కదిలే గోడలు

భూముల ఖరీదు పెరగడంతో ఇళ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. ఐటీ కారిడార్‌లో రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తే మూడు పడక గదుల ఫ్లాట్‌ మాత్రమే వస్తుంది.

Published : 10 Jun 2023 00:13 IST

ఇళ్లలో స్థలం సద్వినియోగానికి ప్రయోగాలు

ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎక్కువ సమయం గడిపే గదుల్లో లివింగ్‌ రూం తొలి స్థానంలో ఉంటుంది. వీటి విస్తీర్ణం మాత్రం రోజురోజుకు తగ్గిపోతోంది. మాస్టర్‌ బెడ్‌రూంకు  ప్రాధాన్యం ఇస్తున్నారు. వంట గదిని మగువలు తమకు నచ్చినట్లుగా విశాలంగా తీర్చిదిద్దుకుంటున్నారు. పిల్లలు తమ గదిపై చిన్నచూపేలా అంటున్నారు. ఈ కారణంగా లివింగ్‌ రూం విస్తీర్ణానికి కోత పడుతోంది. 1800 చ.అ. విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ తీసుకుంటే.. పేరుకే పెద్దది తప్ప మూడు పడక గదులతో నిండిపోతుంది. బంధుమిత్రులు వచ్చినప్పుడు తప్ప మూడో పడక గదితో ఉపయోగం ఉండటం లేదు. దీంతో కొత్తగా కడుతున్న ఇళ్లలో కదిలే గోడలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హోటల్స్‌, కన్వెన్షన్‌ కేంద్రాల్లోనే కనిపించిన కదిలే గోడలు.. ఇప్పుడు ఇళ్లలోకి వచ్చేశాయి.

ఈనాడు, హైదరాబాద్‌: భూముల ఖరీదు పెరగడంతో ఇళ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. ఐటీ కారిడార్‌లో రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తే మూడు పడక గదుల ఫ్లాట్‌ మాత్రమే వస్తుంది. సిటీలో ఇతర ప్రాంతాల్లోనూ రూ.కోటి దాకా పలుకుతున్నాయి. రెండు పడకల గదితో సర్దుకోవాల్సి వస్తోంది. ధరలు పెరగడంతో నిర్మాణదారులు ఇంటి విస్తీర్ణాన్ని తగ్గించేస్తున్నారు. ఇక్కడే స్థలం సమస్యను పరిష్కరించేందుకు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని కొత్త ప్రాజెక్టుల్లో కొన్ని సంస్థలు కదిలే గోడల ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. ఇంట్లో ఉన్న విస్తీర్ణాన్ని అవసరానికి తగ్గట్టుగా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేలా వీటి ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నాయి.

ప్యానల్స్‌ ఏర్పాటు ద్వారా

గోడలు అనగానే సంప్రదాయ ఇటుకతో కట్టేవి గుర్తుకొస్తాయి. ఇంట్లో ఇవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. వీటి స్థానంలో పలువురు బిల్డర్లు ఇప్పటికే ప్యానల్స్‌ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. తక్కువ మందం.. పటిష్ఠత సైతం మెరుగ్గా ఉంటుందని నిర్మాణదారులు చెబుతున్నారు. అయితే  కదిలించడానికి వీల్లేకుండా బిగించేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో అంతర్గత గోడలకు వీటిని ఉపయోగించడం ద్వారా ఇల్లు మరింత విశాలంగా కనిపించేలా చేస్తున్నారు. నిర్మాణ సమయంలోనే వీటిని గుర్తించే కొనుగోలుదారులకు చెబుతున్నారు.

తేలికగా..

ఎలాగూ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటిని స్థిరంగా ఉంచి కట్టే బదులు కదిలేలా చేస్తే ఇంట్లో స్థలాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనతోనే కదిలే గోడలు వచ్చాయి. హాంకాంగ్‌, ప్యారిస్‌ వంటి నగరాల్లో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడిప్పుడే మన దగ్గర పరిచయం చేస్తున్నారు. కొందరైతే ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో భాగంగా కదిలే గోడలను చేయించుకుంటున్నారు. చిన్న పిల్లల గది పగటిపూట తగ్గించుకుని హాల్‌ను పెంచుకునేలా సర్దుబాట్లు చేసుకుంటున్నారు. ఇవి ఇంటీరియర్స్‌లో కలిసిపోయి ఉంటాయి కాబట్టి చెబితే తప్ప వాటిని కదిలించవచ్చని గుర్తించలేరు. అంత బాగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. తేలికగా తరలించేలా.. తిరిగి బిగించుకునేలా వీటిలో ఏర్పాట్లు ఉంటాయి.


మరింత  అధునాతనంగా

ఇప్పుడే పరిచయం అవుతున్న ఈ పోకడ మున్ముందు మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉందని నిర్మాణదారులు అంటున్నారు. విదేశాల్లో అయితే ఇంకా ఒక అడుగు ముందుకేశారు. స్టూడియో హోమ్స్‌లో గోడలను బహుళ విధాలుగా ఉపయోగించుకుంటున్నారు. మన దగ్గర స్టూడియో హోమ్‌లోనూ అన్నీ స్థిరంగా ఉంటాయి. స్థలం తక్కువ కాబట్టి పగటిపూట బెడ్‌ కాస్తా గోడకు నిలబెట్టేస్తే అదొక డిజైన్‌ మాదిరి కనిపిస్తుంది. వీటిని సులువుగా కదిలేలా ఇంటీరియర్స్‌ చేస్తున్నారు.


ఎంత వ్యయం అవుతుంది?

ప్రస్తుతానికి సంప్రదాయ గోడల నిర్మాణానికి కంటే వీటికే మన దగ్గర ఎక్కువ వ్యయం అవుతోంది. వాల్‌ ప్యానెల్‌ చదరపు అడుగు రూ.75 వరకు అవుతోందని చెబుతున్నారు. మార్కెట్లో ఇప్పటికే పలువురు వీటిని తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్లోనూ విరివిగా అందుబాటులో ఉంటున్నాయి. స్థలం బహుళ ఉపయోగకరంగా వాడుకోవాలనుకుంటున్నవారు ఖర్చుకు వెనకాడక వీటివైపు చూస్తున్నారు. వీటి వాడకం పెరిగితే వ్యయం తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని