కొందరి నుంచి అందరికీ..

స్థిరాస్తి సంస్థలు కొత్త ప్రాజెక్టులు ఆరంభించడానికి ముందు మార్కెట్‌ స్థితిగతులను తెలుసుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్లతో అధ్యయనాలు చేయించడం సహజమే.. అయితే ఇప్పుడు ఆయా నిర్మాణాలు పూర్తయ్యాక అక్కడ కల్పించిన వసతుల వినియోగం ఎలా ఉందో తెలుసుకునేందుకు అధ్యయనాలు చేయిస్తున్నాయి.

Updated : 25 Mar 2023 03:44 IST

గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉమ్మడి సౌకర్యాల కల్పనపరంగా మారుతున్న ధోరణులు
వసతుల వినియోగంపై అధ్యయనాలు.. తదుపరి ప్రాజెక్టుల్లో దిద్దుబాట్లు
ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి సంస్థలు కొత్త ప్రాజెక్టులు ఆరంభించడానికి ముందు మార్కెట్‌ స్థితిగతులను తెలుసుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్లతో అధ్యయనాలు చేయించడం సహజమే.. అయితే ఇప్పుడు ఆయా నిర్మాణాలు పూర్తయ్యాక అక్కడ కల్పించిన వసతుల వినియోగం ఎలా ఉందో తెలుసుకునేందుకు అధ్యయనాలు చేయిస్తున్నాయి. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాయి. వచ్చిన ఫలితాల ఆధారంగా తదుపరి ప్రాజెక్టుల్లో ఆయా మార్పులు చేర్పులు చేస్తున్నాయి. నిర్మాణ రంగంలో ఇదో సరికొత్త పోకడగా కొందరు బిల్డర్స్‌ అభివర్ణిస్తున్నారు.

గేటెడ్‌ కమ్యూనిటీల్లో కొంతకాలంగా సౌకర్యాల కల్పనకు స్థిరాస్తి సంస్థలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేందుకు కొత్త సదుపాయాల కల్పనలో పోటీపడుతున్నాయి. మొదట్లో పది ఇరవై వరకు ఉన్న వసతులు.. క్రమంగా పెరుగుతూ వచ్చాయి. కొన్ని కమ్యూనిటీల్లో వందకుపైగా వసతులు కల్పిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న సంస్థలు ఉన్నాయి. కొత్తలో వీటిని ఉపయోగించుకునేందుకు నివాసితులు ఆసక్తి చూపిస్తున్నా.. నిర్వహణ భారంగా మారడంతో తర్వాత చాలావాటిని వదిలేస్తున్నారు. లక్షల వ్యయంతో నిర్మించిన ఆయా వసతులు నిరుపయోగంగా మారుతున్నాయి.

అసోసియేషన్‌ నిర్వహణలో..

నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్‌ యజమానుల సంక్షేమ సొసైటీ చేతికి కమ్యూనిటీ నిర్వహణ వెళుతుంది. ఆయా వసతులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చేయాలంటే ఆ మేరకు నిర్వహణ వ్యయం పెరుగుతుంది. ప్రీమియం ప్రాజెక్టుల్లో మెయింటెనెన్స్‌ ఖర్చు కంటే వసతులు ముఖ్యమని భావిస్తుండటంతో అక్కడ చాలావరకు అందుబాటులో ఉంటున్నాయి. మిగతా కమ్యూనిటీల్లో వసతులు ఎంత ముఖ్యమో.. అందుకోసం చెల్లించే మెయింటెనెన్స్‌ సొమ్ము కూడా ముఖ్యమే కావడంతో వందల వసతుల్లో కొన్ని మినహా మిగతావన్నీ మూలన పడుతున్నాయి. మరికొన్ని చెల్లింపు పద్ధతిలో ఉపయోగించుకుంటున్నారు. చాలా కమ్యూనిటీల్లో ఈత కొలనులు ఉన్నాయి. వేసవి 3 నెలలు మినహా మిగతా సమయంలో వీటిని ఉపయోగించుకోవడానికి అవకాశమే ఇవ్వరు. నిబంధనల మేరకు తప్పనిసరిగా ఉండాల్సిన వాటిల్లో సైతం కొన్ని మూలన పడుతున్నాయి. పెద్ద ప్రాజెక్టుల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నారు. కరెంట్‌ బిల్లుల భారంతో కొన్నాళ్ల తర్వాత వీటి వినియోగాన్ని నిలిపేస్తున్నవి చాలానే ఉన్నాయి. ఇలాంటి పెద్ద వసతులు చూడగానే వాటిని వాడుతున్నారో లేదో చెప్పేయవచ్చు. దీనికోసం పెద్దగా అధ్యయనం కూడా అవసరం లేదు. క్లబ్‌ హౌస్‌లోని సౌకర్యాల వినియోగం ఎలా ఉందనేది తెలుసుకునేందుకు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తుంటాయి. ఎందుకంటే ఒక్కోచోట 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించి ఇస్తున్నాయి. కొన్నిచోట్ల ఇంతే విస్తీర్ణంలో రెండేసి క్లబ్‌ హౌస్‌లను కడుతున్నారు. వీటి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కొనుగోలుదారుల నుంచే వసూలు చేస్తున్నా.. వినియోగం లేకపోతే నిర్మించి వృథా అనేది కొందరు బిల్డర్ల వాదన.

క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో.. 

క్లబ్‌ హౌస్‌లో ఇండోర్‌ ఆట స్థలాలు, గ్రంథాలయాలు, యోగా కేంద్రాలు, జిమ్‌ సెంటర్లు, ట్యూషన్‌ గదులు, సమావేశ, వేడుకల హాళ్లు, అతిథి గదుల వరకు ఎన్నో ఉంటాయి. రోజువారీ వినియోగించే కేంద్రాలను నిత్యం ఎంతమంది సందర్శిస్తున్నారు అని తెలుసుకునేందుకు క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌పై ఆధారపడుతున్నారు. ఆయా కేంద్రాల ప్రవేశమార్గం వద్ద ఈ కోడ్‌ ఉంటుంది. వచ్చేటప్పుడో, వెళ్లేటప్పుడో వీటిని స్కాన్‌ చేయడం ద్వారా ఎంతమంది ఉపయోగిస్తున్నారనే సమాచారం తెలుసుకోవచ్చు అని ఒక బిల్డర్‌ తెలిపారు. ఇక్కడ వచ్చే సమాచారం ఆధారంగా తదుపరి ప్రాజెక్టుల్లో ఆయా వసతులు కల్పించాలో.. వద్దో నిర్ణయించుకోవడానికి దోహదం చేస్తుందని వివరించారు. తమ ప్రాజెక్టుల్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ఒకవేళ వినియోగం  అంతగా లేదని తేలితే.. వాటిని పరిహరించి ఆ  స్థానంలో ఎక్కువ మంది వినియోగించే మరో వసతిని భవిష్యత్తు ప్రాజెక్టుల్లో కల్పించేందుకు తమకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.


మారిన పంథా...

గేటెడ్‌ కమ్యూనిటీల్లో వసతులన్నీ అక్కడ నివసించే వారికే అనేది తెలిసిందే. కేవలం ఆయా కమ్యూనిటీవాసుల వాడకంతో ఆయా కేంద్రాల నిర్వహణ లాభసాటి కాదని వాటిని నిర్వహించే సంస్థలు అంటున్నాయి. ఈ కారణంగా బయటివాళ్లు సైతం ఉపయోగించుకునేలా ఉండేలా కొత్త ప్రాజెక్టుల్లో క్లబ్‌హౌస్‌లను డిజైన్‌ చేస్తున్నారు. ఇదివరకు ఈ కేంద్రాలు కమ్యూనిటీల్లో ఎక్కడో లోపలి వైపు ఉండేవి. ఇప్పుడు ప్రధాన రహదారి వైపు వీటి నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా  సూపర్‌మార్కెట్‌, క్లినిక్‌, ఆసుపత్రి, ఇతర సౌకర్యాలు కమ్యూనిటీ వాసులతో పాటూ చుట్టుపక్కల నివాసితులు ఉపయోగించుకునేలా చూస్తున్నారు. కొండాపూర్‌, తెల్లాపూర్‌లో ఈ తరహాలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏకంగా ఆసుపత్రులనే నిర్మిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని