ఈ రుచులు... వెరీగుడ్డూ!

మసాలాలతో మిళితమై...మయోనీజ్‌తో జతకూడి...పరాఠాతో కలసిపోయి...ఛాట్‌తో చవులూరిస్తూ...అందరికీ నచ్చే గుడ్డును రోజూ తిందామా! కావాల్సినవి: ఉడికించిన గుడ్లు- ఆరు, ఉల్లిపాయలు- రెండు, జీలకర్ర- అరచెంచా, లవంగాలు- నాలుగైదు, యాలకులు- మూడు, దాల్చినచెక్క- రెండు ముక్కలు, టొమాటో- రెండు, నీళ్లు -ముప్పావు కప్పు,

Updated : 23 May 2021 06:48 IST

 

మసాలాలతో మిళితమై...
మయోనీజ్‌తో జతకూడి...
పరాఠాతో కలసిపోయి...
ఛాట్‌తో చవులూరిస్తూ...
అందరికీ నచ్చే గుడ్డును రోజూ తిందామా!

షాహి అండా మసాలా

కావాల్సినవి: ఉడికించిన గుడ్లు- ఆరు, ఉల్లిపాయలు- రెండు, జీలకర్ర- అరచెంచా, లవంగాలు- నాలుగైదు, యాలకులు- మూడు, దాల్చినచెక్క- రెండు ముక్కలు, టొమాటో- రెండు, నీళ్లు -ముప్పావు కప్పు, పెరుగు- అర కప్పు, కశ్మీరీ కారం, ధనియాల పొడి- చెంచా చొప్పున, పసుపు- అర చెంచా, గరంమసాలా- పావు చెంచా, ఎండుమిర్చీ- మూడు, ఉప్పు- తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచాన్నర, కాజు- ఎనిమిది, నూనె- పావు కప్పు, కసూరీమేథీ, పుదీనా- కొద్దిగా.
తయారీ: పాన్‌లో నూనె వేసి వేడయ్యాక పసుపు వేసుకోవాలి. ఇందులో గుడ్లు వేసి రెండు నిమిషాలపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.
* ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా కోసుకుని నూనెలో వేసి బంగారు వర్ణంలో వచ్చేవరకు వేయించి చల్లార్చి మిక్సీలో వేసుకోవాలి. ఇందులోనే కాజు, ఎండుమిర్చీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిలో రెండు టొమాటాలను ముక్కలుగా కోసి వేసి మరోసారి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
* పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె వేయాలి. వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి. ఇందులో అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి రెండు నిమిషాలపాటు కలపాలి. ఇందులో ఇందాక తయారుచేసి పెట్టుకున్న కాజు మసాలా పేస్ట్‌ వేసి మూడు, నాలుగు నిమిషాలపాటు మీడియం మంటపై వేయించాలి. ఆ తర్వాత నూనె పైకి తేలేవరకు చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు పసుపు, కశ్మీరీ కారం, ధనియాల పొడి, గరంమసాలా వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇప్పుడు మూడు పెద్ద చెంచాలు పెరుగు వేసి మూడు నిమిషాలపాటు చిన్నమంటపై ఉడికించాలి. నీళ్లు పోసి కాసేపు సన్నమంటపై ఉడికించాలి. చివరగా ఇందులో ఉడికించిన గుడ్లను వేసుకోవాలి. దించే ముందు కసూరీమేథీ, పుదీనా తరుగు వేయాలి.   

ఎగ్‌ పరాఠా...

చపాతీ కోసం..  కావాల్సినవి:: గోధుమపిండి- రెండు కప్పులు, ఉప్పు- అర చెంచా, చక్కెర- అర చెంచా, నూనె, పెరుగు- రెండు చెంచాల చొప్పున,

ఆమ్లెట్‌ కోసం...

కావాల్సినవి: గుడ్లు-అయిదు, ఉల్లిపాయలు- రెండు(సన్నగా, తరగాలి), పచ్చిమిర్చి- మూడు (సన్నగా ముక్కలు చేసుకోవాలి), కొత్తిమీర తురుము- చెంచా, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా, కారం- చెంచా, మిరియాల పొడి- పావుచెంచా.
తయారీ: మొదట ఓ పళ్లెంలో పిండి, ఉప్పు, చక్కెర, నూనె వేసి, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిపై చెంచా నూనె వేసి ఓ అరగంట నానబెట్టాలి.  
గిన్నెలో గుడ్ల సొనను తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కారం, మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టి   పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పిండిని తీసుకుని ముద్దలు చేయాలి. ఒక్కోముద్దను చపాతీలా కాస్త మందంగా ఉండేలా చేయాలి. దీనిపై నూనె రాసి ముందుకీ, వెనక్కి మడవాలి. ఇప్పుడు దీన్ని ఒకవైపు నుంచి మరోవైపునకు చుడుతూ ఉండలా చేయాలి. ఇలా అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కో ఉండనూ పూరీ కంటే కాస్త పెద్ద సైజులో, మందంగానే చపాతీలా చేసుకోవాలి. వీటిని పెనంపై వేసి మంటను మధ్యస్థంగా ఉంచి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మరో పొయ్యి వెలిగించి ఇనుప పెనం పెట్టుకోవాలి. దీనిపై కాస్త నూనె వేసి అది వేడయ్యాక ఇందాక తయారుచేసి పెట్టుకున్న గుడ్ల మిశ్రమం పోసి ఆమ్లెట్‌లా వేసుకోవాలి. అది కాస్త కాలగానే దానిపై చపాతీ వేసి అట్లకాడతో గట్టిగా నొక్కాలి. దీన్ని బాగా కాల్చి పక్కన పెట్టాలి. మరోసారి పెనంపై కాస్త నూనె వేసి మరికొంత గుడ్ల మిశ్రమం వేసి ఆమ్లెట్‌లా చేయాలి. ఇది ఉడుకుతున్నప్పుడే ఇందాక చేసిన ఆమ్లెట్‌ చపాతీని దీనిపై వేయాలి. ఇలా రెండువైపులా ఆమ్లెట్‌తో ఉన్న దీన్ని మరోసారి పెనంపై అటూ ఇటూ తిప్పి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే రుచికరమైన ఎగ్‌ పరాఠా రెడీ. దీన్ని చట్నీ, గ్రేవీ కరీస్‌తో తీసుకుంటే చాలా బాగుంటుంది.

ఎగ్‌ ఛాట్‌...

కావాల్సినవి: ఉడికించిన గుడ్లు- నాలుగు, తరిగిన టొమాటోలు- రెండు, ఉల్లిపాయ- ఒకటి(సన్నగా తరగాలి), తరిగిన వెల్లుల్లి- చెంచా, పచ్చిమిరపకాయలు- నాలుగు (సన్నగా తరగాలి), పుదీనా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంత, కారం- చెంచా, పసుపు- చిటికెడు, ఛాట్‌ మసాలా- చెంచా, పోపు దినుసులు- చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె- మూడు పెద్ద చెంచాలు.
తయారీ: ఓ గిన్నెలో ఉడికించిన గుడ్లలోని పచ్చభాగాలను తీసుకుని పొడిలా చేసి పెట్టుకోవాలి. మరో గిన్నెలో తెల్లభాగాన్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి.
పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టుకోవాలి. ఇందులో నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. ఇది వేగుతున్నప్పుడే కారం, ఉప్పు, పసుపు, ఛాట్‌ మసాలా వేసి బాగా కలపాలి. కాసిన్ని నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరిపోయాక పుదీనా తురుము వేయాలి. ఇందాక కోసి పెట్టుకున్న పచ్చసొన పొడి, తెల్లముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. మరికాస్త ఛాట్‌ మసాలా వేసి కలపాలి. చివరగా పుదీనా, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.

ఎగ్‌ శాండ్‌ విచ్‌

మయోనీజ్‌ క్రీమ్‌ కోసం

కావాల్సినవి: గుడ్లు- అయిదు (మూడు ఉడికించి పక్కన పెట్టుకోవాలి), మయోనీజ్‌-మూడు పెద్ద చెంచాలు, ఉల్లికాడల తరుగు- పెద్దచెంచా, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- చిటికెడు, బటర్‌- రెండు చెంచాలు, బ్రెడ్‌స్లైస్‌లు- నాలుగు.

 

మిగతావాటి కోసం...

కావాల్సినవి: గుడ్లు- రెండు, కారం, ఉప్పు, మిరియాల పొడి- చిటికెడు చొప్పున, కొత్తిమీర తురుము-చెంచా, పచ్చిమిర్చి- రెండు.
తయారీ: మొదట ఉడికించిన గుడ్లను చిన్న ముక్కలుగా కోసి ఓ గిన్నెలో వేయాలి. మయోనీజ్‌, ఉల్లికాడల తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.  
ఇప్పుడు మరో గిన్నెలో రెండు గుడ్లను పగలగొట్టి వేయాలి. ఇందులో చిటికెడు చొప్పున ఉప్పు, కారం, మిరియాల పొడి వేయాలి. అలాగే పచ్చిమిర్చి తరుగు వేసి బాగా గిలక్కొట్టాలి.  పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి బటర్‌ వేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న గుడ్డు సొన మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకోవాలి.  ఇది మగ్గుతున్న సమయంలోనే బ్రెడ్‌ స్లైస్‌లను ఈ ఆమ్లెట్‌పై రెండువైపులా పెట్టి తీయండి. ఇప్పుడు బ్రెడ్‌ స్లైస్‌లతో సహా ఆమ్లెట్‌ను రెండువైపులా చక్కగా కాల్చుకోవాలి. ఆ తర్వాత ఆమ్లెట్‌ను కట్‌చేసి స్లైస్‌ పై వేసుకోవాలి. దీనిపై ఇందాక తయారుచేసి పెట్టుకున్న ఎగ్‌ మయోమిశ్రమాన్ని ఒక స్లైస్‌పై వేయాలి. మరోస్లైస్‌ను దీనిపై ఉంచాలి. రెండు నిమిషాలపాటు రెండువైపులా బాగా కాల్చుకోవాలి.

* గుడ్డులో విటమిన్‌-ఎ, డి, ఇ, బి5, బి12లతోపాటు ఐరన్‌, ఐయోడిన్‌, ఫాస్ఫరస్‌, ఫోలేట్‌, సెలేనియమ్‌ లాంటి ఖనిజ మూలకాలుంటాయి.  
* రోజూ తీసుకుంటే శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు అందుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.
* దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
* బరువు తగ్గాలనుకునేవారికి గుడ్డు చక్కటి ఎంపిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని