ఇంటితో ఎత్తుకు ఎదగాలని

హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌లో అత్యంత ఎత్తైన బహుళ అంతస్తుల నివాస సముదాయాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఎక్కువగా ఐటీ కారిడార్‌ చుట్టుపక్కలే వస్తున్నాయి.

Updated : 16 Sep 2023 09:21 IST

ఆకాశహర్మ్యాల వైపు కొనుగోలుదారుల ఆసక్తి

హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌లో అత్యంత ఎత్తైన బహుళ అంతస్తుల నివాస సముదాయాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఎక్కువగా ఐటీ కారిడార్‌ చుట్టుపక్కలే వస్తున్నాయి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట వీటికి అడ్డాగా మారాయి. ఆయా ఎత్తైన అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండటాన్ని కొనుగోలుదారులు సమాజంలో హోదాగా భావిస్తున్నారు. మెరుగైన రాబడి, అద్దెలు వస్తాయని.. మంచి పెట్టుబడి సాధనంగా చూస్తున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇతర నగరవాసులే కాదు.. సిటీలోని ఇతర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌లోని ఆకాశహర్మ్యాలకు వలసలు పెరుగుతున్నాయి. డిమాండ్‌ దృష్ట్యా మరిన్ని నిర్మాణాలు అనుమతులు పొందాయి. 50 నుంచి 59 అంతస్తుల మధ్య 9 ప్రాజెక్టులు వస్తున్నాయి. 2026 నుంచి 2028 నాటికి కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందజేయనున్నాయి. ఇప్పటికే పూర్తైన, పూర్తికావడానికి దగ్గరలో ఉన్నవన్నీ 40 అంతస్తుల లోపువే ఎక్కువగా ఉన్నాయి. వీటి కంటే మరో 20 అంతస్తులు అధికంగా నిర్మిస్తుండటంతో గతంలో ఉన్న ఆకాశహర్మ్యాలు సైతం చిన్నబోతున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌  

హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్న పశ్చిమ ప్రాంతం సిటీకి ఎగువున ఉంటుంది. అక్కడ 59 అంతస్తుల వరకు వాణిజ్య, గృహ సముదాయాలతో నగరం విదేశాలను తలపిస్తోంది. అలాంటి చోట సొంతిల్లు కోసం కలలు కనేవారు ఎందరో. అధికాదాయ వర్గాలు వీటిలో కొనుగోలు చేస్తున్నాయి. వీటిలో కడుతున్నవన్నీ అత్యధికం మూడు పడకల గదులే. కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తేనే వీటిని కొనగలరు. ఈ తరహా నివాసాల్లో.. సానుకూలతలు.., ప్రతికూలతలు రెండూ ఉన్నాయని ఇప్పటికే అందులో ఉంటున్నవారు వెల్లడిస్తున్నారు

సిటీ చూసేయవచ్చు..

200 మీటర్ల ఎత్తులో అంటే 50 నుంచి 59 అంతస్తుల వరకు ఉంటాయి. అక్కడి నుంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. చారిత్రక చార్మినార్‌ నుంచి పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూం, హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లోని అంబేడ్కర్‌ విగ్రహం, బిర్లా మందిర్‌ వరకు బాల్కనీలోంచి వీక్షించవచ్చు. ఉదయం, సాయంత్రం సమయాల్లో నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అత్యంత ఎత్తులో కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్యం సమస్యలు ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువుగా ఉంటుంది.

అన్నీ అక్కడే..

ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులన్నీ కూడా గేటెడ్‌ కమ్యూనిటీలే. 5 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఎక్కువ టవర్లు నిర్మించే ప్రాజెక్టుల్లో 50 ఎకరాల వరకు ఉంటున్నాయి. ఇందులో 70 శాతం వరకు ఖాళీ జాగాను సౌకర్యాల కోసం వదిలి మిగతా స్థలంలో అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. ఖాళీ జాగాలో క్లబ్‌ హౌస్‌, క్రికెట్‌ మైదానాలు, క్లినిక్‌ల వరకు సకలం నిర్మిస్తున్నారు. పిల్లల కోసం డే కేర్‌ సెంటర్లు, పెద్దల కాలక్షేపం కోసం, భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటున్నాయి. ఆధునిక సౌకర్యాలన్నీ ఒకచోటనే లభిస్తున్నాయి. చుట్టుపక్కలే కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వినోద కేంద్రాలకు కొదవ లేకపోవడంతో కొనేస్తున్నారు. పైగా వీటిలో ఉంటున్నవారికి నీరు, గ్యాస్‌, కరెంట్‌ సమస్యలు పెద్దగా ఉండవు. ఇవన్నీ నిర్వహణ కోసం నియమించుకున్న ఏజెన్సీలే చూస్తాయి. వీటి గురించి క్షణం కూడా ఆలోచించాల్సిన పని ఉండదు. ఇంట్లో ఉన్నంతసేపు కుటుంబం, వృత్తి, వ్యాపారం, కెరీర్‌, వ్యాపకాలపై పోకస్‌ చేసుకోవచ్చు. పైగా దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్లు ఇక్కడ ఉంటున్నారు. కొనుగోలుదారులకు ఇవన్నీ ఆకర్షణీయంగా అన్పిస్తున్నాయి.

రాబడి సైతం.. : సిటీలోని గత అనుభవాలు చూస్తే ఐటీ కారిడార్‌లో కొనుగోలు చేసిన వారు మంచి అద్దెలు, ఆస్తుల విలువ పెంపుతో మంచి రాబడిని అందుకున్నారు. ఇదే మరికొన్నాళ్లు కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో కోటి నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఫ్లాట్లు, విల్లామెంట్‌ల కోసం వెచ్చిస్తున్నారు. ఆ స్థాయిలోనే అద్దెలు వస్తాయని అంచనా వేయడం కూడా ఆకాశహర్మ్యాల వైపు మొగ్గుచూపుతున్నారు.

ప్రతికూలతలు లేకపోలేదు..

ఆకాశహర్మ్యాల ప్రాజెక్టుల్లో సానుకూలతతో పాటూ ప్రతికూలతలను కొనుగోలుదారులు బేరీజు వేస్తున్నారు. గేటేడ్‌ కమ్యూనిటీలో కొనుగోలు చేసిన ఇంటి విస్తీర్ణంలో 30 శాతం వరకు ఉమ్మడి అవసరాలకు పోతుంది. 2వేల చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన 3 పడకల ఫ్లాట్‌ కొంటే బిల్టప్‌ ఏరియా 1400 నుంచి 1500 వరకు మాత్రమే ఉంటుంది. ప్రాజెక్ట్‌ను బట్టి ఇందులో ఎక్కువ తక్కువలు ఉంటాయి. 59 అంతస్తుల భవనం అంటే లిఫ్ట్‌ల వద్ద ఎదురుచూపులు తప్పవు. ప్రస్తుతం 32 నుంచి 40 అంతస్తుల కమ్యూనిటీల్లోనే లిఫ్ట్‌ల దగ్గర ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ తరహా కమ్యూనిటీల్లో నిర్వహణ ఛార్జీలు సైతం ఎక్కువే ఉంటాయి. వసతులను బట్టి.. నిర్వహణను బట్టి ఒక్కోచోట రూ.5వేల నుంచి రూ.10వేల వరకు మెయింటెనెన్స్‌ ఛార్జీలు ఉన్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు ఈ భారం తగ్గించేందుకు కమ్యూనిటీల్లో సొసైటీకి ఆదాయం వచ్చే సదుపాయలు కల్పించి అప్పగిస్తున్నాయి. అయినా కూడా అధికంగానే నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. గాలుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. వీటి శబ్దాలు హోరెత్తిస్తుంటాయి. వీటిని తట్టుకునేలా కిటికీలు ఉన్నాయా.. లేవా.. అనేది చూసుకోవాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని