ఇంటి డిజైన్‌ గీయిస్తున్నారా?

ఇంటి నిర్మాణంలో బయటికి కనిపించే వాటికే సాధారణంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇంటిని డిజైన్‌ చేయిస్తుంటారు.

Published : 18 Mar 2023 00:10 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ఇంటి నిర్మాణంలో బయటికి కనిపించే వాటికే సాధారణంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇంటిని డిజైన్‌ చేయిస్తుంటారు. ఎక్కడ వంటగది రావాలి? పడక గదులు ఎన్ని ఉండాలి? మెట్లు ఏవైపు ఉండాలి? ఎలివేషన్‌ ఎలా ఉంటే నేటి పోకడలకు తగ్గట్టుగా ఉంటుందనే విషయాలకే ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఇంటిలోని స్థలాలను ఏ మేరకు ఉపయోగించుకున్నాం? అనేది కూడా ఆధునిక భవన డిజైన్లలో కీలకం. జీవితకాలంలో గణనీయ ప్రభావాన్ని చూపే ఇలాంటి అంతర్గత విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఆరు అంశాలను ఇంజినీర్లు గుర్తించారు. ఆధునిక భవనాల డిజైన్‌లో వీటిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లాంటి నగరంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఇంటి విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. అలాగని సమర్థంగా వినియోగిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇంట్లో చాలా గదులు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పెరిగిన విస్తీర్ణంతో ఇంటి ధర పెరుగుతుంది. అందరూ అధిక ధరలను భరించలేరు. వీటిని గమనించిన ఆర్కిటెక్చర్లు ఇంటిలోపల చదరపు అడుగులను  సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్‌ చేస్తున్నారు.  

ప్రభావవంతంగా..  : ఉదాహరణకు 200 చదరపు అడుగులను లివింగ్‌ రూంకు మాత్రమే వదిలిపెడితే.. ప్రభావవంతమైన చదరపు అడుగు 200గా ఉంటుంది. ఎఫెక్టివ్‌ మల్టిపుల్‌ అనేది 1 అవుతుంది. అదే స్థలాన్ని భోజన ప్రదేశంగా, వంటగది వంటి బహుళ అవసరాలకు వినియోగిస్తే ప్రభావవంతమైన చదరపు అడుగులు 300 అవుతుంది. ఎఫెక్టివ్‌ మల్టిపుల్‌ 1.5 అవుతుంది. అవసరాలకు రాజీ పడకుండా ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లయితే ఎఫెక్టివ్‌ మల్టిపుల్‌ను పెంచడంపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

* విలువ 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లోని స్థలాన్ని ప్రభావవంతంగా వాడుతున్నట్లు. అదే 1తో సమానంగా ఉంటే ప్రభావవంతమైన వినియోగంలో ఎక్కువ విలువ జోడింపు లేదని గుర్తించాలి.

* ఇంట్లో పడక గదిలో కంటే లివింగ్‌ రూంలో ఎక్కువ సమయం గడిపేవారికి.. పడక గది విస్తీర్ణం తగ్గించుకుని లివింగ్‌ రూం విస్తీర్ణం పెంచుకోవాలి.

* ఇంటిని ప్రభావవంతంగా వినియోగించుకోవాలన్నా... విశాలంగా కనిపించాలన్నా సహజంగా వెలుతురు వచ్చేలా ఇంటి డిజైన్‌ ఉండాలి. ఇందుకోసం పెద్ద కిటికీలు క్రాస్‌ వెంటిలేషన్‌ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని