వడియాల విందు

వేడివేడి సాంబారులోకి రెండు గుమ్మడి వడియాలు ఉంటే చాలు.. పంచభక్ష్య పరమాన్నాలు అవసరం లేదు! పిండి వడియాలు పక్కన ఉంటే చారన్నం కూడా గొప్పగానే ఉంటుంది. పప్పుతో మినప్పొట్టు వడియాలు దోస్తీచేశాయా.. ఇక ఏ బిర్యానీ రుచీ పనికిరాదు దీనిముందు.

Published : 26 Feb 2023 00:14 IST

వేడివేడి సాంబారులోకి రెండు గుమ్మడి వడియాలు ఉంటే చాలు.. పంచభక్ష్య పరమాన్నాలు అవసరం లేదు! పిండి వడియాలు పక్కన ఉంటే చారన్నం కూడా గొప్పగానే ఉంటుంది. పప్పుతో మినప్పొట్టు వడియాలు దోస్తీచేశాయా.. ఇక ఏ బిర్యానీ రుచీ పనికిరాదు దీనిముందు. ఇలాంటి మరికొన్ని సరికొత్త వడియాలని ప్రయత్నించండి ఈ ఎండల్లో....

మనం వేసవి వస్తే కాసిని వడియాలు పెట్టుకుని ఏడాదంతా దాచుకుంటాం కదా! ఒడిశాలోని కియోంజర్‌ జిల్లాలోని మహిళలు వడియాల తయారీని ఉపాధిగా మార్చుకున్నారు. ఏడాది పొడవునా మినపప్పు, నువ్వులతో చేసిన ‘ఫులాబడి’ అనే వడియాలు తయారుచేస్తారు. వీటిని ప్యాక్‌ చేసి విదేశాలకూ అమ్ముతారు. ప్రభుత్వం మిషన్‌ శక్తి పేరుతో మహిళల్ని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఈ ఒక్క జిల్లాల్లోనే వడియాలని విక్రయిస్తూ 200 మంది మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగారు.


ఆలూ మసాలా వడియాలు

కావాల్సినవి: అటుకులు- కప్పు, బంగాళాదుంపలు- రెండు, ఎండుమిర్చి పలుకులు(చిల్లీ ఫ్లేక్స్‌)- రెండు చెంచాలు, జీలకర్ర- చెంచా, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు- మూడు చెంచాలు, నూనె- చెంచా

తయారీ: అటుకుల్ని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించుకుని చేత్తోకానీ, పప్పుగుత్తితోకానీ మెత్తగా మెదపాలి. ఈ ఆలూ మిశ్రమంలో చిల్లీఫ్లేక్స్‌, జీలకర్ర, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరిగా అటుకుల పొడి వేసుకుని మిశ్రమాన్ని చపాతీపిండిలా కలపాలి. చేతికి నూనె రాసుకుని ఈ పిండిని చిన్నముద్దల్లా చేసుకుని వెడల్పుగా ఒత్తుకోవాలి. కాటన్‌చీరపైన కానీ ప్లాస్టిక్‌ పేపర్‌పై కానీ ఒత్తుకుని రెండు రోజులు ఎండబెట్టుకుంటే వడియాలు రెడీ. పూర్తిగా ఎండాక.. నూనెలో వేయించుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి.


టొమాటో మెంతికూర వడియాలు

కావాల్సినవి: బియ్యం- రెండు కప్పులు, టొమాటో- అరకేజీ, మెంతికూర- ఐదు కట్టలు, కొత్తిమీర- కొద్దిగా, జీలకర్ర- చెంచా, నువ్వులు- నాలుగు చెంచాలు, ఉప్పు- తగినంత, ధనియాల పొడి- చెంచా, జీలకర్ర- చెంచా, నువ్వులు- చెంచా, పచ్చిమిర్చి- పది

తయారీ: రెండు కప్పుల బియ్యానికి ఆరు కప్పుల నీళ్లు పోసుకుని నీళ్లు మరిగించుకోవాలి. కాస్త మరిగాక కొంచెం ఉప్పు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కోసిన మెంతికూర, కొత్తిమీర వేయాలి.. అవి మెత్తగా అయ్యి, నీళ్లు కూడా మరుగుతున్నప్పుడు ముందుగా కడిగిపెట్టుకున్న బియ్యం  వేసి బాగా ఉడకనివ్వాలి. అన్నం ముద్దగా అయ్యాక ధనియాల పొడి, వేయించిపెట్టుకున్న జీలకర్ర, నువ్వుల్ని అందులో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు జంతికలు చేసే కుడకతో ఒత్తినా, చేత్తోనో చిన్న చిన్న వడియాల్లా పెట్టుకున్నా బాగానే ఉంటాయి. వీటిని కనీసం వారం రోజులు ఎండలో ఆరనిచ్చి తర్వాత తీసి భద్రపరచాలి.


తెలకపిండి వడియాలు

కావాల్సినవి: నువ్వుల తెలకపిండి- అరకప్పు, పచ్చిమిర్చి- మూడు, ఉప్పు- తగినంత, వాము- రెండు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- ఏడు

తయారీ: తెలకపిండిని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. తెల్లారాక  ఎక్కువ ఉన్న నీళ్లని వార్చుకుంటే మెత్తని పేస్ట్‌ మిగులుతుంది. ముందుగా పచ్చిమిర్చి, ఉప్పు, వాము, వెల్లుల్లి వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి నానబెట్టిన తెలకపిండిని కలిపి చపాతీ పిండిలా తయారు చేయాలి. ఆపై రొట్టెల్లా ఒత్తుకుని కట్‌లెట్‌ల మాదిరిగా కట్‌ చేసుకుని ఎండలో పెట్టాలి. ఇలా వారం రోజులు ఎండాక డబ్బాలో భద్రపరుచుకుంటే సంవత్సరం నిల్వ ఉంటాయి. రుచితో పాటూ ఆరోగ్యం కూడా ఇవి.


పాలకూర వడియాలు

కావాల్సినవి: బియ్యం- కప్పు, పాలకూర- 2 కప్పులు, నువ్వులు- మూడు చెంచాలు, జీలకర్ర- చెంచా, పచ్చిమిర్చి- 4, ఉప్పు- రుచికి తగినంత

తయారీ: ఒక పాత్రలో మూడుకప్పుల నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. దానిలో పాలకూరని సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి, బియ్యం కూడా వేసుకుని నీళ్లు ఇగిరేంతవరకూ ఉడకనివ్వాలి. కొద్దిగా తడి మిగులుతున్నప్పుడు స్టౌ కట్టేయాలి. ఇప్పుడు నువ్వులు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. పాలకూర ఉప్పగా ఉంటుంది కాబట్టి... ఉప్పు సరిచూసుకుని వేసుకోవాలి. బాగా కలిపి ఉండలుగా చేసుకుని కాటన్‌ చీరపైన కానీ, అల్యూమినియం ఫాయిల్‌పైన కానీ, ప్లాస్టిక్‌ కవర్‌పైనకానీ ఈ వడియాలని మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. నాలుగైదు రోజుల్లో ఇవి ఎండిపోతాయి. నూనెలో వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయి.


టొమాటో, అటుకుల వడియాలు

కావాల్సినవి: టొమాటో గుజ్జు- కప్పు, ఉప్పు- రుచికి తగినంత, అటుకులు- కప్పు, జీలకర్ర- చెంచా, నూనె- వేయించడానికి సరిపడ

తయారీ: ఒక గిన్నెలో టొమాటో గుజ్జు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలో శుభ్రం చేసిన అటుకులు కూడా వేసుకుని ఓ 20 నిమిషాలపాటు నాననివ్వాలి. చేత్తో బాగా కలిపి చిన్న ఉండలుగా చేసుకుని వెడల్పుగా వడియాల్లా ఒత్తుకోవాలి. ప్లాస్టిక్‌ షీట్‌పైన కానీ, బటర్‌ పేపర్‌పైన కానీ ఈ వడియాలు పెట్టుకుంటే ఎండాక తేలిగ్గా వేరు చేసుకోవచ్చు. రెండు రోజుల్లో ఈ వడియాలు ఎండిపోతాయి. నూనెలో వేయించుకుంటే పుల్లగా, కమ్మగా ఉండే టొమాటో, అటుకుల వడియాలు భలే రుచిగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని