పర్యావరణ హితం.. మురుగు శుద్ధం

గేటెడ్‌ కమ్యూనిటీల్లో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లు(ఎస్‌టీపీ) తప్పనిసరి. ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తర్వాతనే బయటకు వదలాలి. శుద్ధి చేసిన నీటి పునర్వినియోగంతో రోజూ వేల లీటర్లు ఆదా అవుతాయి.

Published : 02 Sep 2023 01:09 IST

సంప్రదాయ ఎస్‌టీపీలకు ప్రత్యామ్నాయంగా కొత్త సాంకేతికతలు

ఈనాడు, హైదరాబాద్‌ : గేటెడ్‌ కమ్యూనిటీల్లో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లు(ఎస్‌టీపీ) తప్పనిసరి. ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తర్వాతనే బయటకు వదలాలి. శుద్ధి చేసిన నీటి పునర్వినియోగంతో రోజూ వేల లీటర్లు ఆదా అవుతాయి. ఇందుకోసం ప్రస్తుతం వేర్వేరు టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. కొన్ని చోట్ల సమర్ధంగా నిర్వహిస్తున్నారు. మరికొన్నిచోట్ల కరెంట్‌ బిల్లుల భారంతో వినియోగించడం మానేశారు. వీటి నిర్వాహణ పెద్ద సవాల్‌గా మారింది.  ఖర్చు తడిసి మోపెడు అవుతోందని కమ్యూనిటీ సంక్షేమ సంఘాలు వాపోతున్నాయి. విద్యుత్తు వాడకాన్ని తగ్గించే సాంకేతికతల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో దేశంలోనే మొదటిసారి ఏర్పాటు చేసిన ఐజీబీసీ గ్రీన్‌ ప్రాపర్టీ షోలో సంప్రదాయ ఎస్‌టీపీలకు భిన్నంగా పనిచేసే టెక్నాలజీలను ప్రదర్శించారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివాసాలు వందలు దాటి వేలకు చేరుతున్నాయి. నీటి వినియోగం అధికంగా ఉంటుంది. శుద్ధి చేసి వాడుకోకపోతే భూగర్భంలోంచి తోడాల్సి వస్తోంది.  పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నీరు నేరుగా జలశయాల్లో కలిస్తే కలుషితం అవుతాయి. ఈ కారణంగానే పెద్ద కమ్యూనిటీల్లో సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎస్‌టీపీ)లను సర్కారు తప్పనిసరి చేయడంతో వీటిని బిల్డర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్ల సహాయంతో వాడిన నీటిని వేర్వేరు దశల్లో శుద్ధి చేస్తారు. మొదటి దశలలో ఘన, ద్రవ  జీవ పదార్థాలను పూర్తిగా తొలగిస్తారు. తర్వాతి దశలో  అకర్బన పదార్థాలు, వ్యాధికారకాలను రసాయన, యూవీ కాంతి చికిత్సలను ఉపయోగించి నీటి నుంచి తొలగిస్తారు. ఆ తర్వాతనే నీటిని ఫ్లసింగ్‌కు ఉపయోగిస్తారు. మొక్కలకు ఇంకా ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు. ఈ నీటిని భవనాలకు సైతం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం బిల్డర్లను కోరుతోంది. శుద్ధి దశలు ఎక్కువగా ఉండటంతో ఖర్చు కూడా ఎక్కువే అవుతోంది.

ప్రత్యామ్నాయంగా...  : ఇప్పుడున్న ఖరీదైన ఎస్‌టీపీలకు ప్రత్యామ్నాయంగా ఎకోలాజికల్‌ టాయిలెట్‌ సిస్టమ్‌ను విదేశీ సంస్థ అభివృద్ధి చేయగా.. మనసంస్థలు ఇక్కడ వినియోగంలోకి తీసుకొస్తున్నాయి. వాణిజ్య సంస్థల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గృహ వినియోగానికి కూడా అనువుగా ఉంటుందని చెబుతున్నారు. కొత్త తరహా ఎస్‌టీపీలను గేటెడ్‌ కమ్యూనిటీల్లోనే కాదు వ్యక్తిగత ఇళ్లు, చిన్న అపార్ట్‌మెంట్లలోనూ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెబుతున్నారు.

ఇలా పనిచేస్తుంది... : సాధారణంగా మరుగుదొడ్ల నుంచి మలం, నీరు కలిసి పైపులైన్ల ద్వారా డ్రైన్లకు చేరుతుంది. ఇలా కలిసిపోవడం ద్వారా శుద్ధి చేయడానికి ఎక్కువ దశలు అవసరం ఉంటుంది. ఇక్కడే కరెంట్‌ అవసరం.. 50 కెఎల్‌డీ ఎస్‌టీపికి రోజుకు దాదాపు 60 యూనిట్ల కరెంట్‌ అవసరం అని చెబుతున్నారు. ఖర్చు పెరగడానికి ప్రధాన కారణమిదే.

  • ప్రత్నామ్నాయంగా రూపొందించిన ఎస్‌టీపీ సాధారణ ఫ్లస్‌ టాయిలెట్లతోనే పనిచేస్తుంది.  
  • ఫ్లష్‌ నొక్కగానే మలం, నీరు పైపులోంచి నేరుగా డ్రైయిన్‌లోకి వెళ్లకుండా.. గొట్టానికి ఆఖర్లో గుండ్రని సెపరేటర్‌ని ఏర్పాటు చేస్తారు. ఇది నీటిని, మలాన్ని వేరు చేస్తుంది. గురుత్వాకర్షణ, సెంట్రిఫ్యూగల్‌ ఫోర్స్‌ సూత్రం ద్వారా ఇది పని చేస్తుంది. ఈ ప్రక్రియలో యంత్రాలు, కరెంట్‌తో అసలు పనేలేదు.  
  • ఫ్లషింగ్‌లో 98 శాతం నీరు, మూత్రం ఉంటే.. 2 శాతమే మలం ఉంటుంది. ఈ మలం ఫ్లష్‌ నొక్కగానే నేరుగా బయో ఛాంబర్‌లోకి చేరుతుంది. నీరు సెపెరేటర్‌లో గుండ్రంగా తిరుగుతూ శుద్ధి యంత్రంలోకి వెళుతుంది. ఇక్కడ తక్కువ వ్యయంతో శుద్ధి చేస్తారు. ఏరియేషన్‌, శాండ్‌- కార్బన్‌ ఫిల్టరేషన్‌, యూవీ సాయంతో నీటిని శుద్ధి చేస్తారు. దీన్ని గార్డెనింగ్‌కు వాడుకోవచ్చు. అల్ట్రా ఫిల్టరేషన్‌ అనంతరం ఫ్లషింగ్‌కు ఉపయోగించవచ్చు.
  • నీరు ఉండదు కాబట్టి సెప్టెక్‌ ట్యాంక్‌లోకి చేరే మలం వాసన రాదు అని అక్వాట్రాన్‌ నిర్వాహకులు అంటున్నారు.  దీన్ని ఎరువుగా మార్చి మొక్కలకు వాడుకోవచ్చు అని చెబుతున్నారు.

ప్రతికూలతలు ఉన్నాయ్‌..  : ఒక్క యూనిట్‌ 25 టాయిలెట్ల వరకు పనిచేస్తుంది.  ఎక్కువ మరుగుదొడ్లు ఉంటే ఎక్కువ బయో చాంబర్లను నిర్మించుకోవాలి. భూర్గంలోనూ నిర్మించుకోవచ్చు. ఈ మేరకు స్థలం కావాల్సి ఉంటుంది. డ్రైయిన్‌ పైపులు వంపులు తిరిగి ఉండరాదు. 45 డిగ్రీల వరకు ఫర్వాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని