వెదురు కంద

చినుకుకాలంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన గిరిజన ఆహారమే ఈ వెదురుకంద. వెదురు కలపగానే ఎక్కువ మందికి తెలుసు. కానీ లేత వెదురుతో నోరూరించే కూరను సైతం తయారు చేయవచ్చు. అది కూడా ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే! గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వెదురు సాగు ఉంటుంది.

Published : 25 Aug 2019 00:24 IST

పక్కాలోకల్‌

వెదురుకంద అనగానే ఇదేదో మైదాన ప్రాంతాల్లో దొరికే కందలాంటిది అనుకునేరు. కాదండోయ్‌!
చినుకుకాలంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన గిరిజన ఆహారమే ఈ వెదురుకంద. వెదురు కలపగానే ఎక్కువ మందికి తెలుసు. కానీ లేత వెదురుతో నోరూరించే కూరను సైతం తయారు చేయవచ్చు. అది కూడా ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే! గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వెదురు సాగు ఉంటుంది. వాటి నుంచి తీసిన సహజ సిద్దమైన ఆహార పదార్థమే ఈ వెదురు కంద. ఏటా జూన్‌ నుంచి ఆగస్టు వరకు వెదురు కంద తీస్తుంటారు. ఈ మూడు నెలల్లో పడిన వర్షాలకు వెదురు మొక్క చిగురిస్తుంది. దాని నుంచి పొట్ట (కంద భాగం) బయటకు వస్తుంది. ఈ పొట్ట భాగాన్ని తొలగిస్తారు. తొలగించిన పొట్టను శుభ్రం చేసి ముక్కలుగా కూరకు అనుకూలంగా తరుగుతారు. ఇది ఎటువంటి ఎరువులు, పురుగు మందుల ప్రభావం లేని సహజ సిద్ధ్దమైన ఆహారం.

కలిపి వండితే అద్భుతమే...
వెదురు కందను బఠానీ లేదా మునగ ఆకులు కలిపి వండితే ‘ఆహా’ ఆ రుచే వేరు. కొండ ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమయ్యే వెదురు కందను కొన్ని సందర్భాల్లో గిరిజనులు పల్లపు ప్రాంత గ్రామాలకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అరుదుగా దొరికే వెదురు కందకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. గిరిజనులు మాత్రం మూడు నెలలు పాటు ఇదే కూరగాయను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, బామిని, కొత్తూరు, మెళియాపుట్టి, పలాస, మందస, పాతపట్నం తదితర గిరిజన ప్రాంత మండలాలతో పాటు సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా ప్రాంతంలోనూ వెదురుకంద లభ్యమవుతుంది.

వెదురుకంద కూర
కావాల్సినవి: వెదురుకంద తరుగు- కప్పు, బఠాణీలు- అరకప్పు, టమాటా- ఒకటి, ఉప్పు- రుచికి తగినంత, కారం- చెంచా, పసుపు- కొద్దిగా, ఉల్లిపాయ- ఒకటి, నూనె- తగినంత, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- అరచెంచా, ఆవాలు, జీలకర్ర- కొద్దిగా
తయారీ: ముందుగా కంద, బఠాణీలను విడివిడిగా నీళ్లలో ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక... అందులో ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకోవాలి. అవి కూడా వేగాక టమాటా ముక్కలు వేసి మూతపెట్టేయాలి. అవి మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసి... ఒక నిమిషం పాటు వేయించుకుని అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. అందులో ఉడికించిన వెదురుకంద, బఠాణీలు వేసి మెత్తగా ఉడికిన తర్వాత దింపుకోవాలి.

- సూరకాసుల వెంకటరమణ, న్యూస్‌టుడే, కాశీబుగ్గ

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని