలసీ ప్రకారం 2026 నాటికి పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. లాజిస్టిక్‌ పార్కులు నిర్మాణంలో ఉన్నాయి.

* తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను సర్కారు ప్రోత్సహిస్తోంది. 2025 నాటికి రూ.15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టిపెట్టింది.  ఇప్పటికే 60 సంస్థలు రూ.2300 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ప్రాంతీయ వలయ రహదారి బయటనే ఇవన్నీ వస్తున్నాయి.

* తెలంగాణ లైఫ్‌ సెన్సెస్‌లో 2025 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా సర్కారు నిర్దేశించుకుంది. ఫార్మాసిటీ ఇందులో భాగం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6400 కోట్ల పెట్టుబడులను మన రాష్ట్రంలో 215 సంస్థలు పెట్టాయి.

* వచ్చే ఐదేళ్లలో తెలంగాణ జీఎస్‌డీపీని ఇప్పుడున్న 11.5 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇవన్నీ కూడా మున్ముందు వృద్ధి మరింత వేగంగా జరిగేందుకు అవకాశం ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి. ఎన్నికల వరకు ఊగిసలాట ఉన్నా ఆ తర్వాత వేగం పుంజుకునే అవకాశం ఉంది.


అవుటర్‌ లోపల అపార్ట్‌మెంట్లే..

వుటర్‌ లోపల వరకు స్థలాల ధరలకు లెక్కలొచ్చాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వాసులకు వ్యక్తిగత ఇళ్లు అందని ద్రాక్షే. గతంలో స్థలాలు కొన్నవారు తప్ప కొత్తగా కొని ఇల్లు కట్టే పరిస్థితి లేదు. వీరంతా అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సీబీఆర్‌ఈ నివేదిక ప్రకారం సిటీలో 2019 నుంచి 2022 మార్చి వరకు మూడేళ్లలో 3.3 లక్షల అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు నిర్మాణం చేపట్టారు. పశ్చిమ హైదరాబాద్‌ మినహాయించి మిగతా వైపు అవుటర్‌ లోపల చదరపు అడుగు రూ.3500 నుంచి రూ.4వేల లోపు అందుబాటులో ఉన్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీల్లో కాస్త ఎక్కువ ఉన్నాయి. రూ.40-50 లక్షల లోపు రెండు పడక గదుల ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదిభట్ల, తుక్కుగూడ, పోచారంలలో పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని