చిన్న ఇల్లు.. చిట్టి మొక్కలు

ఇంటికి ఎన్ని రకాల అలంకరణలు చేసినా.. ఎంతో ఖరీదైన వస్తువులున్నా.. మొక్కలతో వచ్చే అందమే వేరు.  కళ్లకు, మనసుకు హాయినివ్వడమే కాదు ఇంట్లో స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యం మెరుగుపడేందుకు సైతం దోహదం చేస్తాయి. చిన్న ఇళ్లలో ఉండేందుకే

Published : 20 Aug 2022 02:08 IST

ఈనాడు, హైదరాబాద్‌ 

ఇంటికి ఎన్ని రకాల అలంకరణలు చేసినా.. ఎంతో ఖరీదైన వస్తువులున్నా.. మొక్కలతో వచ్చే అందమే వేరు.  కళ్లకు, మనసుకు హాయినివ్వడమే కాదు ఇంట్లో స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యం మెరుగుపడేందుకు సైతం దోహదం చేస్తాయి. చిన్న ఇళ్లలో ఉండేందుకే చోటు కష్టంగా ఉంటే.. ఇవన్నీ ఎక్కడ పెంచగలం అనేవారి కోసమే ఇప్పుడు చిట్టి మొక్కలు వచ్చాయి. నెక్లెస్‌ రోడ్డులో జరుగుతున్న మేళాలో వీటిని చూస్తుంటే రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఉన్నాయి. 

మనసుండాలి కానీ మార్గం లేకుండా పోదు.. ఇండోర్‌ మొక్కలను పెద్దపెద్ద కుండీల్లోనే పెంచాల్సిన పనిలేదు. చాలా చిన్న కుండీల్లో పెంచుకునే మొక్కల రకాలు వచ్చాయి. ఎక్కువగా ఎడారి జాతివి వీటిలో పెంచుతున్నారు.

* జడే ప్లాంట్, బిగోనియా, ఫిట్టోనియా ఆర్చిడ్స్, ఆఫ్రికన్‌ వాయిలెట్స్, అలోవెరా, బేబిటోస్, ఫ్లేమింగో ఫ్లవర్‌.. ఇంకా ఎన్నో రకాల పూల మొక్కలు పెంచుకోవచ్చు 

* ఆకుపచ్చ రంగులో ఆకులతో నిండిపోయి గుత్తులుగా కళకళలాడేలా ఉన్నాయి.  రంగుల ఆకులతో కొన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటే.. మరికొన్ని పూలగుత్తి ఆకారంలో భిన్న రంగుల్లో పెరిగి అబ్బురపర్చేలా ఉన్నాయి. 

* ఇంట్లో పెంచుకునే ఈ మొక్కలను అభిరుచి కలిగినవారు మరింత అందంగా పెరిగేలా చూసుకోవచ్చు. జడే మొక్కతో చాలా ప్రయోగాలకు అవకాశం ఉంది. వీటిని చూస్తే ఇంటికొచ్చిన అతిథులు ఫిదా అవ్వాల్సిందే. 

* చిట్టి మొక్కల నిర్వహణ సులభమే. ఎక్కువ నీరు అవసరం లేదు. ప్రతి రోజూ అంతకంటే అవసరం లేదు. కొద్ది నీటితో వారం రోజుల వరకు ఆరోగ్యంగా పెరుగుతాయి. కొన్నింటికి రోజు తప్పించి రోజు ఇస్తే సరిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని మొక్కలకు రోజులో గంట సేపు ఎండ నేరుగా కాకుండా వెలుతురులో ఉంచితే చాలు.

* స్థలం ఉంటే బాల్కనీలోనే పెంచుకోవచ్చు. లేకపోతే ఇంట్లో టీవీ స్టాండ్, డైనింగ్‌ టేబుల్, డెస్క్‌టాప్, కిటికీ గ్రిల్స్‌ ఇలా కావాల్సిన చోట ఏర్పాటు చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని