దసరా పిండి వంట... ఇంటింటా..!

తెలంగాణలో బతుకమ్మలూ ఆంధ్రప్రదేశ్‌లో దేవీనవరాత్రుల పూజలతో వీధులూ వాడల్లో ఈకాలం ఒకటే కోలాహలం. పైగా పిల్లలకూ దసరా సెలవులు కావడంతో ఇంటింటా రుచికరమైన పిండివంటలూ షరా మామూలే. వాటిల్లో కొన్ని...

Updated : 12 Dec 2021 17:33 IST

తెలంగాణలో బతుకమ్మలూ ఆంధ్రప్రదేశ్‌లో దేవీనవరాత్రుల పూజలతో వీధులూ వాడల్లో ఈకాలం ఒకటే కోలాహలం. పైగా పిల్లలకూ దసరా సెలవులు కావడంతో ఇంటింటా రుచికరమైన పిండివంటలూ షరా మామూలే. వాటిల్లో కొన్ని...

చక్కిడాలు

కావలసినవి
బియ్యప్పిండి: అరకిలో, సెనగపిండి: కప్పు, కారం: టీస్పూను, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, వెన్న: 4 టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* వెడల్పాటి గిన్నెలో బియ్యప్పిండి, సెనగపిండి, వెన్న, ఉప్పు వేసి కలపాలి. తరవాత అందులోనే నువ్వులు కూడా వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కలపాలి. మిశ్రమాన్ని చక్కిడాల గొట్టంలో పెట్టి, కాగిన నూనెలో చిన్న చిన్న చక్కిడాల్లా వత్తి ఎర్రగా వేయించి తీయాలి.

సర్వపిండి

కావలసినవి
జొన్నపిండి: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, కారం: 2 టీస్పూన్లు, ఉప్పు: టీస్పూను, బియ్యప్పిండి: 3 టేబుల్‌స్పూన్లు, జీలకర్రపొడి: టేబుల్‌స్పూను, పసుపు: పావు టీస్పూను
తయారుచేసే విధానం
* ఉల్లిపాయలు సన్నగా తరిగి
* గిన్నెలో వేయాలి. అందులోనే ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, పసుపు వేసి కలిపి ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి.
* విడిగా మరో గిన్నెలో జొన్నపిండి, బియ్యప్పిండి వేసి కలపాలి. తరవాత ఓ కప్పు నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి.
* ఇప్పుడు పెనంమీద నాలుగు టీస్పూన్ల నూనె వేయాలి. చేతులకి కూడా నూనె రాసుకుని కొద్దిగా పిండి ముద్దను తీసుకుని బిళ్లలా చేసి దాన్ని పెనంమీద వేసి వేళ్లతో జొన్నరొట్టె మాదిరిగానే పెనం అంతా వచ్చేలా వత్తాలి.
* చివరగా మధ్యలో చిన్న చిన్న రంథ్రాలు చేసి అందులో కొద్దిగా నూనె వేయాలి. దీన్ని రెండువైపులా కాల్చి తీయాలి.

పాల బూరెలు

కావలసినవి
బియ్యప్పిండి: 3 కప్పులు, బెల్లం తురుము: 2 కప్పులు, పాలు: ఒకటిన్నర కప్పులు, ఉప్పు: చిటికెడు, యాలకులు: రెండు, మైదాపిండి: కప్పు, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* వెడల్పాటి బేసిన్‌లో బియ్యప్పిండి, యాలకులపొడి, కరిగించిన బెల్లం, మైదాపిండి, పాలు, చిటికెడు ఉప్పు వేసి కాస్త జారుగా కలపాలి. తరవాత మిశ్రమాన్ని గరిటెతో తీసుకుని కాగిన నూనెలో బూరెల్లా వేసి వేయించి తీస్తే రుచికరమైన పాల బూరెలు రెడీ.

కోవా కజ్జికాయలు

కావలసినవి
మైదాపిండి: పావుకిలో, నెయ్యి: 50 గ్రా., పంచదార పొడి: కప్పు, పాలపొడి: పావుకిలో, జీడిపప్పు: 20, బాదం: 20, కిస్‌మిస్‌: 20, చిరోంజి: టేబుల్‌స్పూను, పాలు: పావులీటరు, ఉప్పు: చిటికెడు, యాలకులు: మూడు, నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కరిగించిన నెయ్యి, కాచి చల్లార్చిన ఓ కప్పు పాలు పోసి ఐదు నిమిషాలపాటు కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.
* బాదం, జీడిపప్పు, చిరోంజి పప్పులు మిక్సీలో వేసి పొడి చేయాలి.
* బాణలిలో నెయ్యి వేసి కరిగిన తరవాత మిగిలిన పాలు, పాలపొడి వేసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కని కోవాలా తయారయ్యాక స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. తరవాత ఇందులోనే పంచదార పొడి, యాలకులపొడి, ఎండుద్రాక్ష, పొడి చేసిన జీడిపప్పు మిశ్రమం వేసి కలపాలి. ఇప్పుడు పిండిముద్దను చిన్న ఉండల్లా చేసుకుని చిన్నపాటి పూరీ లేదా చపాతీలా వత్తి దాని పైన నెయ్యి రాసి రెండు టీస్పూన్ల కోవా మిశ్రమం వేసి అంచుల దగ్గర తడిచేసి కజ్జికాయలా వత్తాలి. దీన్నే చిన్నసైజు గుజియా మోల్డ్‌లో పెట్టి కూడా చేయొచ్చు. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీస్తే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని