అనువైన చోట.. పనికి మొగ్గు

మనదేశంలో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ కార్యకలాపాలు 2015-16లో మొదలయ్యాయి. హైదరాబాద్‌లో కాస్త ఆలస్యంగా ఈ విభాగం అడుగుపెట్టింది. మొదట్లో చిన్నగా, అక్కడక్కడ, అసంఘటిత రంగంలో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌లు ఏర్పాటయ్యాయి.

Updated : 16 Sep 2023 07:52 IST

కార్యాలయాల్లోపెరుగుతున్న ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ వాటా
రియాల్టీలో మారుతున్న పోకడలు
ఇప్పటికే 5 కోట్ల చ.అ. దాటింది.. 2025 నాటికి 8.1 కోట్లకు...

ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ విస్తీర్ణం 2025 నాటికి 8.1 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా. ఈ విభాగంలో డిమాండ్‌ ఉండటంతో ఆపరేటర్లు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం 5.34 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీరు కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వెయ్యి కేంద్రాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. 7.6 లక్షల ఉద్యోగులు ఈ కేంద్రాల్లోని ఫ్లెక్సిబుల్‌(అనువైన) ఆఫీసు స్పేస్‌ ఉపయోగించుకుని పనిచేస్తున్నారు. ‘ఫ్లెక్సిబుల్‌ ద వర్క్‌స్పేస్‌-బ్యాక్‌ టూ ఆఫీస్‌’ పేరుతో వెస్టియన్‌ సంస్థ తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

మనదేశంలో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ కార్యకలాపాలు 2015-16లో మొదలయ్యాయి. హైదరాబాద్‌లో కాస్త ఆలస్యంగా ఈ విభాగం అడుగుపెట్టింది. మొదట్లో చిన్నగా, అక్కడక్కడ, అసంఘటిత రంగంలో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌లు ఏర్పాటయ్యాయి. ఆదరణ పెరిగి డిమాండ్‌ ఏర్పడటంతో పెద్ద సంస్థలు రావడం.. సంఘటిత రంగంగా అభివృద్ధి చెందింది.

అంకురాలు మొదలు బడా సంస్థల వరకు..

ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ను మొదట్లో ఎక్కువగా అంకుర సంస్థలు వినియోగించేవి. ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతి ఉండటంతో వీటికి అనువుగా ఉండేవి. ఆ తర్వాత చిన్న, మధ్య తరగతి సంస్థలు.. తమ కార్యకలాపాల విస్తరణకు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుకు వీటిని ఎంచుకున్నాయి. ప్రస్తుతం పెద్ద సంస్థలు సైతం వీటిని వినియోగించుకుంటున్నాయి.

ఎందుకోసమని...

కొవిడ్‌ తర్వాత ఫ్లెక్సిబుల్‌ కార్యాలయాల వైపు చూడటం పెరిగింది. ఉద్యోగులు వారంలో కొద్దిరోజులు ఇంటి నుంచి పనిచేసే హైబ్రిడ్‌ పని సంస్కృతి కూడా దీనికి కారణం. ఆయా సంస్థలు కార్యాలయాల నిర్వహణ ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వీటిలో వ్యయం తగ్గడంతో పాటు మారుతున్న సాంకేతికత అవసరాలకు తగ్గట్టుగా కార్యాలయాల వాతావరణాన్ని, సౌకర్యాలను కల్పిస్తున్నాయి.  ప్రత్యేకంగా డెస్క్‌లు, కోవర్కింగ్‌స్పేస్‌లు.. ఎలా కావాలంటే అలా వాడుకునే సదుపాయాలు ఉన్నాయి. తమకు కావాల్సినట్లుగా ఫ్లెక్సిబుల్‌గా ఉపయోగించుకునే సౌలభ్యం ఉండటం ఇందులో కలిసొచ్చే అంశం.

25 శాతం వరకు..

కార్యాలయాల్లో ఫ్లెక్సిబుల్‌ వాటా 2016లో 2 శాతంగా ఉండేది. గత ఏడాది ఆఖరు నాటికి 16 శాతానికి చేరింది. ఈ ఏడాది చివరికి 20 శాతానికి, 2025 నాటికి 25 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే 2023 వరకు వ్యాపారాలకు ఒక సవాలే అంటోంది అధ్యయన సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. అయితే సౌకర్యవంతమైన పని ప్రదేశాలు గ్లోబల్‌ సంస్థలను ఆకర్షించేందుకు ఇదో అవకాశం అని చెబుతున్నాయి. ప్రస్తుతం 50 సంస్థలు ఈ తరహా కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. మొదటి 10 ఆపరేటర్లే 84 శాతం వాటా కల్గి ఉన్నారు. మన దగ్గర ఎక్కువగా ఐటీ కారిడార్‌లోనే ఈ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి.

భారీగా పెట్టుబడులు..

ఫ్లెక్సి ఆపరేటర్లు 2016 నుంచి ఇప్పటివరకు 260 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించారు. 2019లోనే 90 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత కొవిడ్‌ అనిశ్చితితో పడిపోయినా.. 2020లో 80 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు వచ్చాయి. ఎక్కువ పెట్టుబడులు బెంగళూరుకు వెళ్లాయి.

ఈనాడు, హైదరాబాద్‌


వారితో పోలిస్తే ప్రారంభదశలోనే ఉన్నాం..

అమెరికా, యూరప్‌ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఫ్లెక్సిబుల్‌ కార్యాలయాల విభాగం ప్రారంభ దశలోనే ఉంది. ఇది క్రమంగా వృద్ధి చెందుతోంది. ఇప్పుడున్న 53.4 మిలియన్‌ చదరపు అడుగుల నుంచి 2025 నాటికి 81 మిలియన్‌ చ.అ.కు చేరుకుంటుందని అంచనా. ఏటా 23 శాతం వార్షిక వృద్ధి ఉంటోంది. కొవిడ్‌ అనంతర పరిస్థితులు.. వీటి మార్కెట్‌ బాగా పెరగడానికి దోహదం చేశాయి.

శ్రీనివాసరావు, సీఈవో, వెస్టియన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు