రూ.లక్ష కోట్ల మార్కెట్‌ మనది

‘హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌ వార్షిక విలువ రూ.లక్ష కోట్లు. ఇక్కడ ఏటా 30 వేలకుపైగా గృహ అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌ ఆటోమోడ్‌లో ఉంది. దీన్ని ఆటంకపర్చకుండా మౌలిక వసతులు కల్పిస్తే మరింతగా పరుగులు తీస్తుంది’ అని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో) జాతీయ అధ్యక్షుడు జి.హరిబాబు ‘ఈనాడు’తో అన్నారు. మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం 6.5 శాతానికి గృహ రుణాలు అందేలా వడ్డీ రాయితీని భరిస్తే..

Published : 09 Dec 2023 02:02 IST

పేదలకు పెద్దగా భారం లేకుండానే అందరికి ఇల్లు కట్టివ్వడం సాధ్యమే
ఆటో మోడ్‌లో ఉంది.. మౌలిక వసతులు కల్పిస్తే పరుగులే
మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం వడ్డీరాయితీ ఇస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది
‘ఈనాడు’తో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు జి.హరిబాబు

ఈనాడు, హైదరాబాద్‌ : ‘హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌ వార్షిక విలువ రూ.లక్ష కోట్లు. ఇక్కడ ఏటా 30 వేలకుపైగా గృహ అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌ ఆటోమోడ్‌లో ఉంది. దీన్ని ఆటంకపర్చకుండా మౌలిక వసతులు కల్పిస్తే మరింతగా పరుగులు తీస్తుంది’ అని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో) జాతీయ అధ్యక్షుడు జి.హరిబాబు ‘ఈనాడు’తో అన్నారు. మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం 6.5 శాతానికి గృహ రుణాలు అందేలా వడ్డీ రాయితీని భరిస్తే.. వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పారు. పేదలకు సైతం పెద్దగా భారం లేకుండానే అందరికి ఇల్లు కట్టివ్వడం సాధ్యమే అన్నారు.

ధరలు పెరగడంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలు సొంతింటి   భాగ్యానికి దూరం అవుతున్నారు? ఈ విభాగంలో ప్రభుత్వ తోడ్పాటు ఎలా ఉండాలి?

సరసమైన ధరల్లో ఇల్లు అందించాలనే ఉద్దేశంతో కొన్ని సంస్థలు అందుబాటు ఇళ్ల ప్రాజెక్టులను చేపట్టాయి. విస్తీర్ణం తగ్గించి రెండు పడక గదుల ఫ్లాట్‌ను 900 చ.అ. విస్తీర్ణం లోపల కొందరు బిల్డర్లు కట్టారు. అయితే వీటికి కొనుగోలుదారుల నుంచి స్పందన అంతగా ఉండటం లేదు. కనీసం 1200 చ.అ. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా ఇల్లు ఉండాలని మధ్యతరగతి వర్గాలు చూస్తున్నాయి. మొదటిసారి ఇల్లు కొంటుంటే రూ.50 లక్షల వరకు రుణానికి సంబంధించి వడ్డీ సబ్సిడీ వీరి కోసం ప్రభుత్వం అందివ్వాలి. ఇప్పుడు వడ్డీరేట్లు 9 శాతంపైనే ఉన్నాయి. 6.5 శాతం ఉండేలా ప్రభుత్వం అందిస్తే ఈఎంఐ భారం తగ్గుతుంది. ఇప్పుడు చెల్లిస్తున్న ఇంటి అద్దెతో సమానం లేదంటే ఇంకొంచెం ఎక్కువగా ఈఎంఐ ఉంటుంది కాబట్టి పెద్దగా భారం ఉండదు. కోటి రూపాయల ఇంటిపై ప్రభుత్వానికి రూ.30 లక్షల దాకా స్టాంపుడ్యూటీ, జీఎస్‌టీ, ఇతర పన్నుల రూపంలో రెవెన్యూ వస్తుంది. ఈ లావాదేవీలు జీఎస్‌డీపీలో కలుస్తుంది కాబట్టి ఆ మేరకు ప్రభుత్వం రెండింతల రుణం తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి సబ్సిడీ ఇచ్చి ఇల్లు కొనేలా చేస్తే సర్కారుకు ప్రయోజనమే. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి ధరలు అందుబాటులో లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయి. సర్కారు ఒక నిర్ణయంతో రెండు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

పేదలందరికి ఇల్లు కట్టివ్వడం సాధ్యమే అన్నారు? అదెలా?

అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందాలంటే స్లమ్‌ రీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ చేపట్టాల్సి ఉంది. ఇక్కడ కావాల్సినంత భూమి ఉంది. చాలాచోట్ల ప్రభుత్వ భూమిలోనే మురికివాడలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఇళ్లు రేకుల షెడ్లు, ఒక అంతస్తు వరకే ఉన్నాయి. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో 200 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. వీటి స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టాలి. ఒక్కో ఎకరంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడితే వెయ్యి ఫ్లాట్లు నిర్మించవచ్చు. ఒక్కో ఫ్లాట్‌ని 600 నుంచి 750 చ.అ. విస్తీర్ణంలో నిర్మించి ఇవ్వొచ్చు. మంచి నాణ్యతతో కడితే చ.అ. రూ.2000 నుంచి రూ.2500 వరకు అవుతుంది. మంచి ఫ్లాట్‌ రూ.15 లక్షల ధరలో తయారవుతుంది. నాణ్యమైన ఉత్పత్తులను వాడొచ్చు. ఈ ఇంటికి కేంద్రం పీఎంఏవై కింద రూ.2.7 లక్షల సబ్సిడీ ఇస్తోంది. రాష్ట్రం కూడా రూ.2.5 లక్షల సబ్సిడీ ఇవ్వాలి. మిగతా రూ.పది లక్షల్లో రూ.6 లక్షల రుణాన్ని బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇప్పించగల్గుతుంది. రూ.4 లక్షలు కొనుగోలుదారులు భరించాలి. ఈ విధానంలో పేదలందరికీ ఇళ్లు కట్టి ఇవ్వొచ్చు. ఇల్లు కొనుగోలుదారుడు.. రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌డ్యూటీ, జీఎస్‌టీ రూపంలో ప్రభుత్వానికి రూ.4 లక్షల వరకు చెల్లిస్తాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుదారులు కట్టే పన్నులను వారికే బదలాయిస్తున్నట్లు అవుతుంది. సర్కారుపై అదనపు భారం ఉండదు. ఈ విధానం అమలు చేస్తే పేదలందరికీ సౌకర్యవంతమైన, నాణ్యమైన ఇళ్లు అందించగలదు. కొత్త ప్రభుత్వం అడిగితే సూచనలను తెలియజేస్తాం.

రాష్టంలో పాత సర్కారు దిగిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. స్థిరాస్తి రంగంపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది?

హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ ఆటోమోడ్‌లో ఉంది. దీన్ని ఆటంకపర్చకపోతే చాలు. మార్కెట్‌లో వ్యాపారం అనేది ప్రజల సొమ్ముతో నడుస్తుంది. వీరు చెల్లించే పన్నులు, ఇతరత్రా వచ్చే ఆదాయంలో అంటే బడ్జెట్‌లో 15 శాతం మౌలిక వసతులపై వ్యయం చేస్తే సిటీ అవసరాలు తీరి ట్రాఫిక్‌, ఇతర సమస్యలు లేకుండా జీవనం సాఫీగా ఉంటుంది.  ఈ 15 శాతం మౌలిక వసతుల కల్పనపై కచ్చితంగా ఖర్చు చేసేలా పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ చేయాలి. మిగిలిన 85 శాతం ప్రభుత్వం వారి ప్రాధాన్యతల మేరకు ఉచిత పథకాలు, జీతాలు, ఇతరత్రా ఖర్చు చేయవచ్చు. అప్పుడు ప్రభుత్వం మారగానే రియల్‌ ఎస్టేట్‌ ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నం కాదు.

మున్ముందు మార్కెట్‌ ఎలా ఉండబోతుంది?

400 ఏళ్లలో హైదరాబాద్‌ కోటి జనాభాకు చేరింది. ఏటా సిటీలో 2.7 లక్షల జనాభా పెరుగుతోంది. కాబట్టి సిటీలో ఇళ్లకు డిమాండ్‌ ఉంటుంది. శివార్లు ఎక్కువ అభివృద్ధికి అవకాశం ఉంది. సిటీ కంటే శివార్లలో ధరల వృద్ధి అధికంగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడిని దీర్ఘకాలానికి చూడాలి. ఇందులో కనీసం 12 శాతం వార్షిక రాబడి గ్యారంటీగా వస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు