యే దిల్‌ మాంగే కీమా మోర్‌!

మటన్‌ ముక్కలో సింగిల్‌ ఎముక లేకుండా కీమా కొట్టడం అంటే మామూలు ముచ్చట కాదు. అంత పద్ధతిగా కొట్టిన కీమా.. చేయి తిరిగిన వంటవాడి చేతిలో పడితే.. ఎలా ఉంటుంది చెప్పండి? మసాలా దట్టించుకొని.. నూనెలో మునిగి.. కూరలో తేలి.. బిర్యానీలో కుదిరి.. సమోసాలో చేరి.. పళ్లెంలోకి వచ్చేస్తుంది. ముద్ద ముద్దనూ ఆస్వాదిస్తూ లాగించేయడమే మన పని. కాదంటారా! అయితే వెరైటీలు చేసి చూడండి.. కీమా కథ క్లైమాక్స్‌లో ఆహా, ఓహోలు తప్ప మరే మాటలూ  వినిపించవు!

Published : 13 Oct 2019 00:24 IST

కీమా కమామీషు!

మటన్‌ ముక్కలో సింగిల్‌ ఎముక లేకుండా కీమా కొట్టడం అంటే మామూలు ముచ్చట కాదు. అంత పద్ధతిగా కొట్టిన కీమా.. చేయి తిరిగిన వంటవాడి చేతిలో పడితే.. ఎలా ఉంటుంది చెప్పండి? మసాలా దట్టించుకొని.. నూనెలో మునిగి.. కూరలో తేలి.. బిర్యానీలో కుదిరి.. సమోసాలో చేరి.. పళ్లెంలోకి వచ్చేస్తుంది. ముద్ద ముద్దనూ ఆస్వాదిస్తూ లాగించేయడమే మన పని. కాదంటారా! అయితే వెరైటీలు చేసి చూడండి.. కీమా కథ క్లైమాక్స్‌లో ఆహా, ఓహోలు తప్ప మరే మాటలూ  వినిపించవు!

సమోసా

తయారీ: మైదాలో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి చపాతీపిండిలా గట్టిగా కలుపుకోవాలి. వీటిని చపాతీల్లా ఒత్తుకుని ఒకవైపు మాత్రం పెనంపైన కాల్చుకోవాలి. వీటిని సగానికి చాకుతో కోస్తే సమోసాలు చేయడానికి వీలుగా  ఉంటాయి. ఒక కడాయిలో నూనె పోసి వేడిచేసి అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించుకోవాలి. అప్పుడు కీమా, ఉప్పు వేసి తక్కువమంట మీద ఉంచి మూతపెట్టేయాలి. కీమా ఉడికిన తర్వాత గరంమసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి మరికాసేపు మగ్గించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత సగానికి కోసిన చపాతీలను కోన్‌ మాదిరిగా మలుచుకుని అందులో ఈ కీమా మిశ్రమం ఉంచి అంచులని మూసేయాలి. వీటిని నూనెలో వేయించుకుని పుదీనా చట్నీతో తింటే ఆ రుచి అదుర్స్‌.

కావాల్సినవి: కీమా- అరకిలో, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా, గరంమసాలాపొడి- చెంచాన్నర, సన్నగా తరిగిన పుదీనా- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- నాలుగు( సన్నగా తరిగి పెట్టుకోవాలి), నూనె- అరకప్పు, మైదా- 300గ్రా, లవంగాలు- మూడు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, ఉల్లిపాయ- ఒకటి, పెరుగు- చెంచా, ఉప్పు- తగినంత

కార్జం-కీమా

తయారీ: ఒక కడాయిలో నూనె పోసి వేడిచేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయముక్కలని నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేంత వరకూ వేయించుకోవాలి. మిక్సీలో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేగిన ఉల్లిపాయముక్కల్లో వేసి మూడు నిమిషాలపాటు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా గుజ్జు కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాలపొడి, గరంమసాలాపొడి, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఉడుకుతూ నూనెపైకి తేలుతుంది. అప్పుడు కీమా వేసి మూతపెట్టి పావుగంటపాటు ఉడికించుకోవాలి. చివరిగా కార్జం కూడా వేసి మరో పది నిమిషాలపాటు ఉడికించుకుంటే రుచికరమైన కీమాకార్జం సిద్ధమవుతుంది.

కావాల్సినవి: కీమా- 300గ్రా, నూనె- నాలుగు చెంచాలు, ఉల్లిపాయ- ఒకటి, అల్లం- రెండు అంగుళాల ముక్క, వెల్లుల్లి రెబ్బలు- పది, టమాటా గుజ్జు- నాలుగు చెంచాలు, పసుపు- అరచెంచా, కారం- అరచెంచా, ధనియాలపొడి- రెండు చెంచాలు, గరంమసాలాపొడి- అరచెంచా, ఉప్పు- రుచికి తగినంత,  కార్జం- 200గ్రా, కొత్తిమీర- కొద్దిగా

బిర్యానీ..

తయారీ: ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉప్పు వేసిన నీళ్లలో పలుకుగా ఉడికించి నీళ్లు వార్చి పక్కన పెట్టుకోవాలి. పాలల్లో కుంకుమపువ్వు కలిపి పక్కనపెట్టుకోవాలి. కడాయిలో నెయ్యి వేడి చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు ముదురు గోధుమరంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. ఇందులోనే దాల్చినచెక్క, లవంగాలు వేసి వాటి పరిమళం బయటకు వచ్చేంతవరకూ ఉండాలి. ఇందులోనే కీమా వేసి గరిటెతో కలియతిప్పి..  అల్లంవెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించి ఉప్పు కలుపుకోవాలి. కీమా పూర్తిగా వేగిన తర్వాత... పెరుగు, కారం వేసి తక్కువ మంట మీద మగ్గించుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌ కానీ, మూత ఉన్న మందపాటి పాత్రను కానీ తీసుకుని ముందుగా పలుకుగా ఉడికించిన అన్నాన్ని ఒక పొరలా వేసుకోవాలి. దానిపై ఉడికించిన కీమాని వేసుకోవాలి. ఆపైన కుంకుమపువ్వు కలిపిన పాలను సగం పోసుకుని, ఆపై కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇదే పద్ధతిలో మళ్లీ పలుకుగా ఉడికించిన అన్నం, కీమా, పాలు వేసి చివరిగా తగినంత చికెన్‌ ఉడికించిన నీళ్లు పోసుకోవాలి. ఆవిరి బయటకు పోకుండా మూతపెట్టేసి తక్కువమంట మీద పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుని దింపుకోవాలి. కుక్కర్‌ని నేరుగా మంట మీద పెట్టకుండా ఒక పాన్‌ పెట్టుకుని దానిమీద పెట్టుకుంటే అడుగు మాడకుండా బిర్యాని చక్కగా పొడిపొడిగా వస్తుంది.

కావాల్సినవి:బాస్మతి బియ్యం- 350గ్రా, పెరుగు- 3 చెంచాలు, అల్లం పేస్ట్‌- చెంచా, నెయ్యి- 100గ్రా, కుంకుమపువ్వు- చిటికెడు, కారం- చెంచా, నిమ్మరసం- చెంచా, కీమా- 400గ్రా, ఉల్లిపాయ- ఒకటి, వెల్లుల్లిపేస్ట్‌- చెంచా, పాలు- అరకప్పు, దాల్చినచెక్క- ఒకటి, లవంగాలు- నాలుగు, చికెన్‌ ఉడికించిన నీళ్లు- కప్పు, ఉప్పు- తగినంత

తవా కీమా..

తయారీ: పెనంగానీ, వెడల్పుగా, మందంగా ఉండే పాన్‌గానీ తీసుకుని అందులో రెండు పెద్ద చెంచాల నూనె పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి అది పూర్తిగా వేగిన తర్వాత కీమా కూడా వేసి రంగు మారేంతవరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మూతపెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, కసూరిమేథి, జీలకర్రపొడి, గరంమసాలా పొడి వేసి పూర్తిగా కలిసేంతవరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకుని తగినన్ని నీళ్లు పోసి సన్నమంట మీద ఉంచి కీమాని పూర్తిగా ఉడికించుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు పైన అలంకరించుకుంటే తవా కీమా రెడీ.
* పావ్‌ బ్రెడ్‌లకి కొద్దిగా బటర్‌ రాసి పెనంపై వేడిచేసి కీమాతో కలిపితింటే చాలా రుచిగా ఉంటాయి. ముంబయి స్ట్రీట్‌ఫుడ్‌ పావ్‌కీమా చాలా ప్రసిద్ధి.

 

కావాల్సినవి: కీమా- పావుకేజీ, ఉల్లిపాయ- ఒకటి, టమాటాలు- రెండు, కసూరీమేథీ- అరచెంచా, కారం- చెంచా, పసుపు- పావుచెంచా, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా, సన్నగా తరిగిన అల్లం- చెంచా, పచ్చిమిర్చి- రెండు, జీలకర్ర- చెంచా, ఉప్పు- తగినంత, గరంమసాలా- అరచెంచా, నూనె- నాలుగు చెంచాలు

దాబా స్టైల్‌లో..

తయారీ: కడాయిలో నూనె పోసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, యాలకులు, జీలకర్ర, లవంగాలు వేసి వేడి చేసుకోవాలి. వాటి నుంచి చక్కని సువాసన వస్తున్నప్పుడు ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అవి పూర్తిగా వేగాక అల్లం, వెల్లుల్లిపేస్ట్‌... బటర్‌ వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి  వేయించుకుని ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. అలా వేయడానికి ముందు అవి అడుగంటకుండా ఉండేందుకు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. అప్పుడు పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఇంగువ, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత కీమా వేసి వేగాక... పాలు పోసి మళ్లీ కలుపుకోవాలి. తర్వాత టమాటా గుజ్జు, పంచదార, నిమ్మరసం వేసి మరో పది నిమిషాలపాటు సన్నమంట మీద ఉంచాలి. అడుగంటకుండా మధ్యలో కలుపుతూ కప్పు నీళ్లుపోసి మూతపెట్టేసి ఐదునిమిషాలపాటు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర, కొద్దిగా బట్టర్ పచ్చిమిర్చి వేసి దింపుకోవాలి.
 

కావాల్సినవి: కీమా- 450గ్రా, నూనె- రెండు చెంచాలు, బిర్యానీఆకు- ఒకటి, పచ్చ యాలకులు- నాలుగు, జీలకర్ర- చెంచా, లవంగాలు- ఐదు, ఉల్లిపాయలు- మూడు, వెల్లుల్లిపేస్ట్‌- రెండు చెంచాలు, అల్లంపేస్ట్‌- చెంచా, బటర్‌- చెంచా, పచ్చిమిర్చి- మూడు, పసుపు- అరచెంచా, ఎర్రరంగు క్యాప్సికమ్‌- సగం, కారం- రెండు చెంచాలు, ధనియాలపొడి- రెండు చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత, ఇంగువ- కొద్దిగా, పాలు- నాలుగు చెంచాలు, టమాటా ప్యూరీ- కప్పు, పంచదార- చెంచా, నిమ్మకాయ- అరచెక్క, కొత్తిమీర- కొద్దిగా, జీలకర్రపొడి- పావుచెంచా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని