తూర్పున గృహోదయం

ఒకప్పుడు శివారు ప్రాంతంగా విసిరేసినట్లుగా నిర్మాణాలు ఉండే ఈ ప్రాంతం తక్కువ సమయంలోనే వేగంగా అభివృద్ధి చెందింది. ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల మాల్స్‌, మల్టీఫ్లెక్స్‌లు, ఆకాశహర్మ్యాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వ్యక్తిగత ఆవాసాలకు కేంద్రంగా

Updated : 12 Feb 2022 17:20 IST

ఈనాడు, హైదరాబాద్‌

కప్పుడు శివారు ప్రాంతంగా విసిరేసినట్లుగా నిర్మాణాలు ఉండే ఈ ప్రాంతం తక్కువ సమయంలోనే వేగంగా అభివృద్ధి చెందింది. ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల మాల్స్‌, మల్టీఫ్లెక్స్‌లు, ఆకాశహర్మ్యాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వ్యక్తిగత ఆవాసాలకు కేంద్రంగా ఉన్న కాలనీల్లో ఇప్పుడు బహుళ అంతస్తుల గృహ సముదాయాలు వస్తున్నాయి. స్థలాలు ధరలు పెరిగి వ్యక్తిగత ఇళ్ల ధరలు రూ.కోటి దాటడంతో బడ్జెట్‌లో దొరికే అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గు పెరిగింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. ఈ ప్రాంతంలో స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లు అధికం.  ఇప్పుడు కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా గేటెడ్‌ కమ్యూనిటీలు వస్తున్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.

అనుకూలతలు ఎక్కువ..

ఎల్‌బీనగర్‌ వరకు మెట్రోరైలు సదుపాయం ఉండటంతో సిటీలోని ఏ ప్రాంతానికైనా వేగంగా చేరుకునే సౌలభ్యం ఏర్పడింది. హైటెక్‌ సిటీ, మియాపూర్‌ ఎక్కడికైనా మెట్రోలో ట్రాఫిక్‌ ఇక్కట్లు లేకుండా వెళ్లొచ్చు. దీంతో ఇక్కడి నుంచి హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, మరోవైపు సాగర్‌రోడ్డులో బొంగుళూరు, ఆదిభట్ల వరకు 20 కి.మీ. దాకా స్థిరాస్తి మార్కెట్‌ విస్తరించింది.

విజయవాడ, సాగర్‌ జాతీయ రహదారులు ఉండటంతో రవాణా పరంగా అనుకూలంగా ఉంది. వీటిని కలుపుతూ ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌రోడ్డు అనుసంధానం మెరుగ్గా ఉండటంతో ఈ ప్రాంతం నివాసానికి అనుకూలంగా ఉంది.

ఎల్‌బీనగర్‌లో ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌లు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌ సమస్య తీరిపోయింది. మిగిలిన పనులు పూర్తైతే మరింత వేగంగా గమ్యస్థానం చేరుకోవచ్చు.  

అవుటర్‌ దూరమే అయినా చేరుకునేందుకు మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయానికి ఇక్కడి నుంచి సులువుగా చేరుకోవచ్చు.

సాగర్‌ రహదారిలో ఆదిభట్లలో ఐటీ, ఏరో సెజ్‌తో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఈ ప్రాంతానికి ఎల్‌బీనగర్‌ హబ్‌గా ఉంది.

వీటన్నింటితో ప్రస్తుతం ఈ ప్రాంతం నివాసాలకు అనుకూలంగా మారింది. భవిష్యత్తు వృద్ధికి అవకాశంగా ఉన్న మార్గంగా నిర్మాణదారులు చెబుతున్నారు.

ఎల్‌బీనగర్‌.. తూర్పు కొన.. ఒకప్పుడు ఆటోమొబైల్‌ కేంద్రంగా మాస్‌గా కనిపించిన ఈ ప్రాంతం.. ఇప్పుడు క్లాస్‌గా మారింది. మాల్స్‌, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఆటోమొబైల్‌ షోరూంలు, ఉద్యనాలు, మెట్రో అనుసంధానం, ప్లైఓవర్లు రావడంతో ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఆసక్తి పెరిగింది. మధ్యతరగతి కుటుంబాలు తమ బడ్జెట్‌లో ఇళ్లకు అనువైన ప్రాంతంగా గుర్తిస్తున్నారు. వార్షిక వేతనం రూ.ఐదారు లక్షలు అందుకునే వేతనజీవులు సైతం సొంతింటి కోసం ఈ దిక్కునే చూస్తున్నారు.

సామాజిక వసతులు సైతం..

నివాసం ఉండాలంటే విద్య, వైద్యం, వినోదం ప్రధానం. ఈ మూడు ఇక్కడ ఇటీవల కాలంలో సమకూరాయి. పలు పేరున్న విద్యా సంస్థలు ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల విశాలమైన ప్రాంగణాల్లో పాఠశాలలను ఏర్పాటు చేశాయి. రెండు జాతీయ రహదారులపై చిన్న, పెద్ద ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాంతానికి పెద్దాసుపత్రిని ప్రకటించింది. షాపింగ్‌ కోసం పాతరోజుల్లో మాదిరి ఎంతోదూరం వెళ్లాల్సిన పనిలేదు. అన్నిరకాల షోరూంలు ఇక్కడే ఉన్నాయి. వినోదం సైతం అందుబాటులోకి వచ్చింది. నాగోల్‌లో శిల్పారామం, వనస్థలిపురంలో హరిణ వనస్థలి పార్క్‌, అవుటర్‌ బయట రామోజీ ఫిలింసిటీ, ఇటు సాగర్‌రోడ్డులో బీఎన్‌రెడ్డి దాటిన తర్వాత అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు ఉండటం నివాసాలకు సానుకూలంగా మారింది.


మారిన ధోరణి..

మొదట్లో  ఈప్రాంతంలో ఎక్కువగా మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లా వాసులు స్థిర నివాసానికి మొగ్గుచూపినా.. ఇప్పుడు అన్ని ప్రాంతాల వారు ఉంటున్నారు. ఐటీ, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు సైతం తమ బడ్జెట్‌లో నివాసాలు కొనే స్థితిలో ఉండటంతో ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో రెండు పడక గదుల ఇంటికయ్యే వ్యయంలో సగం ధరకే ఇక్కడ లభిస్తుండటంతో ఐటీ ఉద్యోగులు ఇక్కడ కొలువుంటున్నారని నిర్మాణదారులు అంటున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లో రూ.కోటికి రెండు పడక గదుల ఇల్లు వస్తే.. అదే ధరకు ఇక్కడ మరింత విశాలమైన ఇల్లు వస్తుండటం వల్ల కూడా కొనుగోలుదారులు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండటం కూడా తూర్పు ప్రాంతానికి  కలిసి వచ్చింది. మెట్రో వచ్చాక ఐటీ కారిడార్‌కు చేరుకోవడం సులువు కావడంతో ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీటన్నింటితో కొన్నేళ్లుగా ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు నివాసాలకు అనుకూల ప్రాంతంగా మారింది. ‘ఈ ప్రాంతంలో మార్కెట్‌ ఇటీవల బాగా పుంజుకుంది. చుట్టుపక్కల ప్రాంతాలకు ఇదే ప్రధాన హబ్‌గా ఉంది. ఐటీ కారిడార్‌కు ఎలాగైతే గచ్చిబౌలినో.. ఈ ప్రాంతానికి ఎల్‌బీనగర్‌ అలాగ. మెట్రోరైలు స్టేషన్‌ ఉండటంతో ఎక్కడికైనా వేగంగా చేరుకునే సౌలభ్యంతో నివాసాలకు అనుకూలంగా చూస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలు వస్తున్నాయి. స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్ల నుంచి ఇప్పుడు పది అంతస్తుల భవనాలు ఈ ప్రాంతంలో వస్తున్నాయి. మున్ముందు పాతిక అంతస్తులకు విస్తరించనున్నాయి’ అని వాసవి గ్రూప్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసులు అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని