ఎంతెంత.. రుచింత!

చింతకాయ- చేదుపరిగలు, చింతకాయ- కొయ్యింగ, చింతకాయ- పచ్చిరొయ్యలు అబ్బా.. చెబుతుంటేనే పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఆ రుచికి నోరూరుతోంది కదూ! అందుకే మార్కెట్లో .. గింజపడుతున్న లేలేత చింతకాయలు కవ్విస్తూ కనిపిస్తుంటే చూసీచూడనట్టు వచ్చేయకుండా ....

Published : 10 Dec 2017 02:15 IST

ఎంతెంత.. రుచింత!

చింతకాయ- చేదుపరిగలు, చింతకాయ- కొయ్యింగ, చింతకాయ- పచ్చిరొయ్యలు అబ్బా.. చెబుతుంటేనే పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఆ రుచికి నోరూరుతోంది కదూ! అందుకే మార్కెట్లో .. గింజపడుతున్న లేలేత చింతకాయలు కవ్విస్తూ కనిపిస్తుంటే చూసీచూడనట్టు వచ్చేయకుండా ఇంటికి తెచ్చేయండి. చింత తొక్కుతో మొదలుపెట్టి... చేపల కాంబినేషన్‌తో కలిపి అద్భుతమైన రుచులని వండి వార్చుకుందాం!
చింతకాయల కాలం ఎప్పుడొస్తుందా... చిన్నచేపలతో కలిపి వండి ఉడుకుడుకు అన్నంలో వేసుకుని తింటూ చవిచచ్చిన నాలుకకు  జీవం పోద్దామా అని ఎదురుచూసేవారు కొందరు. పుట్టింటి నుంచి ఏటికేడాది నిల్వ ఉండే ఆవకాయ, మాగాయల్లానే అమ్మ చేసిన చింతతొక్కుని కూడా పట్టుకెళ్లాలని ఎదురుచూసే ఆడపడుచులు ఇంకొందరు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకునే ఈ చింతకాయ వంటకాల్లో నూనె వాడకం, మసాలాలు మోత ఉండదు. సి విటమిన్‌ అధికంగా ఉండే చింతకాయతో చేసిన వంటకాలు వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండే ఈ శీతాకాలంలో ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తాయి.

ఇగురు కూరలకి చింతకాయని నేరుగా దంచుకుని వేసుకోవాలి. అదే చేపల పులుసు కోసం అయితే చింతకాయలని ఉడికించి మెత్తగా చేసుకుని వడకట్టుకుని ఆ పులుసు మాత్రం వేసుకుంటే సరిపోతుంది.

ఏడాది పొడవునా ఆ రుచి..
చింతతొక్కు దీన్నే ఉప్పుతొక్కు అంటారు. ఇది ఏడాది పాటు నిల్వ ఉంటుంది. అన్నికాలాల్లో చింతకాయలు దొరకవు కాబట్టి... కూరల్లో ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ తొక్కుని ఒకేసారి తయారుచేసి నిల్వ చేసుకుంటారు. దీని తయారీ కోసం కిలో చింతకాయలు తీసుకుంటే పావుకిలో కల్లుప్పు తీసుకోవాలి. చింతకాయలని ఉప్పు, పసుపు వేసుకుని రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రుచి చూస్తే మొదట ఉప్పురుచే నోటికి తగలాలి. అలా అయితేనే ఆ తొక్కు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కర్నాటక వంటి ప్రాంతాల్లో ఇంగువ, మెంతిపొడి కూడా వేసుకుని దంచుతారు. దీనిని పొడి జాడీలోకి తీసుకుంటే మూడోరోజుకి గింజ, నార సులభంగా చేతికి వచ్చేస్తాయి. దీన్లో ఇంగువ తాలింపుని పైపోపు కింద వేసుకుంటే చింతకాయపచ్చడి సిద్ధం. అలాగే కొబ్బరికాయతో కలిపి పచ్చడి చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు పప్పులో వేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో నూనె లేకుండా చింతతొక్కు ఊరుబిండి కూడా చేస్తారు. ఇవన్నీ ఆరోగ్యప్రదం... పోషకప్రదం కూడా.
మసాలాలు లేకుండా..
మాంసాహారం రుచి అంతా మాసాలాలతోనే అనుకునేవారు చింతకాయ వంటకాలు గురించి తెలుసుకోవాల్సిందే. ఈ సీజన్‌లో వచ్చే చేపల్ని చింతకాయలతో కలిపి వండితే ఆ రుచి అమోఘంగా ఉంటుంది అంటారు నాన్‌వెజ్‌ అభిమానులు. ఈ వంటకాల్లో మసాలాల వాడకం ఉండదు. కట్టిపరిగలూ, చేదుపరిగలూ, చిన్నచేపలూ, సావడాయలు, రామలూ, నెత్తళ్లు, కొయ్యింగలూ, జల్లలూ, రొయ్యలతో కలిపి చింతకాయని వండుకోవచ్చు. వీటి తయారీలో కనీసం అల్లం, వెల్లుల్లి ముద్దని కూడా వెయ్యరు. కారణం... దాని సహజసిద్ధమైన రుచిని మసాలాలు డామినేట్‌ చేయకుండానే అంటారు పల్లెవాసులు.

ఆరోగ్యానికి మేలు...

* శీతాకాలంలో జీవక్రియలు అంత చురుగ్గా ఉండవు. ఫలితం.. శరీరంలో వ్యాధినియంత్రణ శక్తి తగ్గి... దగ్గు, జలుబు, జ్వరం వంటివి సులభంగా దాడి చేస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది పచ్చిచింత. వ్యాధినిరోధక విటమిన్‌గా చెప్పే థయామిన్‌ రోజువారీ అవసరాల్లో 36 శాతం తీరుస్తుంది.
* చింతలో డైటరీ ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్‌ని సమర్థంగా ఎదుర్కొంటుంది.  అందుకే శరీరంలోని వ్యర్థాలు నివారించడానికి చింత బాగా ఉపయోగపడుతుంది.
* ఇనుము, ఫోలిక్‌యాసిడ్‌, ఎ విటమిన్‌ వంటి విటమిన్లు స్త్రీలల్లో రక్తహీనత రాకుండా చూస్తాయి.
* దీనిలోని పొటాషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.

లేత చింతకాయలు అయితే చెక్కుకూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. రోట్లో నేరుగా దంచుకోవచ్చు. గింజపట్టినవి అయితే నిలువుగా చీల్చి పప్పు తీసేసి పైపైన చెక్కు తీసుకుంటే సరిపోతుంది.

చింతతొక్కు ఊరుబిండి

కావాల్సినవి: చింతతొక్కు- ఒక కప్పు, పల్లీలు- కప్పు, పచ్చిమిర్చి- ఐదు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు
తయారీ: ఒక పాత్రలో ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలని ఉడికించి పెట్టుకోవాలి. మరో పాత్రలో పల్లీలని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. రోట్లో పల్లీలు, ఉడికించిన ఉల్లి, పచ్చిమిర్చిలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీనికి చింతతొక్కుని కూడా జోడించి మళ్లీ ఒకసారి దంచుకుంటే ఊరుబిండి రెడీ.

చింతకాయ రొయ్యల కూర  

కావాల్సినవి: చింతకాయలు- పావుకిలో, పచ్చిరొయ్యలు- అరకిలో, పసుపు- కొద్దిగా, కారం- రెండు చెంచాలు, నూనె- తగినంత, ఉల్లిపాయ తరుగు- కప్పు, దంచిన అల్లం- కొద్దిగా, ఉప్పు- తగినంత
తయారీ: ముందుగా చింతకాయల్ని నిలువుగా చీల్చి అందులోని పప్పు తీసేయాలి. వీటిని రోట్లోకానీ మిక్సీలో కానీ వేసి పసుపు, ఉప్పు వేసుకుని దంచుకుని పక్కన పెట్టుకోవాలి.
ఒక మూకుట్లో నూనె పోసుకుని అందులో ఉల్లిపాయల తరుగు, పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసిన పచ్చిరొయ్యలని తీసుకుని నూనెలో వేసి మగ్గించుకోవాలి. దంచిన అల్లం కూడా వేసుకుని బాగా కలిపి అందులో ఇందాక మనం నూరిన చింతకాయ మిశ్రమాన్ని వేసి కలియ తిప్పాలి. కాసేపటికి మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కారం కూడా వేసి కొద్దిగా నీరు పోసుకుని మూత పెట్టేయాలి.  చింత పులుపు రొయ్యలకు పట్టి ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్లు కూర ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవచ్చు.

కొయ్యింగతో కలిసి..

కావాల్సినవి: కొయ్యింగ చేప- ఒకటి(అరకిలో), చింతకాయలు- 200గ్రా, పచ్చిమిర్చి- పది, ధనియాలు- చెంచా, జీలకర్ర- అరచెంచా, అల్లం ముక్క- కొద్దిగా, ఉల్లిపాయలు- మూడు, నూనె, ఉప్పు- తగినంత
తయారీ: పప్పు తీసిన చింతకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి బరకగా చేసుకోవాలి.
మూకుడులో ముందుగా చింతకాయ పేస్ట్‌, ఆపై పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఆపై చేపలు కూడా వేసి నూనె వేయాలి. కొద్దిగా నీరు పోసి అప్పుడు పొయ్యి వెలిగించి ఓ మోస్తరు సెగపై ఉడికించుకోవాలి. కూర దగ్గరగా వచ్చి బుడగలు వస్తూ నూనె పైకి తేలుతున్నప్పుడు దింపుకుని కొత్తిమీర చల్లుకోవాలి.

చేపలు, చింతకాయలు కలిపివండేటప్పుడు మట్టిపాత్రల్లో వండితే వాటి రుచి బాగుంటుంది.

చేదుపరిగలతో..

కావాల్సినవి: చేదుపరిగలు- పావుకిలో, చింతకాయలు- 150 గ్రా, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- ఆరు, నూనె- తగినంత, ధనియాలు, జీలకర్ర - అరచెంచా చొప్పున, అల్లం- కొద్దిగా, ఉప్పు- సరిపడేంత
తయారీ: ముందుగా మిక్సీలో ఉల్లిపాయలు ముక్కలూ, ధనియాలు, జీలకర్ర, అల్లం వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత చింతకాయ ముక్కలని కూడా బరకగా మిక్సీ పట్టాలి. వెడల్పాటి మూకుడు తీసుకుని అందులో ముందుగా చింతకాయ మిశ్రమం, తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆపై చేపలని పొరలుగా వేసుకుని, ఆపై నూనె, కొద్దిగా నీరు పోసి అప్పుడు పొయ్యి మీద పెట్టాలి. చిన్నసెగ మీద పెట్టుకుంటే కూర కాసేపటికి ఇగిరిపోతుంది. కూరని గరిటెతో కదిపితే చేపలు విరిగిపోతాయి. కాబట్టి మొత్తంగా మూకుడుని కదిపితే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే సరి.

మిడుసు  

కావాల్సినవి: పెరుగు- రెండున్నర కప్పులు, చింతతొక్కు- ఒక కప్పు, ఉల్లిపాయ తరుగు- నిలువుగా తరిగినవి పావుకప్పు, తాలింపు గింజలు, కరివేపాకు- ఒక రెబ్బ, నూనె- కొద్దిగా, ఇంగువ, పసుపు- కొద్దిగా
తయారీ: ఒక గిన్నెలో తాజా పెరుగు తీసుకుని దీనిలో చింతతొక్కుని వేసి బాగా కలుపుకోవాలి. చింతతొక్కులో ముందుగానే ఉప్పు ఉంటుంది కాబట్టి అవసరం అనిపిస్తే తప్ప వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనిని పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో నూనె పోసుకుని అందులో తాలింపు గింజలూ, కరివేపాకూ, ఉల్లిపాయలు, పసుపు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ పోపు చల్లారాక ఇందాక మనం తయారుచేసిన పెరుగులో వేసుకుని కలుపుకోవాలి. చింతతొక్కు మిడుసు సిద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని