ఈవీల రాకతో రియల్ ఎస్టేట్ ఎలా మారబోతోంది?
నగరంలో ప్రస్తుతం ఈ-మొబిలిటీ వారోత్సవాలు జరుగుతున్నాయి. దీర్ఘకాలంలో రూ.50వేల కోట్ల పెట్టుబడి ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది.
ప్రయాణ వ్యయం తగ్గుదల.. నగరం మరింతగా విస్తరణ
అందుబాటు గృహ నిర్మాణాలకు అవకాశం అంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్
నగరంలో ప్రస్తుతం ఈ-మొబిలిటీ వారోత్సవాలు జరుగుతున్నాయి. దీర్ఘకాలంలో రూ.50వేల కోట్ల పెట్టుబడి ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు దేశంలోనే మొదటిసారిగా హుస్సేన్‌సాగర్ తీరంలో విద్యుత్తు కార్లతో స్ట్రీట్ సర్క్యూట్‌పై ఫార్ములా ఈ రేసింగ్‌కి ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాల(ఈవీ) గురించే చర్చ. ఈవీల రాకతో పర్యావరణం, ఆర్థిక వ్యవస్థల్లో చాలా మార్పులు రాబోతున్నాయని నిపుణులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఈవీలు మున్ముందు ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. స్థిరాస్తి మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని విశ్లేషిస్తున్నారు.
ప్రజారవాణాపై నగరం ఎక్కువగా ఆధారపడిన రోజుల వరకు సిటీ విస్తరణ పెద్దగా జరగలేదు. పదిహేను ఏళ్ల క్రితం వరకు కూడా ఇదే పరిస్థితి. నివాసాలన్నీ ఇన్నర్ రింగ్ రోడ్డు లోపలే ఎక్కువ కేంద్రీకృతమయ్యాయి. ఆ తర్వాత క్రమంగా వ్యక్తిగత వాహనాల వినియోగం మొదలైంది. దీంతో నగరం అవుటర్ దాటి బయటికి విస్తరించింది. సిటీ నుంచి 30 కి.మీ. వరకు పెద్ద ఎత్తున విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు వచ్చాయి. ఒకటిన్నర దశాబ్దంగా ఇది కొనసాగుతోంది. భూముల ధరలు పెరగడంతో ఇక్కడ సైతం కొనలేని పరిస్థితుల్లో మరింత దూరం వెళుదామంటే రవాణా ఖర్చులు భయపెడుతున్నాయి. విద్యుత్తు వాహనాల రాకతో రవాణా వ్యయం తగ్గుతుంది కాబట్టి సిటీ నివాసాలు మరింత దూరం విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రోజువారీ ప్రయాణ వ్యయం ఈవీలతో గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో సిటీకి అన్నివైపులా 50 కి.మీ. వరకు వరకు గృహ నిర్మాణ మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. కాలుష్యం తక్కువగా అహ్లాదకరంగా ఉండే ప్రాంతాల్లో నివాసానికి మొగ్గు చూపనున్నారని చెబుతున్నారు.
* కొత్త ప్రాజెక్టుల్లో డెవలపర్లు ఇప్పటికే ఈవీ మౌలిక వసతులు కల్పిస్తున్నారు. నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో కొందరు వెనకా ముందు ఆడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి పార్కింగ్ ప్రదేశంలో ఈవీ ఛార్జింగ్ సదుపాయం, ఉమ్మడిగా రీఛార్జ్ సదుపాయలు ఉన్న ప్రాజెక్ట్‌ల వైపే కొనుగోలుదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మౌలిక వసతులపై డెవలపర్లు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది.
వాటి స్థానంలో నివాస, వాణిజ్య భవనాలు
ఇప్పుడిప్పుడే ఈవీల శకం మొదలైంది. మున్ముందు ఒకసారి ఛార్జింగ్‌తో ఎక్కువ దూరం ప్రయాణించే బ్యాటరీల లభ్యత, పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు, సాంకేతికతలో పురోగతితో విద్యుత్తు వాహనాల వాడకం పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రధాన రహదారులపై ఇప్పుడు చూస్తున్న పెట్రోల్ బంక్‌ల అవసరం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. నివాసం ఉంటున్న చోట, కాలనీలు, కార్యాలయాలు ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ పాయింట్లు మరింత చేరువగా ఉంటాయి కాబట్టి పెట్రోల్ పంపులతో పని ఉండదని చెబుతున్నారు. వీటిలో కొన్ని ఈవీ స్టేషన్లుగా మారినా.. మిగతావి భవిష్యత్తులో నివాస, వాణిజ్య భవనాలు కట్టేందుకు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. సిటీలో ఇలాంటి అనుభవాలు ఇదివరకు వేరే రూపంలో ఉన్నాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన చాలా సినిమా థియేటర్లు.. మూతపడిన తర్వాత వాటి స్థానంలో అపార్ట్‌మెంట్లు వచ్చాయి. పెట్రోల్ బంకులు ప్రధాన రహదారిపై ఉంటాయి కాబట్టి వాణిజ్య నిర్మాణాలకు ఉపయోగించే అవకాశం ఉంది.
కార్యాలయాల్లో మార్పులు
* కార్యాలయ భవన నిర్మాణాల్లో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. ఇకపై వాటిని విద్యుత్తు వాహనాల పార్కింగ్, ఛార్జింగ్‌కు అనువుగా నిర్మించాల్సి ఉంటుంది. బిజినెస్, ఐటీ పార్క్‌ల్లో లీజింగ్‌కు డిమాండ్ ఉండాలంటే ఉద్యోగులు, సందర్శకుల కోసం ఇవి తప్పనిసరి.
* మొదట కొత్త భవనాల్లో, తర్వాత పాత భవనాల్లో రెట్రో ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిటైల్‌లోనూ..
రియల్ ఎస్టేట్‌లో రిటైల్, మాల్స్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వచ్చాయి. కొవిడ్‌తో దూకుడు ఆగినా.. తిరిగి వీటి నిర్మాణాలు పుంజుకునే అవకాశం ఉంది. వీటికి సందర్శకుల సంఖ్య పెరగాలన్నా.. ఎక్కువ సమయం అక్కడ గడిపేలా చేయాలన్నా ఈవీ ఛార్జింగ్ వంటి వసతులు భవనాల్లో కల్పించడం డిజైన్‌లో భాగంగా చేసుకోవాల్సిందే. యూఎస్‌ఏలో ఛార్జ్ పాయింట్ రిటైల్ సంస్థ ప్రయోగాత్మకంగా చేసిన అధ్యయనంలో అప్పటి వరకు సందర్శకులు సగటున గడిపే సమయం 50 నిమిషాల నుంచి 72 నిమిషాలకు పెరిగిందని వెల్లడించింది.
* రియల్ ఎస్టేట్‌లో విస్తరణకు అవకాశం ఉన్న వాటిలో లాజిస్టిక్ హబ్స్ ఒకటి. ఈవీల రాకతో వీటి సంఖ్య శివార్లలో మరింత ఊపందుకునే అవకాశం ఉంది.
దూరమైనా ఇల్లు కొనుక్కోగలుగుతారు
- ఎ. సుమంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా
విద్యుత్తు వాహనాల రాకతో నగరం, స్థిరాస్తి మార్కెట్ మరింత దూరం విస్తరిస్తుంది. ధరల పెరుగుదలతో సిటీలో ఒక వర్గం ప్రజలకు ఇల్లు కొనడం భారంగా మారింది. ఈవీతో చౌకలో ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి దూరం వెళ్లైనా ఇల్లు కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే దూరం వెళ్లి తక్కువకు కొనుగోలు చేసినా.. ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రయోజనం దక్కడం లేదు. దీంతో సిటీకి దగ్గరలోనే ఉందామనే భావన ఉంది. ఈవీతో రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుంది కాబట్టి దూరం వెళ్లేందుకు వెనకాడరు. గచ్చిబౌలిలో రెండు పడక గదుల ఫ్లాట్ కావాలంటే కోటి 20 లక్షల రూపాయలు కావాలి. అదే శంషాబాద్‌లో రూ.60లక్షలకు వస్తుంది. సహజంగానే అక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్