వస్తున్నాయ్‌.. విద్యార్థి గృహాలు

రియల్‌ ఎస్టేట్‌లో మరో కొత్త విభాగం వేగంగా విస్తరిస్తోంది. స్టూడెంట్‌ హౌసింగ్‌ ప్రాచుర్యం పొందుతోంది. విద్యార్థుల కోసం సకల సౌకర్యాలు ఉండే గృహ సముదాయాలను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Updated : 22 Jul 2023 06:23 IST

రియల్‌ ఎస్టేట్‌లో కొత్త విభాగంగా విస్తరణ

రియల్‌ ఎస్టేట్‌లో మరో కొత్త విభాగం వేగంగా విస్తరిస్తోంది. స్టూడెంట్‌ హౌసింగ్‌ ప్రాచుర్యం పొందుతోంది. విద్యార్థుల కోసం సకల సౌకర్యాలు ఉండే గృహ సముదాయాలను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. దిల్లీ, బెంగళూరుతో పాటూ మరికొన్ని నగరాల్లో స్టూడెంట్‌ హౌసింగ్‌ను నిర్వహిస్తున్న సర్వీస్‌ ప్రొవైడర్లు హైదరాబాద్‌తో పాటూ దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరిస్తున్నారు. నాణ్యమైన వసతికి భరోసా అంటున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా వారి వసతి గృహాల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ఇప్పటివరకు ఒక గది, అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని ముగ్గురు నలుగురు విద్యార్థులు కలిసి ఉంటున్నారు. చాలాసార్లు వీరికి నగరాల్లో గది దొరకడం కష్టంగా ఉంటోంది. కొంతమంది పేయింగ్‌ గెస్ట్‌లు(పీజీ)గా ఉంటున్నారు. ఇంకొందరు కళాశాల సమీపంలోని హాస్టళ్లలో నివాసం ఉంటున్నారు. వీటిలో సౌకర్యాలు అంతంతమాత్రమే. అపరిశుభ్రంగా ఉంటున్నాయని తరచూ విద్యార్థులు ఫిర్యాదు చేస్తుంటారు. పరిసరాలు చదువుకోవడానికి అనుకూలంగా ఉండవు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఈ తరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లుగా విద్యార్థుల గృహాలు ఉంటున్నాయి. ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉన్న నగరాల్లో ఆదరణ బాగుందని సర్వీసు ప్రొవైడర్లు అంటున్నారు.

విస్తరణ బాటలో

* హైదరాబాద్‌, గుర్గావ్‌, పుణె, బెంగళూరు, విశాఖపట్నంలలో స్టూడెంట్‌ హౌసింగ్‌ నిర్వహిస్తున్న హౌసర్‌ కో లివింగ్‌ సంస్థ దిల్లీ, కోటాకు విస్తరిస్తోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆయా నగరాల్లో విద్యార్థులకు వసతి కల్పించనుంది.

* యూవర్‌ స్పేస్‌ సంస్థ దిల్లీ, ముంబయి, పుణెలో 5500 పడకలు కలిగి ఉంది. జైపూర్‌, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, కోట, కోల్‌కతాకు విస్తరించబోతుంది. 2024 నాటికి 20వేల పడకలకు విస్తరిస్తోంది.

* ఆలివ్‌ లివింగ్‌ ప్రస్తుతం 2500 పడకల స్టూడెంట్‌ హౌసింగ్‌ కలిగి ఉంది. కొద్ది సంవత్సరాల్లో 20 వేలకు విస్తరిస్తున్నారు.

* స్టాంజా లివింగ్‌ సంస్థ ఇప్పటికే ఉన్న పడకలను ఈ ఏడాది ఆఖరు నాటికి 30వేల వరకు విస్తరించే ప్రణాళికలో ఉంది.

అద్దెలు పెరుగుతున్నాయ్‌

హాస్టళ్లతో పోలిస్తే విద్యార్థి గృహాల అద్దెలు కాస్త ఎక్కువే ఉంటాయి. అత్యంత శుభ్రంగా, విద్యార్థికి కావాల్సిన అన్ని వసతులు ఉండేలా ఈ గదులు ఉండనున్నాయి. ఒక గదిలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉంటారు. వద్దనుకుంటే ఒక్కరే ఉండొచ్చు. తల్లిదండ్రులు సైతం అద్దె కంటే తమ పిల్లలు మంచి వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవి ఉంటున్నాయి. ఈ తరహా నివాసాల్లో అద్దెలు నెలకు ఒక విద్యార్థికి 2021లో రూ.9వేల నుంచి రూ.14,500 వరకు ఉండేవి. 2022 నాటికి రూ.11,200 నుంచి రూ.18,500కు పెరిగాయి. ఇవి బెంగళూరు, దిల్లీ, పుణె, ముంబయిలలో సగటు ధరలు. ఏటా వీటి అద్దెలు 10 నుంచి 15 శాతం పెరుగుతున్నాయి. కొవిడ్‌ తర్వాత టయర్‌-1 నగరాల్లో ఏకంగా 15 శాతం పెరిగాయి.

ఇప్పుడున్న పడకలు లక్ష లోపే

విద్యార్థుల గృహాల విభాగంలో క్యాంపస్‌ బయట ప్రస్తుతం లక్ష  పడకలు మాత్రమే ఉన్నాయి. విద్యాసంస్థలు అధికంగా ఉన్న నగరాల్లో వీటిని కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నాయి. డెహ్రడూన్‌, వడొదర, ఇండోర్‌, కోయంబత్తూర్‌, జైపూర్‌, కోట, అహ్మదాబాద్‌, మణిపాల్‌, కొచ్చి, విద్యానగర్‌, నాగ్‌పూర్‌లలో అందుబాటులో ఉన్నాయి.

విద్యార్థుల వలసలు

ఉన్నత చదువుల కోసం విద్యార్థులు విదేశాలకే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలస వెళుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో 1.1 కోట్ల మంది చదువుల కోసం ఇల్లు దాటి బయటికొచ్చారు. వీరి సంఖ్య 2036 నాటికి 3.1 కోట్లు అవుతుందని కొలియర్స్‌ ఇండియా సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. 13 ఏళ్లలో మూడింతలు పెరగనున్నారు. ఏటా 7.5 శాతం వృద్ధి ఉంటుందన్నారు.

* ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యార్థి గృహాలు 75 లక్షల్లో అత్యధికం విద్యాసంస్థల్లోనే ఉన్నాయి. ప్రస్తుత అవసరాలే తీర్చలేకపోతున్నాయి. స్టూడెంట్‌ హౌసింగ్‌కు కొరత చాలా ఉంది. మున్ముందు వీటికి డిమాండ్‌ అధికంగా ఉండనుంది. దీంతో మరింత మంది డెవలపర్లు, ఇన్వెస్టర్లు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు.

* 2021-22లో కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు 4.23 కోట్లు ఉండగా... 2035-36 నాటికి 9.2 కోట్లకు చేరనుందని అంచనా వేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని