స్టార్ట్‌ చేద్దామా..!

కొత్త ఏడాది విందుల హడావుడి మొదలయ్యింది కదా! మీ పాకశాస్త్ర నైపుణ్యం చూపించడానికి ఇదే మంచి అవకాశం అనుకుంటున్నారా? అయితే రుచికరమైన స్టార్టర్లతో శుభారంభం చేయండి.

Updated : 01 Jan 2023 06:30 IST

కొత్త ఏడాది విందుల హడావుడి మొదలయ్యింది కదా! మీ పాకశాస్త్ర నైపుణ్యం చూపించడానికి ఇదే మంచి అవకాశం అనుకుంటున్నారా? అయితే రుచికరమైన స్టార్టర్లతో శుభారంభం చేయండి. ఇంటిల్లపాదీ మనసు దోచేయండి..


చికెన్‌ పాప్‌కార్న్‌

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌- 500గ్రా మారినేషన్‌ కోసం: అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, ఉప్పు- తగినంత, కారం- చెంచాన్నర, పసుపు- పావుచెంచా, ధనియాలపొడి- అరచెంచా, వెనిగర్‌- చెంచా, కొత్తిమీర తరుగు- చెంచాన్నర, గుడ్డు-1, మొక్కజొన్నపిండి- చెంచాన్నర, కోటింగ్‌ కోసం: బ్రెడ్‌క్రంబ్స్‌- ముప్పావుకప్పు, కార్న్‌ఫ్లేక్స్‌పొడి- కప్పులో మూడోవంతు, ఉప్పు- అరచెంచా, కారం- చెంచా, నూనె- వేయించడానికి సరిపడ

తయారీ: ఒక పాత్రలో చికెన్‌ వేసుకుని మారినేషన్‌ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ బాగా కలిపి ఫ్రిజ్‌లో రెండు గంటలపాటు ఉంచాలి. మరొక పాత్ర తీసుకుని దీనిలో కోటింగ్‌ కోసం మొక్కజొన్నపిండి, బ్రెడ్‌క్రంబ్స్‌, కార్న్‌ఫ్లేక్స్‌పొడి, ఉప్పు, కారం అన్నీ బాగా కలపాలి. మారినేట్‌ చేసి సిద్ధంగా పెట్టుకున్న చికెన్‌ ముక్కలని ఈ కోటింగ్‌ పొడిలో వేసి దొర్లించుకోవాలి. వీటిని నూనెలో ఎర్రగా వేయించుకుంటే చికెన్‌ పాప్‌కార్న్‌ సిద్ధం.


వెజ్‌, నాన్‌వెజ్‌ ఏ స్టార్టర్‌లు చేసినా..పదార్థాల్ని ఒకటి రెండు గంటలు మారినేట్‌ చేసి పెట్టుకుంటే ఆ రుచి ప్రత్యేకంగా ఉంటుంది.


మష్రూమ్‌ 65

కావాల్సినవి: పెరుగు- అర కప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, ఎర్రని కశ్మీరి కారం- రెండు చెంచాలు, జీలకర్ర- చెంచా, ధనియాల పొడి- రెండు చెంచాలు, గరంమసాలా- చెంచా, కరివేపాకు- రెబ్బ, కార్న్‌ఫ్లోర్‌- రెండు చెంచాలు, మైదా- 4 చెంచాలు, నిమ్మరసం- అరచెంచా, ఉప్పు- తగినంత, పుట్టగొడుగులు- 200గ్రా, నూనె- వేయించడానికి సరిపడ, ఉల్లికాడ- ఒకటి, బియ్యప్పిండి- రెండు చెంచాలు 

తయారీ: ముందుగా పుట్టగొడుగులని శుభ్రం చేసుకుని నిలువుగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో పెరుగుని క్రీంలా అయ్యేలా చిలికి పెట్టుకోవాలి. దీనికి అల్లం, వెల్లుల్లిపేస్ట్‌, గరంమసాలా, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, సన్నగా తరిగిన కరివేపాకు, మొక్కజొన్న పిండి, మైదా, బియ్యప్పిండి, ఉప్పు చివరిగా నిమ్మరసం వేసుకోవాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె పోసి వేడెక్కాక... అప్పుడు మొక్కజొన్నపిండి మిశ్రమంలో మష్రూమ్స్‌ని వేసుకోవాలి. ముందే వేసుకుంటే వాటి నుంచి నీళ్లు ఊరి పిండి పలచబడుతుంది. వీలైనంత వరకూ పిండి పలచగా లేకుండా జాగ్రత్తపడాలి. లేదంటే కాస్త బియ్యప్పిండి వేసుకోవాలి. పిండిలో ముంచి మష్రూమ్స్‌ని నూనెలో దోరగా వేయించుకోవడమే. ఉల్లికాడల్ని సన్నగా తరిగి వడ్డించుకుంటే సరి.  


చట్‌పటా ఆలూ


కావాల్సినవి:  బేబీ ఆలూ(చిన్న బంగాళాదుంపలు)- 15 (ఆలూ ముక్కలు కూడా తీసుకోవచ్చు), ధనియాల పొడి- రెండు చెంచాలు, కారం- చెంచా, ఆమ్‌చూర్‌ పొడి- రెండు చెంచాలు, గరంమసాలా- చెంచా, వేయించిన నువ్వులు- రెండు చెంచాలు, సోంఫు పొడి- చెంచా, ఉప్పు- రుచికి తగినంత, నూనె- తగినంత , కరివేపాకు- రెబ్బ 

తయారీ: బంగాళా దుంపల్ని ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. స్టౌ వెలిగించి మరొక కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకుని వేడెక్కాక అందులో కరివేపాకు, వేయించిన ఆలూ, పైన చెప్పుకొన్న మసాలా పొడులు వేసి రెండు నిమిషాలు వేయించుకుంటే చట్‌పటా ఆలూ సిద్ధం.


ప్రాన్‌ 65

కావాల్సినవి: రొయ్యలు- 250గ్రా, పసుపు- పావుచెంచా, మిరియాలపొడి- పావుచెంచా, జీలకర్రపొడి- అరచెంచా, ఉప్పు- తగినం, ధనియాల పొడి- చెంచా, కారం- చెంచా, మొక్కజొన్న పిండి- చెంచా, సెనగపిండి- చెంచా, బియ్యప్పిండి- చెంచా, కరివేపాకు- రెబ్బ, నిమ్మరసం- చెంచా, నూనె- తగినంత 

తయారీ: పసుపు వేసి  రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలి. గిన్నెలో రొయ్యలు, మసాలా పొడులు, పిండ్లు వేసి రొయ్యలకు బాగా పట్టించాలి. చివరిగా నిమ్మరసం, ఉప్పువేసి మరో కలపాలి. ఈ మసాలా పట్టించిన రొయ్యలని ఒక్కోటిగా నూనెలో వేయించుకుంటే ప్రాన్‌ 65 సిద్ధం.


క్రిస్పీ కార్న్‌

కావాల్సినవి: స్వీట్‌కార్న్‌- కప్పు, మైదా- రెండు చెంచాలు, మిరియాలపొడి- అరచెంచా, వెల్లుల్లి పలుకులు- అరచెంచా, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడ, టాంపరింగ్‌ కోసం: నూనె- రెండు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- మూడు, పచ్చిమిర్చి- రెండు, ఉల్లికాడల తరుగు- పావుకప్పు, టొమాటోసాస్‌- పావుకప్పు, చిల్లీసాస్‌- చెంచా, సన్నగా తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలు- పావు కప్పు, వెనిగర్‌- చెంచా, సోయాసాస్‌- చెంచా, ఉప్పు- తగినంత 

తయారీ: ఒక పాత్రలో మొక్కజొన్నపిండి, మైదా, ఉప్పు, మిరియాలపొడి చెంచాన్నర నీళ్లు పోసి కలిపి అందులో మొక్కజొన్న గింజల్ని కలిపి.. డీప్‌ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకొనేందుకు ఒక టిష్యూ పేపర్‌పై వేసుకోవాలి. వేరే కడాయిలో.. కొద్దిగా నూనె పోసుకుని వెల్లుల్లి పలుకులు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. తర్వాత ఉల్లికాడలు. వీటిని  సన్నగా తరిగి ఒక నిమిషం వేయించుకుని.. క్యాప్సికమ్‌ ముక్కలని వేయించుకోవాలి. ఇందులో టొమాటో సాస్‌, చిల్లీసాస్‌, సోయాసాస్‌, వెనిగర్‌ వేశాక డీప్‌ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్‌ గింజలు, ఉప్పు వేసి వేయించుకుంటే క్రిస్పీకార్న్‌ సిద్ధం.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని