ధరలు పెరిగినా.. విస్తీర్ణంలో తగ్గేదేలే

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో జులై నెలలో 5,557 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.2,878 కోట్లని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది.

Published : 12 Aug 2023 03:18 IST

 జులైలో 5,557 ఇళ్ల రిజిస్ట్రేషన్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో జులై నెలలో 5,557 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.2,878 కోట్లని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. రాజధాని పరిధిలోకి వచ్చే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల గణాంకాలను వెల్లడించింది. ఇళ్ల రిజిస్ట్రేషన్లలో గత మూడేళ్లను పరిశీలిస్తే హెచ్చుతగ్గులు ఉన్నాయి. 2021 జులైలో కరోనా అనంతరం బేస్‌ ఎఫెక్ట్‌ ప్రభావంతో లావాదేవీలు భారీగా జరిగాయి. ఏకంగా 9,507 రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాది జులైలో 4,406 యూనిట్లకు పడిపోయాయి. వీటితో పోలిస్తే ఈసారి 26 శాతం పెరిగి 5,557 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. జూన్‌ రిజిస్ట్రేషన్లు 5566, మే 5877తో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.

ఏ ధరల్లో కొంటున్నారు..

రిజిస్ట్రేషన్‌ ధర, మార్కెట్‌ ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అధికారిక విలువ ప్రకారం చూస్తే రూ.25 లక్షల లోపు నివాసాల్లో గత ఏడాదికి ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. అప్పుడు ఇప్పుడు వీటి వాటా మొత్తం రిజిస్ట్రేషన్లలో 18 శాతంగా ఉంది.* రూ.25-50 లక్షల ధరల శ్రేణిలోని రిజిస్ట్రేషన్లు గత ఏడాది 56 శాతం జరిగితే ఈసారి 52 శాతానికి తగ్గాయి. ఈ ధరల్లో నచ్చిన ఇళ్లు దొరక్కపోవడంతో మరింత ఎక్కువ వెచ్చించాల్సి వచ్చింది. ఫలితంగా రూ.50-75 లక్షల శ్రేణిలోని నివాసాల వాటా 13 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది.* ధరల ప్రభావం అన్ని శ్రేణుల్లోని ఇళ్లపై ఉంది. రూ.75 లక్షల నుంచి కోటి లోపు గత ఏడాది వాటా 6 శాతం ఉంటే.. ఈసారి 7 శాతానికి పెరిగింది. రూ.1-2కోట్ల మధ్య ధరలు ఉన్న ఇళ్ల వాటా 5 నుంచి 7 శాతానికి పెరిగింది. రూ.2 కోట్లపైన ఇళ్ల వాటా యథాతథంగా 2 శాతంగా ఉంది.

విస్తీర్ణం పరంగా..  - చిన్న ఇళ్లపై నగరవాసులు ఆసక్తి చూపడం లేదు. 500 చదరపు అడుగుల లోపు కొనేవారు 3 శాతంగా ఉన్నారు. 500-1000 చ.అ.లోపు 18 శాతం మొగ్గుచూపుతున్నారు. - ఎక్కువ శాతం 1000-2000 చ.అ. ఇళ్లను కొంటున్నారు. వీటి వాటా 67 శాతంగా ఉంది.  - 2వేల నుంచి 3వేల లోపు వాటా స్థిరంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే 7 నుంచి 9 శాతానికి పెరిగింది. 3వేల చ.అ.పైన కొంటున్నవారు 2 శాతంగా ఉంటున్నారు.

ధరలు చూస్తే..  నగరంలో ప్రాంతాలను బట్టి చదరపు అడుగు ధరల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్‌ జరిగిన విలువల ఆధారంగా సగటు చూస్తే.. హైదరాబాద్‌ జిల్లాలో చ.అ.రూ.4,263గా ఉంది. వార్షికంగా 2 శాతం ధరలు పెరిగాయి. * మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో చ.అ. సగటు ధర రూ.3,083గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 5 శాతం ధరలు పెరిగాయి. * రంగారెడ్డి జిల్లాలో చ.అ.సగటు ధర రూ.4,077గా ఉంది. ఇక్కడ వార్షిక ధరల వృద్ధి 4 శాతం పెరిగింది.  * సంగారెడ్డి జిల్లాలో సగటు చ.అ. ధర రూ.2,350గా ఉందని.. గత ఏడాది పోలిస్తే 9 శాతం ధరలు తగ్గాయని నివేదికలో సదరు సంస్థ తెలిపింది.

 అన్నివర్గాల వారికి  ఇళ్లు అందుబాటులో

కె.ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌, క్రెడాయ్‌ తెలంగాణ

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లోనూ ధనవంతుల నుంచి మధ్యతరగతి వర్గాల వరకు ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. మధ్యతరగతి కోసం క్రెడాయ్‌ బిల్డర్లు చేస్తున్నవే లక్షల యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. అడుగు రూ.100 నుంచి రూ200కు తక్కువకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. ఈ విభాగంలో విక్రయాలు ఆశించినంతగా లేవు. * విస్తీర్ణం పరంగా కొనుగోలుదారులు రాజీపడటం లేదు. రూ.45 లక్షల్లో ఫ్లాట్‌ ఇవ్వాలని 800 చదరపు అడుగులకు కుదిస్తే అందరూ వెయ్యి చదరపు అడుగులపైనే కావాలని కోరుకుంటున్నారు. ఫలితంగా కట్టిన ఇళ్లు అమ్ముడుపోక బిల్డర్లు.. అధిక ధరల్లో ఉండే ఎక్కువ విస్తీర్ణం కల్గిన ఇళ్లు కొనలేక కొనుగోలుదారులు సతమతం అవుతున్నారు. విస్తీర్ణంలో రాజీపడకపోతే అందుబాటు ధరల్లో ఇళ్లు కష్టం అని కొనుగోలుదారులు గుర్తించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని