పనీర్‌తో పసందుగా..!​​​​​​​

నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉల్లిపాయ గుజ్జు వేసి రెండుమూడు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత పసుపు, గరంమసాలా, ఉప్పు, కారం వేసి కలిపి ఓ నిమిషం..

Published : 27 Jun 2021 14:52 IST

మటర్‌ పనీర్‌


 

కావలసినవి 
పనీర్‌: పావుకిలో, తాజా బఠాణీలు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: రెండు, అల్లం: అంగుళంముక్క, వెల్లుల్లిరెబ్బలు: నాలుగు, మీగడ: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, పసుపు: అరటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, గరంమసాలా: అరటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం 
అల్లంవెల్లుల్లి, ఉల్లిముక్కలు కలిపి మెత్తగా నూరాలి. టొమాటో ముక్కలు విడిగా గుజ్జులా చేయాలి. బఠాణీలు ఓ ఐదు నిమిషాలు ఉడికించి తీయాలి. 
నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉల్లిపాయ గుజ్జు వేసి రెండుమూడు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత పసుపు, గరంమసాలా, ఉప్పు, కారం వేసి కలిపి ఓ నిమిషం వేగనివ్వాలి. 
టొమాటో గుజ్జు కూడా నూనె బయటకు వచ్చేవరకూ వేయించి, మీగడ వేసి కలిపి ఓ రెండు నిమిషాలు ఉడికించాలి. అవసరమైతే కాసిని నీళ్లు పోసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు 
బఠాణీలు వేసి కలిపి కూర దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి. తరవాత పనీర్‌ ముక్కలు కూడా వేసి కలిపి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరవాత కొత్తిమీర తురుము కూడా చల్లి దించాలి.


పనీర్‌ మఖాని

కావలసినవి 
పనీర్‌: 200గ్రా., టొమాటోలు: నాలుగు, పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లి తురుము: 2 టీస్పూన్లు,  అల్లం తురుము: 2 టీస్పూన్లు, జీలకర్ర: టీస్పూను, యాలకులు: రెండు, లవంగాలు: రెండు, దాల్చినచెక్క: అంగుళంముక్క, కారం: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, గరంమసాలా: టీస్పూను, ఉప్పు: తగినంత, మీగడ: టేబుల్‌స్పూను, కసూరిమెంతి: టేబుల్‌స్పూను, వెన్న: టేబుల్‌స్పూను.
తయారుచేసే విధానం 
టొమాటోలు గుజ్జులా చేయాలి. 
పాన్‌లో వెన్న వేసి వేడిచేసి, జీలకర్ర, దాల్చినచెక్క ముక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించాలి. తరవాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు టొమాటో గుజ్జు కూడా వేసి నూనె బయటకు వచ్చేవరకూ ఉడికించాలి. 
తరవాత పసుపు, గరంమసాలా, కారం, దనియాలపొడి, ఉప్పు వేసి కాసేపు ఉడికిన తరవాత అరకప్పు నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. ఇప్పుడు పనీర్‌ముక్కలు వేసి మూతపెట్టి నాలుగు నిమిషాలపాటు ఉడికించాలి. 
ఇప్పుడు కాస్త కసూరి మెంతి పొడి కూడా చల్లి దించాలి. చివరగా కొత్తిమీర తురుము, మీగడ వేసి వడ్డించాలి.


పనీర్‌ బుజియా

కావలసినవి 
పనీర్‌: 200 గ్రా., జీలకర్ర: అరటీస్పూను, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిముక్కలు: కప్పు, అల్లంవెల్లుల్లి: టీస్పూను, దనియాలపొడి: టేబుల్‌స్పూను, గరంమసాలా: అరటీస్పూను, టొమాటో: ఒకటి, క్యాప్సికమ్‌ ముక్కలు: 2 కప్పులు, పసుపు: టీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం 
పన్నీర్‌ను చేత్తో చిదిమి ఉంచాలి. బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి కూడా వేసి కాస్త వేగాక క్యాప్సికమ్‌ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరవాత చిదిమిన పనీర్‌ వేసి రెండు నిమిషాలు మూతపెట్టి ఉడికిన తరవాత మసాలా పొడి చల్లాలి. చివరగా కొత్తిమీర తురుము కూడా వేసి కలిపి దించాలి.


మొఘలాయి షాహీ పనీర్‌

కావలసినవి 
పనీర్‌ ముక్కలు: పావుకిలో, పెరుగు: ఒకటిన్నర కప్పులు, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, కారం: 2 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, గరంమసాలా: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, మంచినీళ్లు: కప్పు, మీగడ: 3 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, లవంగాలు: నాలుగు, దాల్చినచెక్క: అంగుళం ముక్క, మసాలా ముద్దకోసం: జీడిపప్పు: 12, బాదం: పది, ఉల్లిముక్కలు: కప్పు, యాలకులు: నాలుగు, టొమాటో: ఒకటి, పచ్చిమిర్చి: రెండు
తయారుచేసే విధానం 
బాణలిలో టేబుల్‌స్పూను నెయ్యి వేసి కాగనివ్వాలి. తరవాత జీడిపప్పు, యాలకులు, బాదం వేసి వేయించి తీయాలి. తరవాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. టొమాటో ముక్కలు కూడా వేసి వేగాక దించాలి. చల్లారాక అన్నీ కలిపి కొన్ని నీళ్లు చల్లి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేయాలి. 
అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి కాగాక జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క వేసి, అవి వేగాక అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. 
ఉల్లి మిశ్రమం ముద్ద, కారం, గరంమసాలా, పసుపు, ఉప్పు వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. బాగా గిలకొట్టిన పెరుగు వేసి సిమ్‌లో ఉడికించాలి. తరవాత మంచినీళ్లు పోసి కాస్త ఉడికిన తరవాత ఉప్పు సరిచూసి, పనీర్‌ ముక్కలు కూడా వేసి ఉడికించాలి. ముక్కలు పూర్తిగా ఉడికిన తరవాత మీగడ వేసి దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని