హరిత ప్రాజెక్టులన్నీ ఒకే చోట

ఇంటి నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. ఇల్లు పూర్తైన తర్వాత కూడా కొంతవరకు దీని ప్రభావం ఉంటుంది.

Updated : 17 Jun 2023 07:24 IST

దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో ఐజీబీసీ గ్రీన్‌ ప్రాపర్టీ షో

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. ఇల్లు పూర్తైన తర్వాత కూడా కొంతవరకు దీని ప్రభావం ఉంటుంది. పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకునేలా ఇల్లు కట్టుకోవాలని చాలామంది భావిస్తున్నా.. ఎలాంటి నిర్మాణ ఉత్పత్తులు వాడాలి? ఇవి ఎక్కడ దొరుకుతాయి? వాటిని గుర్తించేది ఎలా? ఇవేవీ కాకుండా కట్టిన హరితభవనాల్లో కొనాలంటే.. ఎవరెవరు వీటిని కడుతున్నారు?  ఇటువంటి సందేహాలన్నింటికి సమాధానంగా ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) మొదటిసారిగా హరిత ప్రాపర్టీ షోని వచ్చే నెలలో ఏర్పాటు చేయబోతుంది.

హరిత భవనాలతో ఏంటి ప్రయోజనం?

* గణనీయంగా నీరు ఆదా అవుతోంది. ప్రతి ఇంటికి సగటున రూ.500 నుంచి రూ.1000 వరకు నీటి బిల్లులు ఆదా అవుతాయి. నీటిని శుద్ధి చేసి దాదాపు సగం మేర పునర్వినియోగిస్తారు. భూగర్భంలో తోడే నీళ్లు తగ్గుతాయి.
* కరెంట్‌ వినియోగం తక్కువగా ఉంటుంది. సగటున ప్రతి ఇంటి నెల బిల్లు రూ.300 నుంచి రూ.700 వరకు ఆదా అవుతుంది. సౌర, పవన విధానాలతో విద్యుత్తును భవనాలపైనే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇవన్నీ పర్యావరణానికి మేలు చేస్తాయి.
* హరిత భవనాలకు దీర్ఘకాలంలో ఆస్తి విలువ ఎక్కువ పెరుగుతోంది. వీటిలో నివసించేవారు, పనిచేసేవారు ఆరోగ్యంగా ఉంటారు.
* సాధారణ భవనాలతో పోలిస్తే హరిత భవనాల్లో వెలువడే కాలుష్య ఉద్గారాలను, పర్యావరణానికి కల్గించే దుష్ఫ్రభావాన్ని తగ్గిస్తుంది.

గుర్తించడం ఎలా?

హరిత భవనాలకు 31 విభాగాల్లో ఐజీబీసీ రేటింగ్‌ వస్తోంది. ఇందులోనూ ఒక్కో విభాగంలో భవనం నిర్మించిన డిజైన్‌, ఉపయోగించిన  ఉత్పత్తుల ఆధారంగా సర్టిఫైడ్‌, సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినం రేటింగ్‌ ఇస్తారు. వీటి లోగోల ఆధారంగా గుర్తించవచ్చు. భవనాల్లో ఉపయోగించే సామగ్రికి గ్రీ ప్రొ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

మనం ఎక్కడ ఉన్నాం?

* ప్రపంచంలో హరిత భవనాల్లో భారత్‌ రెండో ర్యాంకులో ఉంది.
* తెలంగాణలో 682 ప్రాజెక్టుల్లో 1.12 బిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత నిర్మాణాలు విస్తరించాయి.
* దేశవ్యాప్తంగా 11వేల ప్రాజెక్టులు ఐజీబీసీలో రిజిస్టర్‌ అయ్యాయి. 10.27 బిలియన్‌ చదరపు అడుగుల నిర్మాణాలు ఉన్నాయి.
* 8.50 లక్షల ఎకరాల్లో హరిత ప్రాజెక్టులు చేపట్టారు.
* 6500 మంది ఐజీబీసీ గుర్తింపు పొందిన నిపుణులు అందుబాటులో ఉన్నారు.


దేశంలోనే మొదటిసారి

- సి.శేఖర్‌రెడ్డి, ఛైర్మన్‌, ఐజీబీసీ, హైదరాబాద్‌ చాప్టర్‌

జులై 28 నుంచి 30 తేదీ వరకు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఐజీబీసీ గ్రీన్‌ ప్రాపర్టీ షో నిర్వహిస్తుంది. ఈ తరహా హరిత భవనాల ప్రాజెక్టులో దేశంలోనే చేపడుతున్న మొదటి ప్రాపర్టీ షో ఇది. ఐజీబీసీ రేటింగ్‌ పొందిన ప్రాజెక్టులు, ఉత్పత్తులు మాత్రమే ఇక్కడ ప్రదర్శిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు