రంజాన్‌వేళ... అంజీర్‌ హల్వా

అంజీర్‌ను కడిగి గోరువెచ్చని పాలలో వేసి సుమారు గంటసేపు నాననివ్వాలి. తరవాత వీటిని మెత్తగా రుబ్బాలి...

Published : 27 Jun 2021 15:07 IST

గులాబ్‌ ఫిర్నీ

కావలసినవి
పాలు: లీటరు, యాలకులపొడి: అరటీస్పూను, బాస్మతి బియ్యం: పావుకప్పు, పంచదార: కప్పు, రోజ్‌ సిరప్‌: 2 టేబుల్‌స్పూన్లు, బాదం: 2 టేబుల్‌స్పూన్లు, ఎండిన గులాబీ రేకులు: కొద్దిగా
తయారుచేసే విధానం
* బియ్యం కడిగి అరగంటసేపు నాననివ్వాలి. తరవాత మెత్తగా రుబ్బాలి. మధ్యలో నాలుగైదు టేబుల్‌స్పూన్ల పాలు కూడా పోయాలి.
* మందపాటి బాణలిలో పాలు పోసి కాగనివ్వాలి. అవి మరిగిన తరవాత రుబ్బిన బియ్యం ముద్ద వేసి సిమ్‌లో ఉడికించాలి. ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో తిప్పుతూ మిశ్రమం చిక్కబడేవరకూ సుమారు అరగంటసేపు ఉడికించాలి. తరవాత పంచదార, రోజ్‌సిరప్‌ వేసి కలపాలి. ఇష్టాన్నిబట్టి పంచదార, రోజ్‌సిరప్‌ మరికాస్త వేసుకోవచ్చు. తరవాత స్టవ్‌ ఆఫ్‌ చేసి కాసేపు అలాగే ఉంచి చిన్న చిన్న బౌల్స్‌లో వేసి చల్లారాక ఫ్రిజ్‌లో పెట్టి తీయాలి. ఇప్పుడు ఒక్కోదాంట్లో సన్నగా తరిగిన డ్రైనట్స్‌, గులాబీ రేకులు చల్లి అందించాలి.


హాఫ్‌ మూన్‌ పీ

కావలసినవి
మైదాపిండి: 2 కప్పులు, వెన్న: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: సరిపడా, మరిగించిన నీళ్లు: కప్పు, కూరకోసం: చికెన్‌: అరకిలో, పచ్చిమిర్చి: ఆరు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, ఎండుమిర్చి: రెండు, ఉల్లిపాయ: ఒకటి, స్వీట్‌కార్న్‌: కప్పు, జీలకర్ర: టీస్పూను, కొత్తిమీరతురుము: సరిపడా, వైట్‌సాస్‌కోసం: వెన్న: కప్పు, మైదాపిండి: 2 టేబుల్‌స్పూన్లు, పాలు: పావులీటరు
తయారుచేసే విధానం
* పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్దలా నూరాలి.
* పాన్‌లో వెన్న వేసి కరిగిన తరవాత మైదాపిండి వేసి కలపాలి. తరవాత కొంచెంకొంచెంగా పాలు కూడా పోసి కలుపుతూ ఉడికించాలి. పాలు మరిగి, చిక్కని పేస్టులా తయారయ్యాక స్టవ్‌ ఆఫ్‌ చేసి మిరియాలపొడి, ఉప్పు
చల్లి ఉంచాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి కాగాక ఉల్లిపాయలు వేయించాలి. సన్నగా తరిగిన చికెన్‌ ముక్కలు కూడా వేసి, అందులోనే జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి మిశ్రమం వేసి ఉడికించాలి. కూర దగ్గరగా ఉడికిన తరవాత వైట్‌ సాస్‌ వేసి కలిపి పక్కన ఉంచాలి.
* పిండిలో వెన్న వేసి కలపాలి. తరవాత ఉప్పు, వేడినీళ్లు వేసి కలిపి ఉండల్లా చేయాలి. ఒక్కో ఉండనీ చపాతీలా చేసి, గుండ్రని మూతతో కత్తిరించి అందులో కాస్త కూర పెట్టి అర్ధచంద్రాకృతి వచ్చేలా అంటే కజ్జికాయల్లా మడిచి అంచులు విడిపోకుండా మైదా పేస్టుతో అంటించాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి.


అంజీర్‌ హల్వా

కావలసినవి
మిల్క్‌మెయిడ్‌: 200 గ్రా., పాలు: అరలీటరు, అంజీర్‌(ఎండినవి): పావుకిలో, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, బాదం: 20
తయారుచేసే విధానం
* అంజీర్‌ను కడిగి గోరువెచ్చని పాలలో వేసి సుమారు గంటసేపు నాననివ్వాలి. తరవాత వీటిని మెత్తగా రుబ్బాలి.
* మందపాటి బాణలిలో నెయ్యి వేసి కాగాక మిల్క్‌మెయిడ్‌ వేసి కలపాలి. ఇప్పుడు రుబ్బిన అంజీర్‌ ముద్ద కూడా వేసి కలిపి అది అంచుల నుంచి విడివడేవరకూ ఉడికించి దించాలి. చివరగా సన్నగా తరిగిన బాదం వేస్తే నోరూరించే అంజీర్‌ హల్వా రెడీ.


చికెన్‌ షామి కబాబ్‌

కావలసినవి
సెనగపప్పు: కప్పు, బోన్‌లెస్‌ చికెన్‌ముక్కలు: అరకిలో, ఉప్పు: తగినంత, కారం: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: ఐదు, లవంగాలు: ఆరు, కొత్తిమీర తురుము: 2 టీస్పూన్లు, మిరియాలు: పది, దాల్చినచెక్కలు: రెండు, వాము: టీస్పూను, కొత్తిమీరతురుము: కట్ట, పుదీనా: కట్ట(చిన్నది), అల్లంతురుము: టేబుల్‌స్పూను, వెల్లుల్లిరెబ్బలు: పది, గుడ్లు: ఆరు, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* సెనగపప్పులో చికెన్‌ ముక్కలు, మసాలా దినుసులు అన్నీ వేసి ఉడికించాలి. చికెన్‌ ముక్కలు పూర్తిగా ఉడికిన తరవాత దించి మిశ్రమాన్ని మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి.
* ఓ గిన్నెలో మూడు గుడ్లసొనలు వేసి గిలకొట్టాలి. అందులోనే కొత్తిమీర తురుము, పుదీనా తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి వేసి కలపాలి. తరవాత గిలకొట్టిన గుడ్డుసొన మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని గుండ్రని బిళ్లల్లా చేయాలి. మిగిలిన గుడ్ల సొనను ఓ గిన్నెలో వేసి గిలకొట్టాలి. బిళ్లల్లా చేసిన కబాబ్‌లమీద గుడ్లసొనను బ్రష్‌తో రాసి కాగిన నూనెలో వేయించి తీయాలి.

(2 జాన్‌ 2019)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని