రియల్‌ ఎస్టేట్‌లో సాంకేతిక విప్లవం

రియల్‌ ఎస్టేట్‌ రంగం సాంకేతికత ఆవశ్యకతను గుర్తించింది. పరిశ్రమ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలు కనుగొనే దిశగా అడుగులు వేస్తోంది. టెక్నాలజీ పాత్రను వర్చువల్‌గా  ప్రాజెక్టుల సందర్శన, చెల్లింపుల వరకు

Updated : 12 Mar 2022 03:16 IST

వేగం పెంచేందుకు ఐటీ వినియోగం  

భవిష్యత్తు టెక్నాలజీలపైన పరిశ్రమ దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ రంగం సాంకేతికత ఆవశ్యకతను గుర్తించింది. పరిశ్రమ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలు కనుగొనే దిశగా అడుగులు వేస్తోంది. టెక్నాలజీ పాత్రను వర్చువల్‌గా  ప్రాజెక్టుల సందర్శన, చెల్లింపుల వరకు మాత్రమే పరిమితం చేయకుండా మరిన్ని అంశాలకు విస్తరించినప్పుడే పురోగతి సాధ్యమవుతుందని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు. పరిశ్రమలో ఇప్పటికే పెద్ద సంస్థలు సాంకేతికతను వినియోగిస్తున్నాయని.. చిన్న బిల్డర్లు అందిపుచ్చుకుంటేనే మనుగడ ఉంటుందని అంటున్నారు.

హైదరాబాద్‌ నిర్మాణ రంగంలో ఇదివరకు ఐదు నుంచి పది అంతస్తుల భవనాలు ఎక్కువగా కట్టేవారు. కొద్ది సంవత్సరాలుగా చూస్తే ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు. 20 నుంచి 50 అంతస్తుల వరకు పోటీపడి మరీ కడుతున్నారు. భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటే సంప్రదాయ పద్ధతిలో పనులు కొనసాగిస్తే అయ్యేపని కాదని నిర్మాణదారులు అంటున్నారు. ప్రతి దశలో సాంకేతికతను జోడించాలని అనుకుంటున్నారు. కొత్తతరం నిర్మాణ సాంకేతికతలు, ఆధునిక మార్కెటింగ్‌ పోకడలు, సమర్థమైన ప్రాజెక్ట్‌ నిర్వహణకు కొత్తగా వస్తున్న ఆవిష్కరణలు దోహదం చేస్తాయి.

ప్రణాళిక దశ నుంచే..

ప్రాజెక్టు ప్రణాళిక మొదలు సైట్‌లో పనులు, నాణ్యత తనిఖీలు, విక్రయాల వరకు.. ప్రధానంగా ఈ నాలుగు అంశాల్లో టెక్నాలజీ సులభతరం చేయడంలో తోడ్పడుతుంది.  

* ఏ ప్రాజెక్టుకైనా ప్రణాళిక ముఖ్యం. ఇందుకోసం మార్కెట్లో పలు రకాల సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రాజెక్ట్‌ డ్రాయింగ్స్‌ ఇస్తే ఎంత సామగ్రి అవసరం పడుతుంది? ఏ పనిని ఎన్నిరోజుల్లో పూర్తి చేయాలి? ఎంత ఖర్చవుతుంది అనే లెక్కలతో సహా ముందే కచ్చితత్వంతో తెలుసుకునే వీలుంటుంది.  

* పనులు జరిగే ప్రాజెక్టులకు తరచూ యజమానులు వెళ్లి పురోగతిని పరిశీలించేవారు. వెళ్లకపోతే నాణ్యత తెలిసేది ఎలా? సాంకేతికత తోడ్పాటుతో ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్‌ నుంచే పనులను పర్యవేక్షించొచ్చు. నాణ్యత తనిఖీలకు సాంకేతికతను వినియోగించుకోవచ్చు.

* ఆకాశహర్మ్యాల్లో ఏ టవర్‌లో ఏ పని జరుగుతోందో? పర్యవేక్షించడం కొంచెం కష్టమే. అదే టెక్నాలజీతో చాలా సులువు అంటున్నారు.  ఏ పని ఏ దశలో ఉంది అనేది ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌డేట్‌ చేయడం ద్వారా.. సైట్‌ ఇంజినీర్‌ నుంచి సీఈవో వరకు ఈ సమాచారం అరచేతిలో ఉంటుంది.

* ఒక ప్రాజెక్టులో ఎన్నో బృందాలు పనిచేస్తుంటాయి. వీరందర్నీ సమన్వయ పర్చడం కూడా కష్టమే. అందుబాటులోకి వచ్చిన వేర్వేరు సాంకేతికతల సహాయంతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు అంటున్నారు బిల్డర్లు.

* ప్రాజెక్టు ఆలస్యం కాకుండా గడువు కంటే ముందు కొనుగోలుదారులకు అప్పగించేందుకు కూడా  సాంకేతికత దన్ను ఉపయోగపడుతుంది. రియల్‌టైమ్‌లో ప్రాజెక్టుపై పర్యవేక్షణతో సాధ్యమవుతుంది.

* భవన నిర్మాణంలో పెద్ద సంఖ్యలో కూలీల అవసరం ఉంది. వీరి కూలీ రేట్లు పెరుగుతున్నాయి. వీరు అందుబాటులో ఉన్నా.. నిర్మాణ రంగంలో నైపుణ్యం కలిగిన కూలీల కొరత వేధిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వీరిని రప్పిస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికత వాడకాన్ని పెంచుతున్నారు. ఇదివరకు సిమెంట్‌, మట్టి ఇటుకలతో గోడలు కట్టేవారు. ఇందుకు చాలా రోజులు పట్టేది. మేవాన్‌ టెక్నాలజీ సహాయంతో గోడలు సైతం కాంక్రీట్‌తో కట్టేస్తున్నారు. ప్లాస్టరింగ్‌ చేసేందుకు యంత్రాలు అందుబాటుకి వచ్చాయి. బడా సంస్థలు వీటిని ఉపయోగిస్తున్నాయి.

* ప్రాజెక్టు వ్యయం పెరగడంలో సామగ్రి వృథా పాత్ర అధికం. యాప్‌ల తోడ్పాటుతో కచ్చితంగా ఎంత సామగ్రి అవసరం పడుతుందో లెక్కలేసి చెబుతుంది. ఆ ప్రకారం కొని తెచ్చుకుంటే సరిపోతుంది. వృథా అరికట్టడమే కాదు పర్యావరణానికి మేలు జరుగుతుంది.

* కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు డిజిటల్‌ పంథాను అనుసరిస్తున్నారు. ప్రాపర్టీ పోర్టల్‌ ఏర్పాటుతో నేరుగా విక్రయాలు చేపడుతున్నారు. లక్ష్యిత వినియోగదారుడిని చేరేందుకు ఇదే మేలైన, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారమని చెబుతున్నారు. వీటన్నింటినీ డాష్‌బోర్డుతో ఎప్పటికప్పుడు పురోగతిని సంస్థల యజమానులు తెలుసుకుంటున్నారు.

కొవిడ్‌ అనంతరం..

కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయం రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమతో సహా అన్ని రంగాల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ రంగంలోనూ కొత్త ఆవిష్కరణలు, ఆధునికీకరణపై స్థిరాస్తి సంఘాలు, బిల్డర్లు అవగాహన పెంపొందించుకుంటున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు అప్లికేషన్ల గురించి వాటితో కలిగే ప్రయోజనాల గురించి చర్చిస్తున్నారు. సమయం, ఖర్చు తగ్గి.. నాణ్యత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుందని విశ్వసిస్తున్నారు.పలు అంకుర సంస్థలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి.

త్రీడీ ప్రింటింగ్‌  టెక్నాలజీలో ఇళ్లు

నిర్మాణ రంగంలో భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయనే సంకేతాలను పరిశ్రమ వర్గాలు ఇస్తున్నాయి. మున్ముందు ఇళ్లను త్రీడీ ప్రింటింగ్‌ విధానంలో చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. భారీ పరిమాణంలో ఉండే ప్రింటింగ్‌ మిషన్‌లో డ్రాయింగ్‌లను పొందుపరిస్తే చాలు  ఇళ్లు అయిపోతుంది. యూఎస్‌లో ఇప్పటికే మొదలెట్టారు. ఏడాది పట్టే ఇళ్ల నిర్మాణం ఈ విధానంలో గంటల్లోనే పూర్తవుతుంది. అనుకున్నదానికంటే మంచి నాణ్యతతో ఇల్లు పూర్తవుతుంది. పని పరంగా లోపాలు ఉండవు. కోరుకున్న విధంగా తయారవుతుంది. ఇల్లు కట్టేచోటనే ప్రింటర్‌ సహాయంతో వీటిని కట్టేయవచ్చు.


నిర్మాణంలో వేగం పెరుగుతుంది

 - కె.ఇంద్రసేన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్‌ తెలంగాణ

మనదేశంలో పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో 4 ఏళ్లు ఆలస్యం అవుతోందని నివేదికలు ఉన్నాయి. ఇందుకు ప్రణాళిక లోపమే ప్రధానమైన కారణం. కచ్చితంగా అంచనా వేయలేక పోవడం కూడా మరో లోపం. సాంకేతికతతో వీటికి చెక్‌ పెట్టొచ్చు. వేగం, నాణ్యత, సమయానికి పూర్తిచేయడం, పారదర్శకత పెంపొందించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రియల్‌ ఎస్టేట్‌లో ప్రాజెక్టుపై ఓనర్‌ డ్రైవ్‌ ఎక్కువగా ఉంటుంది. సిస్టమ్‌ డ్రైవ్‌లోకి వెళ్లేందుకు ఇది ఉపకరిస్తుంది. భవిష్యత్తులో త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఇళ్లు, డిజిటల్‌ మార్కెటింగ్‌ గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని భావిస్తున్నాం. క్రెడాయ్‌ మొదటి ఎడిషన్‌ టెక్‌కాన్‌ 22 లోనూ కొత్త టెక్నాలజీలు, సాఫ్ట్‌వేర్‌లు, టూల్స్‌ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని