ఒడియా అంబులా!

వేసవిలో వచ్చే పుల్లటి మామిడి కాయలంటే ఎవరికిష్టం ఉండదు. వాటితో పచ్చడి, పులిహోర చేసుకుంటాం. పప్పులు, కూరల్లోనూ వేసుకుంటాం. మరీ ముఖ్యంగా ఆవకాయ పెట్టుకుని నిల్వ

Published : 16 May 2021 01:08 IST

పొరుగు రుచి

వేసవిలో వచ్చే పుల్లటి మామిడి కాయలంటే ఎవరికిష్టం ఉండదు. వాటితో పచ్చడి, పులిహోర చేసుకుంటాం. పప్పులు, కూరల్లోనూ వేసుకుంటాం. మరీ ముఖ్యంగా ఆవకాయ పెట్టుకుని నిల్వ చేసుకుంటాం. అయితే ఒడిశాకి చెందిన ప్రజలు మాత్రం దీన్ని ప్రత్యేక పద్ధతుల్లో ఒరుగుల్లా తయారుచేసి, నిల్వ చేసుకుని ఏళ్లపాటు వాడుకుంటారట. అదెలాగో తెలుసుకుందామా...
రెండు మూడు కిలోల మామిడి కాయలను మొదట శుభ్రంగా కడిగి తడిపోయేలా తుడవాలి. ఆ తర్వాత పొట్టు తీసి నిలువుగా ముక్కలుగా కోసుకోవాలి. లోపలి టెంకను తీసేయాలి. ఇప్పుడు మరోసారి కడిగి తుడిచి పెట్టుకోవాలి. వీటిలో ఓ గుప్పెడు (దాదాపు 100 గ్రా.,) ఉప్పు వేసి బాగా కలిపి రెండురోజులపాటు పక్కన పెట్టాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఈ ముక్కలను రెండు రోజులపాటు ఎండలో ఆరబెట్టాలి. ఆ ముక్కల్లో వచ్చిన నీటిని పారబోయొద్దు. ఎండబెట్టిన మామిడికాయ ముక్కలను ఆ నీటిలోనే మళ్లీ నాలుగైదు రోజులపాటు వేస్తూ, ఎండలో ఆరబెడుతూ ఉండాలి. ఇలా చేస్తే అంబులాలు ఫెళఫెళలాడుతూ తయారవుతాయి. వీటిని రెండు, మూడేళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు.  
వినియోగమిలా..
తయారుచేసి పెట్టుకున్న అంబులాలను (మామిడి ఒరుగులను) పచ్చళ్లు, శాకాహార, మాంసాహార కూరల్లోనూ వేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని