ఆలూ బీన్స్‌... రుచి అదుర్స్‌..!

బాణలిలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. అల్లంవెల్లుల్లి కూడా వేసి వేగాక బంగాళాదుంప ముక్కలు వేసి ..

Published : 26 Jun 2021 16:03 IST

ఆలూ బీన్స్‌

కావలసినవి
బీన్స్‌: పావుకిలో, బంగాళాదుంపలు: రెండు, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, కొబ్బరి తురుము: అరకప్పు, పచ్చిమిర్చి: ఆరు, ఉల్లిపాయ: ఒకటి, పసుపు: అరటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, జీలకర్రపొడి: టీస్పూను, మిరియాలపొడి: టీస్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, వెల్లుల్లి తురుము: టేబుల్‌స్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* బీన్స్‌ ముక్కల్లో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించి ఉంచాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. అల్లంవెల్లుల్లి కూడా వేసి వేగాక బంగాళాదుంప ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. తరవాత ఉడికించిన బీన్స్‌ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. ఇప్పుడు నువ్వులపొడి, కొబ్బరి తురుము వేసి కలపాలి. దనియాలపొడి, మిరియాలపొడి, జీలకర్ర పొడి వేసి కలిపి చివరగా కొత్తిమీర తురుము చల్లి దించాలి.


బీన్స్‌ గ్రేవీ

కావలసినవి
బీన్స్‌: 2 కప్పులు, దాల్చినచెక్క: అర అంగుళంముక్క, యాలకులు: మూడు, లవంగాలు: మూడు, కారం: టీస్పూను, నూనె: 8 టీస్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, మసాలా కోసం: ఉల్లిపాయ ముక్కలు: కప్పు, టొమాటోముక్కలు: కప్పు, అల్లం: అంగుళంముక్క, జీలకర్ర: టీస్పూను, మిరియాలు: నాలుగు, కరివేపాకు: 3 రెబ్బలు, కొత్తిమీర: కట్ట (చిన్నది)

తయారుచేసే విధానం
* బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు కూడా వేయించాలి. అవి బాగా వేగాక వాటికి కారం కలిపి కాసేపు పక్కన ఉంచాలి. చల్లారాక ఉల్లి, టొమాటో ముక్కలకు జీలకర్ర, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు జోడించి, పావుకప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.
* మందపాటి బాణలిలో నూనె వేసి చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేగాక బీన్స్‌ ముక్కలు, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి మీడియం మంటమీద ఉడికించాలి. బాగా ఉడికిన తరవాత రుబ్బిన మసాలా ముద్ద వేసి కలిపి మరికాసేపు ఉడికించి, కాస్త కొత్తిమీర తురుము చల్లి దించితే సరి.


క్యారెట్‌ బీన్స్‌ సబ్జి

కావలసినవి
బీన్స్‌: పావుకిలో, క్యారెట్లు: రెండు, టొమాటోలు: నాలుగు, కొత్తిమీర తురుము: 3 టేబుల్‌స్పూన్లు, కొబ్బరి తురుము: అరకప్పు, పల్లీలు: పావుకప్పు, జీలకర్ర: అరటీస్పూను, పసుపు: పావుటీస్పూను, దనియాలపొడి: టీస్పూను, గరంమసాలా: పావుటీస్పూను, అల్లం తురుము: టీస్పూను, కారం: పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 3 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* బీన్స్‌, క్యారెట్‌ చిన్న ముక్కలుగా కోయాలి. టొమాటోలూ పచ్చిమిర్చి మిక్సీలో వేసి గుజ్జులా చేయాలి. అందులోనే పల్లీలు, కొబ్బరితురుము వేసి మళ్లీ మెత్తగా రుబ్బాలి.
* బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి కాగాక సన్నగా తరిగిన బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు, ఉప్పు వేసి అవి కాస్త వేగాక పావుకప్పు నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు విడిగా బాణలి పెట్టి అందులో మిగిలిన నూనె వేసి కాగాక జీలకర్ర, పసుపు, దనియాలపొడి, అల్లంతురుము వేసి వేయించాలి. తరవాత టొమాటో మిశ్రమాన్ని వేసి వేగనివ్వాలి. అది వేగి మంచి వాసన వస్తుండగా కారం వేసి కలిపి ఓ కప్పు నీళ్లు, అరటీస్పూను ఉప్పు, గరంమసాలా, కొత్తిమీర తురుము వేసి సిమ్‌లో ఉడికించాలి. తరవాత ఉడికించిన బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు కూడా కలిపి మూతపెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించి, కొత్తిమీరతో అలంకరిస్తే సరి.


బీన్స్‌ ఉస్లి

కావలసినవి
గ్రీన్‌ బీన్స్‌: పావుకిలో, కందిపప్పు: పావుకప్పు, సెనగపప్పు: పావుకప్పు, ఉల్లిపాయ: ఒకటి, తాజా కొబ్బరి తురుము: అరకప్పు, ఎండుకొబ్బరిపొడి: 3 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, ఎండుమిర్చి: నాలుగు, కరివేపాకు: 2 రెబ్బలు, జీలకర్ర: టీస్పూను, ఆవాలు: టీస్పూను, పసుపు: ముప్పావుటీస్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* కందిపప్పు, సెనగపప్పు కలిపి వాటిలో కాసిని నీళ్లు పోసి ఓ గంటసేపు నాననివ్వాలి. తరవాత నీళ్లు వంపేసి వాటికి జీలకర్ర, ఎండుమిర్చి జోడించి రుబ్బాలి.
* బీన్స్‌ని సన్నని ముక్కలుగా కోసి సగం ఉడికించి దించి నీళ్లు వంపేయాలి. అందులోనే రుబ్బిన పప్పుల మిశ్రమం, కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలిపి ఉంచాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి. తరవాత పసుపు వేయాలి. ఇప్పుడు బీన్స్‌ మిశ్రమం వేసి మూతపెట్టి ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉప్పు సరిచూసి అవి వేగాక కొత్తిమీర తురుము చల్లి దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు