నోరూరగ.. చాట్‌ండి

వాతావరణం చల్లబడింది... చిరుజల్లులు మొదలయ్యాయి... చల్లటి సాయంకాలాల్లో వేడి వేడి స్నాక్స్‌ తింటే బాగుంటుంది కదూ. గరమ్‌ గరమ్‌ సమోసాలు... రుచుల ఆలూ... నోట్లో వేస్తే కరిగిపోయే

Updated : 27 Jun 2021 02:53 IST

వాతావరణం చల్లబడింది... చిరుజల్లులు మొదలయ్యాయి... చల్లటి సాయంకాలాల్లో వేడి వేడి స్నాక్స్‌ తింటే బాగుంటుంది కదూ. గరమ్‌ గరమ్‌ సమోసాలు... రుచుల ఆలూ... నోట్లో వేస్తే కరిగిపోయే బ్రెడ్‌లతో చేసిన ‘చాట్‌’లు తినడానికి మీరు సిద్ధమేనా! మరెందుకాలస్యం మసాలా పూరీతో మొదలుపెట్టి... సమోసాల వరకూ లాగించేయండి మరి.


బ్రెడ్‌తో...

కావాల్సినవి: సెనగపిండి- అర కప్పు, మొక్కజొన్న పిండి- పెద్ద చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- అర చెంచా, పండుమిర్చి పేస్ట్‌- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, చాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌- చెంచా చొప్పున, ఇంగువ- అర చెంచా, కసూరీ మేథీ, నిమ్మరసం, నెయ్యి- రెండు చెంచాల చొప్పున, బ్రౌన్‌ బ్రెడ్‌- ఒకటి,
తయారీ: పెద్ద గిన్నెలో బ్రెడ్‌, నెయ్యి తప్ప మిగతా పదార్థాలన్నింటినీ వేసుకుంటూ సరిపడా నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా కలపాలి.
బ్రెడ్‌ టోస్ట్‌ కోసం... బ్రెడ్‌ స్లైసులను నచ్చిన ఆకారంలో కోసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక తయారుచేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఓ వెడల్పాటి పళ్లెంలో పోసి బ్రెడ్‌ స్లైస్‌లను ముంచి పాన్‌లో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
టాపింగ్‌ కోసం... కావాల్సినవి: దానిమ్మ గింజలు- అర కప్పు, ఉల్లిపాయ, టొమాటో- ఒకటి చొప్పున, పచ్చిమిర్చి- రెండు, కొత్తిమీర, పుదీనా తురుము- అర కప్పు చొప్పున, చాట్‌ మసాలా- అర చెంచా, గ్రీన్‌ చట్నీ, తియ్యటి చింతపండు చట్నీ- చెంచా చొప్పున, సన్న కారప్పూస- చెంచా.
తయారీ: ఓ గిన్నెలో దానిమ్మ గింజలు, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు(గింజలు తీసేయాలి), కొత్తిమీర, పుదీనా తురుము, చాట్‌ మసాలా పొడి, ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలి.
ఇప్పుడు ఓ పెద్ద ప్లేట్‌లో బ్రెడ్‌ స్లైసులను వరుసగా తీసుకోవాలి. వీటిపై మొదట గ్రీన్‌ చట్నీ, ఆ తర్వాత స్వీట్‌ చింతపండు చట్నీ రాయాలి. వాటిపై తయారుచేసి పెట్టుకున్న దానిమ్మ గింజల మిశ్రమాన్ని వేయాలి. ఆమ్‌చూర్‌, సన్న కారప్పూసతో గార్నిష్‌ చేసుకుంటే సరి.


మసాలా పూరీ...

కావాల్సినవి: బఠానీలు- అర కప్పు(రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి),  ఆలుగడ్డలు- రెండు, నూనె- తగినంత, ఉల్లిపాయ- ఒకటి(సన్నగా తరగాలి), వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు- చెంచా చొప్పున, ఉప్పు-తగినంత, కారం, గరంమసాలా, చాట్‌ మసాలా, ధనియాల పొడి- చెంచా చొప్పున,  పసుపు- పావు చెంచా, కొత్తిమీర తరుగు- చెంచా, మసాలా పూరీలు(గప్‌చుప్‌)- నాలుగైదు, పుదీనా చట్నీ- రెండు చెంచాలు, చింతపండు  చట్నీ- చెంచా, టొమాటో ముక్కలు- పావు కప్పు, సన్న కారప్పూస- చెంచా,  ఆమ్‌చూర్‌- కొద్దిగా, అల్లం తరుగు- చెంచా.

తయారీ: పొయ్యి వెలిగించి కుక్కర్‌ పెట్టాలి. ఇందులో నానబెట్టిన బఠానీలు, ఆలుగడ్డ ముక్కలు వేసి, నీళ్లు పోసి మూడు, నాలుగు కూతలు వచ్చేవరకు మీడియం మంటపై ఉడికించాలి. ఈ బఠానీల నుంచి కొన్నింటిని తీసి ఓ గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఆలుగడ్డల పొట్టు తీసి మళ్లీ కుక్కర్‌లో వేయాలి. ఇప్పుడు బఠానీలు, బంగాళాదుంపలను మెత్తగా మెదపాలి. పొయ్యిపై పాన్‌ పెట్టి నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. దీనికి టొమాటో ముక్కలను జత చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలపొచ్చు. పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె పోసి ఈ మిశ్రమం వేసి కొన్ని నీళ్లు కలిపి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఇందులో కారం, ఉప్పు, గరంమసాలా, చాట్‌ మసాలా, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. స్పైసీగా కావాలనుకునేవారు మరికొంత కారం వేసుకోవచ్చు. దీంట్లో అర కప్పు నీళ్లు పోసి చిన్న మంటపై పదినిమిషాలపాటు ఉడికించాలి. ముందుగా తయారుచేసి పెట్టుకున్న బఠానీ, ఆలూ మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి. రెండు కప్పుల నీళ్లూ పోయాలి. ఉడికిన బఠానీలను కూడా కలిపేయాలి. కొత్తిమీర తరుగును జత చేయాలి. మంటను మధ్యస్తంగా పెట్టి దాదాపు పదిహేను నిమిషాలపాటు మూతపెట్టి ఉడికించాలి. అంతే రుచికరమైన బఠానీ మసాలా సిద్ధమైనట్లే. ఇప్పుడు ప్లేట్‌లో నాలుగైదు మసాలా పూరీలను ముక్కలుగా చేసుకోవాలి. వీటిపై బఠానీ మసాలాను వేసుకోవాలి. దీనిపై పుదీనా చట్నీ, కాస్తంత చింతపండు చట్నీ, తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, కారం, చాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌ పొడి, సన్న కారప్పూస, కొత్తిమీరతో అలంకరిస్తే రుచికరమైన మసాలా పూరీ రెడీ.


ఆలూతో...

కావాల్సినవి: బంగాళాదుంపలు- మూడు (పెద్ద ముక్కలుగా), నిమ్మరసం- మూడు చెంచాలు, ఉప్పు- తగినంత, అల్లం ముక్క- సన్నగా అంగుళం మేర కోసిపెట్టుకోవాలి. నూనె- వేయించడానికి సరిపడా, ఉల్లిపాయ- ఒకటి(సన్నగా తరగాలి), చాట్‌ మసాలా, కారం- అర చెంచా చొప్పున, జీలకర్ర పొడి- పావు చెంచా, పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి) కొత్తిమీర తరుగు- మూడు పెద్ద చెంచాలు,

తయారీ: చిన్న గిన్నెలో అల్లం ముక్కలు, నిమ్మరసం, ఉప్పు కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక ఆలు ముక్కలను వేసి అవి కరకరలాడే వరకు వేయించాలి. వీటిని టిష్యూ పేపర్‌ పై వేయాలి. 

ఆలు ముక్కలను పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, చాట్‌ మసాలా, కారం, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర, నిమ్మరసం వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని అల్లం ముక్కలతో గార్నిష్‌ చేసుకుని తింటే సరి.


సమోసా చోలేతో...

కావాల్సినవి: సమోసాలు- రెండు, సెనగలు(చోలే)- కప్పు, టీ బ్యాగులు- రెండు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, జీలకర్ర- రెండు చెంచాలు, ఎండిన దానిమ్మ గింజలు, కారం- పెద్ద చెంచా చొప్పున, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు- కొన్ని, పచ్చిమిర్చి అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, ఉప్పు- తగినంత, చోలే మసాలా, ధనియాల పొడి, గరంమసాలా- రెండు పెద్ద చెంచాల చొప్పున, ఆమ్‌చూర్‌ పొడి- చెంచా, గ్రీన్‌ చట్నీ, చింతపండు చట్నీ- చెంచా చొప్పున, పెరుగు- కొద్దిగా,  కొత్తిమీర తరుగు, సన్న కారప్పూస - కొద్దిగా.

తయారీ: పొయ్యిపై కుక్కర్‌ పెట్టి సెనగలు, టీ బ్యాగులు, తగినంత ఉప్పు వేసి, నీళ్లు పోసి నాలుగైదు కూతలు వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పడు మరో పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసి అది వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ వేసి కలపాలి. కారం, చాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌, ధనియాల పొడి, గరంమసాలా జత చేయాలి. ఇప్పుడు బాగా కలిపి కొన్ని నీళ్లు పోసి రెండు నిమిషాలపాటు ఉడికించాలి. ఈ మిశ్రమంలో ఇందాక తయారుచేసిపెట్టుకున్న చోలేలను వేయాలి. ఇందులోనే టొమాటో ముక్కలు, నిలువుగా కోసిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. 

గిన్నెలో సమోసా ముక్కలు వేయాలి. దీనిపై చోలే మసాలా మిశ్రమాన్ని వేసుకోవాలి. వాటిపై పెరుగు, స్వీట్‌ టామరిండ్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగు, సన్న కారప్పూసతో అలంకరించుకుంటే సరి.


డైట్‌ చాట్‌

కావాల్సినవి:  తెల్ల సెనగలు- కప్పున్నర,  ఉల్లిపాయ, టొమాటో- ఒకటి (చిన్న ముక్కలుగా కోసుకోవాలి) చొప్పున, గ్రీన్‌ చట్నీ, చింతపండు చట్నీ, పండుమిర్చి పేస్ట్‌- చెంచా చొప్పున, మామిడి కాయ ముక్కలు- కొన్ని, ఉప్పు- తగినంత, పెరుగు- రెండు చెంచాలు,  నిమ్మకాయ- అర ముక్క, నల్లుప్పు, చాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌ పొడి - చిటికెడు  చొప్పున, పసుపు- పావు చెంచా, ఇంగువ- చిటికెడు, కొత్తిమీర- కొద్దిగా.

తయారీ: పొయ్యి మీద కుక్కర్‌ పెట్టి సెనగలు, పసుపు, ఇంగువ వేసి, మూడు కప్పుల నీళ్లు పోసి నాలుగైదు  కూతలు వచ్చేవరకు ఉడికించి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిపై ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్‌ చట్నీ, చింతపండు చట్నీ, పండుమిర్చి చట్నీ, టొమాటో, మామిడి కాయ ముక్కలు వేసుకోవాలి. నిమ్మరసం చల్లుకోవాలి. అపై నల్లుప్పు, ఆమ్‌చూర్‌ పొడి, చాట్‌ మసాలా చల్లాలి, కొంచెం పెరుగు, మరికొంచెం కొత్తిమీరతో అలంకరిస్తే.... వేడి వేడి రుచికరమైన డైట్‌ చాట్‌ రెడీ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని