ఆరోగ్యానికి చిరునామా ఆవాకు

తాలింపులో వేసే అర చెంచా ఆవాలు కూర, చారుల రుచిని అమాంతం పెంచేస్తాయి. ఆవాల పొడి వేయడం వల్లే ఊరగాయ పచ్చళ్లు గొప్పగా ఘుమాయిస్తాయి. ఇలా మన ప్రాంతాల్లో ఆవాలను ఎక్కువగానే ఉపయోగిస్తాం.

Published : 10 Dec 2023 00:10 IST

తాలింపులో వేసే అర చెంచా ఆవాలు కూర, చారుల రుచిని అమాంతం పెంచేస్తాయి. ఆవాల పొడి వేయడం వల్లే ఊరగాయ పచ్చళ్లు గొప్పగా ఘుమాయిస్తాయి. ఇలా మన ప్రాంతాల్లో ఆవాలను ఎక్కువగానే ఉపయోగిస్తాం. కానీ ఆవాకు తినే అలవాటు పెద్దగా లేదు. నిజానికి ఇది చాలా మంచిదంటున్నారు ఆహార నిపుణులు. పాలకూర, మెంతికూరల్లా ఆవాకు కూడా శ్రేష్ఠమైందని, వీలైనప్పుడల్లా ఏదో ఒక రూపంలో తినేందుకు ప్రయత్నించమని చెబుతున్నారు. ఆవాకును కంది, పెసర, శనగ పప్పులతో కలిపి వండొచ్చు. దీన్ని ఆలివ్‌ నూనెలో వేయించి.. కారం, ఉప్పు, వెల్లుల్లి, నిమ్మరసం వేస్తే సైడ్‌ డిష్‌ అయిపోతుంది. సలాడ్‌ రూపంలో అయితే పిల్లలూ పెద్దలూ అందరికీ నచ్చేస్తుంది. ఉడికించి.. ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే.. రుచికి రుచి, బలానికి బలం. దీంతో చేసే బజ్జీలు పాలకూర పకోడీల్లానే ఘుమాయిస్తాయి. ఆవాకులో ఎ, బి1, బి3, బి6, సి, ఇ, కె విటమిన్లు, ప్రొటీన్లు, కాపర్‌- ఇలా శరీరానికి అవసరమైనవెన్నో ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులను తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్‌ ఆవాకులో విస్తారంగా ఉన్నాయి. ఇది టైప్‌-2 డయాబెటిస్‌, గుండెజబ్బులను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తం గడ్డకుండా చేస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఆవాకు మతిమరపును కూడా తగ్గిస్తుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఇన్ని లాభాలున్న ఈ ఆకును మనమూ తిందామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని