Published : 10 Sep 2022 02:54 IST

ఫర్నిచర్‌ కొనుగోలు చేయబోతున్నారా ?

ఈనాడు, హైదరాబాద్‌

ఇంటి అలంకరణలో ఫర్నిచర్‌ కూడా కీలకం. కాలానుగుణంగా మారుతున్న పోకడలకు తగ్గట్టుగా వీటి ఎంపికకు ప్రాధాన్యత ఇస్తుంటారు. చూడటానికి చక్కగా ఉంటే మాత్రమే సరిపోదని.. సౌకర్యం, మన్నిక కూడా ముఖ్యమే అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ఫర్నిచర్‌ కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు.

* ఫర్నిచర్‌ షోరూంకు వెళ్లి నచ్చిన సోఫాలు, బెడ్‌లు ఆర్డర్‌ ఇస్తే.. తీరా ఇంటికి వచ్చాక సరిపోకపోవచ్చు. కింగ్‌సైజ్‌ బెడ్‌ తీసుకొస్తే.. పడక గదిలో అంత స్థలం లేకపోతే.. తిరిగి వెనక్కి పంపి క్వీన్‌ సైజ్‌ తెచ్చుకోవడం అంటే చాలా వ్యయ ప్రయాసలు తప్పవు. అందుకే దుకాణానికి వెళ్లడానికంటే ముందే ఇంట్లో కొలతలు తీసుకుని వెళ్లాలి. సోఫాలకు కూడా ఇదే వర్తిస్తుంది.  షోరూంలో నచ్చిన ఫర్నిచర్‌ ఎంపిక చేసుకున్నాక ఒకసారి కొలతలు సైతం సరిచూసుకుంటే సరిపోతుంది.

* ఇంటి గోడల రంగులను బట్టి కూడా వీటిని ఎంపిక చేసుకోవాలి. అదే రంగులో కలిసిపోయే వాటిని ఎంపిక చేసుకోవచ్చు. పరస్పర విరుద్ధమైన రంగుల్లో ఉన్నవాటిని కూడా ప్రయత్నించవచ్చు. కొత్త ఇల్లు అయితే ఎలాంటివి కొనబోతున్నారో ముందే ప్రణాళిక ఉంటే దానికి తగ్గట్టుగా కూడా రంగులను వేసుకోవచ్చు.

* ఫర్నిచర్‌ విక్రయాల్లో ఆఫర్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటాయి. వీటిలో కొంటే చాలా సొమ్ములు ఆదా అవుతాయి. ఫర్నిచర్‌ తయారు చేసి ఎంతకాలం అయ్యింది? నాణ్యత ఎలా ఉంది వంటివి తప్పక చూసుకోవాలి. లోపాలున్నవి, అమ్ముడుపోని వాటినే తక్కువ ధర అంటూ విక్రయిస్తుంటారు. ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకుని కొనుగోలు చేయాలి.  పదేళ్లు మన్నిక వస్తే చాలు. అంతకంటే ఎక్కువకాలం వస్తే ఇంకా మంచిది. కానీ ఈ లోపే  చాలామంది మార్చేస్తున్నారు. గతంలో ఒకసారి కొంటే యాభై ఏళ్ల పాటూ ఉండేవి. అప్పట్లో సొంతంగా తయారు చేయించుకునే వాళ్లు.

* మార్కెట్లో ప్రస్తుతం వింటేజ్‌, ట్రెండీ కలెక్షన్లు నడుస్తున్నాయి. వింటేజ్‌ చాలా ఖరీదు. బరువు కూడా అధికంగా ఉంటాయి. తక్కువ బరువు, నేటి పోకడలకు తగ్గట్టుగా ఉండేవి ట్రెండీ కలెక్షన్‌. కలపను బట్టి వీటి ధరలు ఉన్నాయి. తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకునే ఫర్నిచర్‌కే ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.

* ఇంట్లో పిల్లలు, పెద్దలు వీటి కారణంగా గాయాల పాలవుతున్నారు. ఫర్నిచర్‌ తయారీలో, ఎంపికలో లోపాలే ఇందుకు కారణం.  ఫర్నిచర్‌, కప్‌బోర్డుల చివర్లలో సరైన ఫినిషింగ్‌ ఉన్నవాటినే ఎంపిక చేసుకోవాలి. 

* ఇంట్లో ఎప్పటికీ కుదురుగా ఉండేలా చేయించుకునే బెడ్‌లు, సోఫాల కంటే విడిభాగాలు తీసుకొచ్చి జోడించే ఫర్నిచర్‌ మేలు. ఇల్లు మారినా.. కొత్తది కొనుగోలు చేయాలన్నా.. పాతవాటిని సులువుగా తరలించవచ్చు.

* ఏదీ కొన్నా నిర్వహణను దృష్టిలో పెట్టుకోవాలి. ఇంట్లో పిల్లలుంటే ఫర్నిచర్‌పై పాలు, నీళ్లు పడే అవకాశం ఉంది. కాబట్టి  ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడానికి వీలుండే వాటిని ఎంపిక చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts