గణపయ్యకు మోదకం

‘ఓ బొజ్జ గణపయ్య.. నీ బంటు నేనయ్య..’ అంటూ విఘ్నేశ్వరుని భక్తిగా పూజిస్తాం. కుడుములు, ఉండ్రాళ్లు, పాయసం, పానకం, పనస, ఖర్జూర, ద్రాక్ష, దానిమ్మ, గారెలు, పులిహోర.. అన్నీ అర్పిస్తాం.

Updated : 17 Sep 2023 03:04 IST

‘ఓ బొజ్జ గణపయ్య.. నీ బంటు నేనయ్య..’ అంటూ విఘ్నేశ్వరుని భక్తిగా పూజిస్తాం. కుడుములు, ఉండ్రాళ్లు, పాయసం, పానకం, పనస, ఖర్జూర, ద్రాక్ష, దానిమ్మ, గారెలు, పులిహోర.. అన్నీ అర్పిస్తాం. ఎన్ని ప్రసాదాలు ఊరిస్తున్నా.. అన్నిటి కంటే మోదకాలంటే వినాయకుడికి మహా ఇష్టం. ఈసారి ఈ ప్రత్యేక మోదకాలు నైవేద్యంగా సమర్పించి తరించండి!

నారింజతో..

కావలసినవి: నారింజ - 3, కొబ్బరి పాలు - కప్పు, కొబ్బరికోరు - అర కప్పు, నెయ్యి - 2 చెంచాలు, బియ్యప్పిండి, పాలపొడి - అర కప్పు చొప్పున, నీళ్లు - అర కప్పు, జీడిపప్పు, బాదం పలుకులు - 1 టేబుల్‌ స్పూన్‌

తయారీ: నారింజ తొనల్లో గింజలు తీసి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. అడుగు భాగం మందంగా ఉన్న గిన్నెలో కొబ్బరిపాలు, బియ్యప్పిండి, పాలపొడి, కొబ్బరికోరు వేసి ఉడికించాలి. అందులో నారింజ తొనల గుజ్జు, కొద్దిగా నెయ్యి వేసి ఉండ కట్టకుండా మధ్యలో కలియ తిప్పుతూ.. దగ్గరపడ్డాక దించేయాలి. చల్లారాక అచ్చుతో మోదకాలు చేసుకోవాలి.

గుల్కంద్‌తో..

కావలసినవి: గుల్కంద్‌ - 2 చెంచాలు, షుగర్‌ కోటెడ్‌ సోంపు - టేబుల్‌ స్పూన్‌, కొబ్బరికోరు - కప్పు, పంచదార, చిక్కటి పాలు - అర కప్పు చొప్పున, నెయ్యి - 2 చెంచాలు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు - చారెడు, యాలకుల పొడి - పావు చెంచా, పింక్‌ ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా

తయారీ: పాలల్లో గుల్కంద్‌ వేసి రోజ్‌ మిల్క్‌ తయారుచేసుకోవాలి. అడుగు భాగం మందంగా ఉన్న గిన్నెలో నెయ్యి వేసి కొబ్బరికోరు వేయించాలి. అందులో పంచదార, రోజ్‌ మిల్క్‌ వేసి సన్న సెగ మీద ఉడికించాలి. చివర్లో నెయ్యి, డ్రైఫ్రూట్స్‌ పలుకులు, యాలకుల పొడి, ఫుడ్‌ కలర్‌ వేసి స్టవ్వు కట్టేయాలి. మిశ్రమం చల్లారాక మౌల్డ్‌లో నెయ్యి రాసి మోదకాలు చేసుకోవాలి.

తమలపాకుతో..

కావలసినవి: తమలపాకులు - 6, సోంపు - టేబుల్‌స్పూన్‌, చిక్కటి పాలు - 2 కప్పులు, కొబ్బరికోరు - కప్పు, పంచదార - అర కప్పు, నెయ్యి - తగినంత, ఆకుపర్చ ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా

తయారీ: తమలపాకులు, సోంపులను కొన్ని నీళ్లతో మెత్తగా రుబ్బుకోవాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో నెయ్యి వేసి కొబ్బరికోరును సన్న సెగ మీద వేయించాలి. అందులో చిక్కటి పాలు, పంచదార, తమలపాకు పేస్టు, ఫుడ్‌ కలర్‌ వేసి కలియబెట్టాలి. మూడు నిమిషాల తర్వాత దించేయాలి. వేడి చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని, మిశ్రమాన్ని మృదువుగా అయ్యేదాకా మర్దన చేయాలి. తర్వాత చిన్న ఉండలుగా తీసుకుని మౌల్డ్‌లో వేసి మోదకాలు చేసుకోవాలి.

స్ట్రాబెర్రీతో..

కావలసినవి: రవ్వ - కప్పు, నెయ్యి - 2 చెంచాలు, చిక్కటి పాలు - కప్పు, పంచదార - అర కప్పు, పాల పొడి - 2 చెంచాలు, రోజ్‌ సిరప్‌ - 1 టేబుల్‌ స్పూన్‌, స్ట్రాబెర్రీలు - అర కిలో, యాలకుల పొడి - అర చెంచా, పిస్తా, బాదం పలుకులు - తగినన్ని, గులాబీ రేకలు - కొద్దిగా

తయారీ: తొడిమలు, గింజలు తీసిన స్ట్రాబెర్రీలు, పంచదారలను ఒక పాత్రలో వేసి పావు గంట తర్వాత గైండ్‌ చేయాలి. రవ్వను నేతిలో వేయించాలి. అందులో పాలు, పాలపొడి వేసి ఉడికించాలి. ఐదారు నిమిషాల తర్వాత స్ట్రాబెర్రీ గుజ్జు, నెయ్యి వేసి ఉండలు కట్టకుండా కలియ తిప్పాలి. చిక్కగా అయ్యాక రోజ్‌ సిరప్‌, యాలకుల పొడి, బాదం, పిస్తా పలుకులు, గులాబీ రేకలు వేసి, రెండు నిమిషాలు సన్న సెగ మీద ఉంచి దించేయాలి. మిశ్రమం చల్లారాక మౌల్డ్‌తో మోదకాలు చేయాలి.

ఖోయాతో..

కావలసినవి: ఖోయా - పావు కిలో, పంచదార - అర కప్పు, యాలకుల పొడి - పావు చెంచా, నెయ్యి - 2 చెంచాలు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు - చారెడు, కుంకుమ పువ్వు - కొద్దిగా

తయారీ: కడాయిలో ఖోయా తురుము, నెయ్యి వేసి సన్న సెగ మీద ఉంచాలి. ఖోయా కరిగాక.. పంచదార, యాలకుల పొడి వేసి ఉడికించాలి. చిక్కగా అయ్యాక.. కుంకుమ పువ్వు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేసి దించేయాలి. చల్లారాక అచ్చులో వేసి మోదకాలు చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని