చాయ్‌...ఎంత హాయి...

చాయ్‌ పేరు వింటే చాలు ఎక్కడ లేని హుషారూ పుట్టుకొస్తుంది. కబుర్లు చెప్పుకుంటూ వేడివేడిగా తాగుతుంటే స్వర్గం ఇంకెక్కడో లేదు అనిపిస్తుంది. టీ ప్రియులు రోజులో ఎన్నిసార్లు తాగుతారో లెక్కే లేదు. అంత గిరాకీ ఉండబట్టే వీధివీధిలో టీస్టాల్స్‌ వెలుస్తున్నాయి

Updated : 23 Jul 2023 04:39 IST

చాయ్‌ పేరు వింటే చాలు ఎక్కడ లేని హుషారూ పుట్టుకొస్తుంది. కబుర్లు చెప్పుకుంటూ వేడివేడిగా తాగుతుంటే స్వర్గం ఇంకెక్కడో లేదు అనిపిస్తుంది. టీ ప్రియులు రోజులో ఎన్నిసార్లు తాగుతారో లెక్కే లేదు. అంత గిరాకీ ఉండబట్టే వీధివీధిలో టీస్టాల్స్‌ వెలుస్తున్నాయి. తేనీరు ఎప్పుడైనా ఇష్టంగా సేవిస్తాం. ఇక వర్షాకాలం గురించి చెప్పాల్సిందేముంది! మరీమరీ తాగాలనిపిస్తుంది. పాలు, టీపొడితో చేసే సాధారణ తేనీరు సంగతి అలా ఉంచితే రోగనిరోధక శక్తిని పెంచే భిన్నమైన చాయ్‌ తాగితే మరీ మంచిది కదా! ఈ కాలంలో వచ్చే దగ్గూ, జలుబులను తరిమేసే ప్రత్యేకమైన టీ రకాలు అనేకం ఉన్నాయి. అలాంటివి ప్రయత్నిస్తే.. వెరైటీ రుచులు ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. దేనికదే తనదైన పరిమళాలు వెదజల్లుతూ వహ్వా అనిపిస్తుంది. ఆస్వాదించి ఆనందించడమే తరువాయి.


కాశ్మీరీ ఖావా గ్రీన్‌ టీ

కావలసిన పదార్థాలు: కాశ్మీరీ గ్రీన్‌ టీ ఆకులు - 4 చెంచాలు, కుంకుమ పూవు - పావు చెంచా, దాల్చినచెక్క - చిన్న ముక్క, ఇలాచి - 2, లవంగాలు - 2, పంచదార - 2 చెంచాలు, సన్నగా తరిగిన బాదం పలుకులు - పావు కప్పు
తయారీ: రెండు కప్పుల వేడినీళ్లలో కుంకుమపూవు రేకలు వేసి పక్కన పెట్టాలి. ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి దాల్చినచెక్క, ఇలాచి, లవంగాలు, పంచదార వేసి మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత కాశ్మీరీ గ్రీన్‌ టీ ఆకులు వేసి మరో మూడు నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు కుంకుమ పూవు నీళ్లు, తరిగిన బాదం గింజలు వేసి రెండు నిమిషాలు సన్న సెగ మీద ఉంచి, వడకడితే సరిపోతుంది. సాటిలేని మేటి కాశ్మీరీ ఖావా గ్రీన్‌ టీ రుచీ, పరిమళాలను ఆస్వాదించవచ్చు.


అశ్వగంధతో

కావలసిన పదార్థాలు: నీళ్లు - 4 కప్పులు, అశ్వగంధ కాడ - ఒకటి, అల్లం - అంగుళం అంత ముక్క, పంచదార - 3 చెంచాలు, నిమ్మరసం - పావు చెంచా
తయారీ: టీ గిన్నెలో నీళ్లు పోసి, అశ్వగంధ కాడ, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి నాలుగు నిమిషాలు మరిగించాలి. తర్వాత పంచదార వేసి, సన్న సెగ మీద ఒక నిమిషంపాటు ఉంచి దించేయాలి. ఇప్పుడు నిమ్మరసం కూడా వేసి వడకడితే సరి ఘుమఘుమలాడే అశ్వగంధ టీ సిద్ధం.


అతిమధురంతో

కావలసిన పదార్థాలు: అతిమధురం పొడి (ఇది లిఖోరైస్‌ పేరుతో ఆయుర్వేద దుకాణంలో దొరుకుతుంది) - అర చెంచా, మిరియాల పొడి - పావు చెంచా, దాల్చినచెక్క పొడి - పావు చెంచా, తులసి ఆకులు - 4, అల్లం ముద్ద - అర చెంచా, నిమ్మరసం - ఒక చెంచా
తయారీ: నాలుగు కప్పుల నీళ్లు టీ పాత్రలో పోసి అతిమధురం పొడి, మిరియాల పొడి, దాల్చినచెక్క పొడి, అల్లం ముద్ద, తులసి ఆకులు వేసి మరిగించి వడకడితే సరి మాధుర్యానికి చిరునామా లాంటి అతిమధురం టీ రెడీ. ఈ గమ్మత్తయిన పరిమళం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.


లెమన్‌గ్రాస్‌తో

కావలసిన పదార్థాలు: లెమన్‌గ్రాస్‌ - 4 కాడలు, నీళ్లు - రెండు గ్లాసులు, అల్లం - అంగుళం ముక్క, యాలకులు - రెండు, తేనె - రెండు చెంచాలు
తయారీ: ఉల్లి కాడలను తలపించే లెమన్‌గ్రాస్‌ను కడిగి రెండంగుళాల పొడవుండేలా కోయాలి. అల్లం సన్న ముక్కలుగా తరగాలి. యాలకులను పొడి చేయాలి. ఒక పాత్రలో నీళ్లు పోసి ఇవన్నీ వేసి ఆరు నిమిషాలు మరిగించాలి. స్టవ్వు కట్టేసి ఆ నీటిని వడకట్టి తేనె కలిపి కప్పుల్లో పోస్తే సరిపోతుంది. ఆ కమ్మటి రుచీ, పరిమళాలు ఆహ్లాదం కలిగిస్తాయి.


నారింజపొట్టుతో

కావలసిన పదార్థాలు: నారింజపొట్టు - ఐదారు ముక్కలు, నీళ్లు - మూడు కప్పులు, దాల్చినచెక్క - అంగుళం ముక్క, తేనె - రెండు చెంచాలు
తయారీ: నీళ్లలో నారింజపొట్టు వేసి మూడు నిమిషాలు మరిగించాలి. దాల్చినచెక్క వేసి, మూతపెట్టి, ఇంకో మూడు నిమిషాలు సన్న సెగ మీద ఉంచాలి. తర్వాత దించి వడకట్టి తేనె కలిపి ఆస్వాదించడమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని