Protein Food: ఇంద్రధనస్సును తినేద్దాం!

ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, నీలం, పసుపు.. ఊదా.. ఇలా ఇంద్రధనస్సు రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ వర్ణాలన్నింటితో మీ ఆహార కంచం

Updated : 23 May 2021 09:32 IST

పోషకాలమ్‌

ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, నీలం, పసుపు.. ఊదా.. ఇలా ఇంద్రధనస్సు రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ వర్ణాలన్నింటితో మీ ఆహార కంచం ఇంద్రధనస్సు రంగుల హారంలా మారిపోతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందడంతోపాటు రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. మరి ఆ వర్ణాల ఫలాలు, కూరగాయల్లో ఉండే పోషకాలేంటో చూద్దామా...

ఎరుపు..

ఈ రంగు పండ్లు, కూరగాయల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగకారకాలతో పోరాడి శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి ఈ రంగులో ఉండే టొమాటోలు, బెల్‌పెప్పర్‌, యాపిల్స్‌, చెర్రీస్‌, స్ట్రాబెర్రీలను ఆహారంలో చేర్చుకోండి మరి. 

నీలం

ఈ రంగులో ఉండేవి రక్తపోటును నియంత్రిస్తాయి.  కాబట్టి రోజూ ఓ గుప్పెడు బెర్రీస్‌ తినేయండి.

ఆకుపచ్చ

హరిత వర్ణంలో ఉండే ఆకుకూరల వల్ల లాభాలు అనేకం. వీటిలో విటమిన్‌-కె ఉంటుంది. ఇది రక్తవృద్ధి, ఎముక ఆరోగ్యానికి సాయపడుతుంది. అంతేకాదు వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూర, కీర, బ్రకోలీ, ద్రాక్ష, అవకాడో... ఇలా అన్ని ఆకుపచ్చలను ఆరగించేయండి.

ఆరెంజ్‌

రోగనిరోధకతను పెంచడంలో విటమిన్‌-సి ప్రధానమైంది. ఈ పోషకం ఈ రంగు పండ్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఆరెంజ్‌ రంగులో ఉండే పండ్లను తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దాంతో గుండె జబ్బులు రావు. గుమ్మడికాయ, సంత్రాలు, క్యారెట్‌... లాంటి వాటిని రోజూ తీసుకుంటే సరి. వీటిని సలాడ్లు,  జ్యూస్‌లుగానూ తీసుకోవచ్చు. ఇలా చేస్తే పోషకాలన్నీ అందుతాయి.

పసుపు

ఆరెంజ్‌ రంగు పండ్లు, కూరగాయల నుంచి వచ్చే ప్రయోజనాలే దీని నుంచి వస్తాయి. ఈ రంగు పండ్లు, కూరగాయల్లోనూ విటమిన్‌-సి, కెరొటినాయిడ్లు ఉంటాయి. కాబట్టి పచ్చగా మెరిసిపోయే మొక్కజొన్న, ఎల్లో బెల్‌పెప్పర్‌, పైనాపిల్‌, నిమ్మలను మీ కంచంలో చేర్చుకోండి.

ఊదా

నీలం రంగు పదార్థాలు అందించే ప్రయోజనాలే ఈ రంగువి చేకూరుస్తాయి. ఈ రెండు రంగుల పండ్లు, కూరగాయల్లో యాంథోసయనిన్స్‌ అనే యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర కణాల రక్షణలో పాలు పంచుకుంటాయి. నల్లద్రాక్ష, పర్పుల్‌ క్యాబేజ్‌, వంకాయ, ర్యాడిష్‌లను పళ్లెంలో చేర్చుకోండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని