తనదాకా వస్తే

స్కూల్‌ నుంచి అలసటగా ముభావంగా వచ్చిన నా కూతురు ఐశ్వర్యను చూస్తూ ‘‘ఏం ఐశూ, అంత డల్‌గా ఉన్నావు, క్లాసులో వర్క్‌ ఎక్కువైందా ఏంటీ... మొహం అలా వాడిపోయింది’’ అంటూ మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ ప్రశ్నించాను.

Updated : 14 May 2023 11:59 IST

- శ్రీదేవి విన్నకోట

స్కూల్‌ నుంచి అలసటగా ముభావంగా వచ్చిన నా కూతురు ఐశ్వర్యను చూస్తూ ‘‘ఏం ఐశూ, అంత డల్‌గా ఉన్నావు, క్లాసులో వర్క్‌ ఎక్కువైందా ఏంటీ... మొహం అలా వాడిపోయింది’’ అంటూ మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ ప్రశ్నించాను. ‘‘ఏం లేదమ్మా, బానే ఉన్నాను’’ అంటూ కాలికున్న షూసూ సాక్సూ విప్పి ర్యాక్‌లో పెట్టి, పుస్తకాల బ్యాగ్‌తో సహా తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. నా పేరు జానకి. నేను గృహిణిని. మావారు మోహన్‌. ఇక్కడే దగ్గరలో ఉన్న కో-ఆపరేటివ్‌ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. మాకు ఇద్దరు పిల్లలు. ఐశ్వర్య టెన్త్‌ చదువుతోంది. తర్వాత బాబు పవన్‌ ఎయిత్‌ క్లాస్‌ చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ చదివేది గవర్నమెంట్‌ స్కూల్‌లోనే. ఇద్దరూ ఒకే స్కూల్‌. చక్కగా చదువుతారు. ఒద్దికగా ఉంటారు. చాలామంది పిల్లల్లా ఫోనూ ఇంటర్నెట్టూ అంటూ కలవరించే ఆన్‌లైన్‌ గూటిపక్షులు అసలే కాదు. ఇంట్లో మా మాట వింటారు. చదువూ సంధ్యా ఆటపాటలూ కబుర్లూ పెద్దలపట్ల వినయ విధేయతలూ అన్నీ ఉన్న చక్కని పిల్లలు.
మా పిల్లలు అని ఎక్కువ పొగుడుతున్నా అనుకోకండి... నేను చెప్పేది నిజమే, మా చుట్టాలూ స్నేహితులూ అందరూ ‘మీ పిల్లలు ఈ కాలంలో ఉండాల్సిన పిల్లలు కాదు’ అంటారు. నాకు అది పొగడ్తో వెటకారమో అర్థం కాదనుకోండీ. పిల్లలకు ఎలాంటి అలవాట్లు అయినా మన  పెద్దవాళ్ళ నుంచే వస్తాయి. వాళ్ళ మనసులు తెల్లకాగితం లాంటివి. మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు. వాళ్ళు చెడిపోవాలన్నా మంచిగా ఉండాలన్నా బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది.
ఎప్పుడూ స్కూల్‌ నుంచి గలగలా నవ్వుతూ స్కూల్లో ఏం జరిగిందో ఫ్రెండ్స్‌ ఎవరేమన్నారో టీచర్స్‌ ఏం లెసన్స్‌ చెప్పారో చెప్తూ... వస్తూనే ‘తినడానికి ఏమైనా పెట్టు అమ్మా’ అంటూ మారం చేసే నా కూతురు ఐశ్వర్య అలా ముభావంగా ముఖం ముడుచుకుని ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు.

స్కూల్లో కానీ బయట కానీ ఏం జరిగినా చెప్పే స్వేచ్ఛ తనకి పూర్తిగా ఉంది నా దగ్గర. మేం ఇద్దరం స్నేహితుల్లా ఉంటాం, తల్లీ కూతుళ్ళం అయినా సరే.
ఇంతలో నా కొడుకు పవన్‌ కూడా వచ్చేశాడు. వస్తూనే ‘‘అక్కేదమ్మా’’ అని అడిగాడు. ‘‘రూమ్‌లో ఉంది’’ అని చెప్తూనే, ‘‘స్కూల్లో ఏమైనా జరిగిందా? అక్క ఎందుకు అలా ఉంది’’ అని అడిగాను. ‘‘ఏమో నాకు ఏమీ తెలియదమ్మా, ఇప్పుడే వస్తా’’ అంటూ తలుపు మూల ఉన్న బ్యాట్‌ తీసుకుని, ‘‘పాలు తాగి బయటికి వెళ్ళరా’’ అనే నా మాట పూర్తిగా వినిపించుకోకుండానే ‘‘ఒక్క మ్యాచ్‌ ఆడేసి ఇప్పుడే వస్తా అమ్మా’’ అంటూ తుర్రుమని బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలకి చదువు ఎంత అవసరమో ఆట పాటలు కూడా అంతే అవసరం కదా, అందుకే వాడి ఆటలకు ఎలాంటి అభ్యంతరం చెప్పం- నేను కానీ మా వారు కానీ.

ఒక గ్లాసులో బూస్ట్‌ కలిపి నా కూతురు గదిలోకి వెళ్ళాను. ఫ్రెష్‌ అయ్యి బట్టలు మార్చుకుని బెడ్‌ మీద పడుకుని ఉంది. ‘‘ఏమైంది తల్లీ, అలా ఉన్నావ్‌. రోజూ స్కూల్‌ నుంచి రాగానే బోల్డన్ని కబుర్లు చెప్తూ చాలా అల్లరి చేస్తావు కదా. ఎందుకలా డల్‌గా ఉన్నావురా, ఎవరైనా ఏమైనా అన్నారా? లేదంటే ఏమైనా హోంవర్క్‌ ఫినిష్‌ చేయలేదా? ప్రాజెక్ట్‌ వర్క్‌ ఏమైనా పెండింగ్‌ ఉండిపోయిందా? టీచర్‌ ఏమైనా అన్నారా? నేనేమైనా సాయం చెయ్యనా?’’ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నావంక చూస్తూ ‘‘అబ్బా చాలు ఆపమ్మా, నువ్వూ నీ ప్రశ్నలూ. నాకు తలనొప్పిగా ఉంది. అందుకే పడుకున్నా, అంతకుమించి ఇంకేం లేదు’’ అంది.

నేను గబగబా పెయిన్‌ బామ్‌ తీసుకుని తన తలకి రాద్దామని వెళ్ళాను. ఏమీ వద్దు అన్నట్టుగా నా ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. తన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. నాకు గాభరాగా అనిపించింది. ‘ఎంతో సందడిగా ఉండే పిల్ల ఏంటిలా అసుర సంధ్యవేళ ఏడుస్తోంది’ అనుకుంటూ బలవంతంగా లేపి కూర్చోపెట్టాను.
‘‘ఏం జరిగింది ఐశూ, ఎందుకు అలా ఏడుస్తున్నావ్‌, నిన్ను ఎవరేమన్నారు?’’ అని దగ్గరికి తీసుకుని బుజ్జగించి అడిగేసరికి గట్టిగా వెక్కివెక్కి ఏడవసాగింది. ఏడుస్తూనే వెక్కిళ్ళ మధ్య ‘‘రేపటి నుంచి నేను అసలు స్కూల్‌కి వెళ్ళనమ్మా’’ అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది. ‘‘అయ్యో స్కూల్‌కి వెళ్ళకపోవడం ఏంటే. అసలు ఏం జరిగింది. ఎందుకు ఏడుస్తున్నావ్‌. ఎవరేమన్నారు. నాకు తెలియాలి కదా’’ అని, అడగ్గా అడగ్గా పావుగంట తర్వాత తేరుకుని ఏం జరిగిందో చెప్పసాగింది...

‘‘మా స్కూల్‌లోనే ‘బి’ సెక్షన్‌లో టెన్త్‌క్లాస్‌ చదివే మల్లికా వాళ్ళ అన్నయ్య గిరీష్‌ ప్రతిరోజూ నేను స్కూల్‌కి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ చాలా రోజుల నుంచి ఏడిపిస్తున్నాడు. ‘నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను పెళ్ళి చేసుకుంటావా? ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచి పోదామా’ అని అడుగుతున్నాడు. నేను
ఇన్ని రోజులూ అసలు పట్టించుకోలేదు వాడి మాటలు. ఊరికే వాగి వాగి వాడే ఊరుకుంటాడు అన్నట్టుగా అనుకున్నాను.

కానీ, ఈరోజు వాడి ప్రవర్తన శృతిమించి పోయింది. నేను వచ్చేటప్పుడు వాడు ఏదో మాట్లాడుతుంటే నేను వినిపించుకోనట్లుగా వాడికి సమాధానం చెప్పకుండా వచ్చేస్తున్నా. దాంతో వాడు నా డ్రెస్‌ చున్నీ పట్టుకుని గట్టిగా లాగాడు. చున్నీ చిరిగిపోయింది కూడా. అక్కడ చాలామంది అబ్బాయిలూ పెద్దవాళ్ళూ కూడా ఉన్నారు. ఎవరూ ఏమీ అనలేదు. పైగా అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నాకు ఏడుపొస్తోందమ్మా, నేను ఇంక స్కూల్‌కి వెళ్ళను. వాడు నేను కనిపించినప్పుడల్లా ఏడిపిస్తూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అని నాకు చాలా భయమేస్తుందమ్మా’’ అంటూ మళ్ళీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది.

‘‘అరే ఛా, పిచ్చిమొద్దూ ఏంటిది...

ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా- వాళ్ళకి బుద్ధి చెప్పాలిగాని. వాడి పేరేమన్నావ్‌, వాడి ఇల్లు ఎక్కడ, ఏం చదువుతున్నాడు?

మీ స్కూల్లో చదివే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అని చెప్పావు కదా... రేపు నేను వాడితో మాట్లాడుతాను. మీ స్కూల్‌కి కూడా వస్తాను, నువ్వు ఎప్పట్లానే స్కూల్‌కి వెళ్ళు’’ అని ధైర్యం చెప్పాను.

‘‘వద్దు అమ్మా, వాడు చాలా చెడ్డవాడు. చాలా పిచ్చి పిచ్చిగా బూతులవీ మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఇంకా చాలామంది జులాయి ఫ్రెండ్స్‌ ఉన్నారు. అందరూ వాడిలాంటి వాళ్ళే. నువ్వు రావద్దు, నిన్ను కూడా ఏమైనా అంటాడు. నాకు భయమేస్తుంది’’ అంటూ ఏడుస్తూనే నాకు నచ్చచెప్పబోయింది ఐశు.
‘‘సరే, నేను రాన్లే. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. నువ్వు కంగారుపడకు. అమ్మకి చెప్పావు కదా, ఇక నువ్వు ఈ విషయం మర్చిపో. నేను ఆలోచిస్తాను
ఏం చేయాలో. ఏడవకు, ముందు లేచి ఈ బూస్ట్‌ తాగు. పద హాల్లో కూర్చుని హోంవర్క్‌ చేసుకుందువుగాని. నాన్నగారు వచ్చే టైమ్‌ అయింది. నిన్ను ఇలా డల్‌గా చూస్తే మళ్ళీ కంగారుపడతారు. అసలే నువ్వు మీ నాన్నకి గారాల కూతురివి కదా’’ అంటూ తనని కొంచెం నవ్వించే ప్రయత్నం చేశాను కానీ ఏం ప్రయోజనం కనిపించలేదు. తర్వాత నేను రూమ్‌ నుంచి బయటికి వచ్చేశాను. ‘రేపు ఏం చేయాలి- నా బిడ్డని ఇంతగా ఏడిపించిన వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే’ అని  తీక్షణంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. అలా ఆలోచించగా ఒక చక్కని పరిష్కారం తట్టింది. ‘రేపు నా ఆలోచన ప్రకారమే చేయాలి’ అనుకుంటూ రిలాక్స్‌ అయ్యాను. పొద్దున లేవగానే పనంతా చకచకా ముగించుకుని మావారిని బ్యాంకుకీ పిల్లల్ని స్కూల్‌కీ పంపించిన తర్వాత, రెడీ అయ్యి, నా క్లోజ్‌ ఫ్రెండ్‌ రమణికి కాల్‌ చేసి తనని మా ఇంటికి అర్జంటుగా రమ్మని చెప్పాను. ఈలోపు నా కూతుర్ని ఏడిపించే గిరీష్‌ గాడి అడ్రస్‌ కనుక్కున్నాను.

రమణి వచ్చిన తర్వాత తనకి విషయం అంతా వివరంగా చెప్పాను. ఒక మంచి అందమైన ఇత్తడి పళ్ళెంలో చీరా, జాకెట్‌ ముక్కా, పువ్వులూ, గాజులూ, పళ్ళూ,
పసుపూ కుంకుమా... అన్నీ నీట్‌గా సర్దుకుని వాళ్ళింటికి వెళ్ళాం నేనూ రమణీ కలిసి. గిరీష్‌ అమ్మానాన్నా తాతయ్యా నానమ్మా ఇంట్లోనే ఉన్నారు. మేము ఎవరో తెలియక ‘ఎవరు మీరు?’ అంటూ మమ్మల్ని ‘ఎందుకు వచ్చారు’ అన్నట్టు ఆశ్చర్యంగా చూశారు. నేను వాళ్ళందరికీ నమస్కరిస్తూ ‘‘మీ అమ్మాయి మల్లికా మా పాప ఐశ్వర్యా క్లాస్‌మేట్స్‌.

మా పాప కోసం స్కూల్‌కి వెళ్ళినప్పుడు చాలాసార్లు మీ అమ్మాయిని చూశాను.

నాకు చాలా నచ్చింది. రాకేష్‌ అని మా అన్నయ్యగారి అబ్బాయి ఉన్నాడు. వాడు పెద్దగా చదువుకోలేదు. 10 వరకు చదివి అలా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. వాడు మీ అమ్మాయిని ఎక్కడో చూశాడు అంట. బాగా నచ్చింది అని చెప్పాడు. మీరు పెళ్ళికి ఒప్పుకుంటే మీ అమ్మాయికీ మా అబ్బాయికీ పెళ్ళి చేసేద్దాం. ఇద్దరూ చిలకా గోరింకల్లా చక్కగా కాపురం చేసుకుని పిల్లల్ని కంటారు, మీరేమంటారు?’’ అంటూ చెప్పడం ఆపాను.
వాళ్ళంతా మతిపోయినట్టు చూశారు నావంక. ‘‘ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, పదో తరగతి చదివే 15 ఏళ్ళ చిన్నపిల్లకి పెళ్ళి ఏంటి? అదీ ఏ పనీ పాటా లేని అలాంటి జులాయి వెధవతోనా’’ అంటూ నన్ను కొట్టినంత పని చేశారు.

‘‘నేను తప్పుగా మాట్లాడానా?
మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా
మీ పిల్లని అని అడిగాను’’ అన్నాను అమాయకంగా చూస్తూ.

‘‘చాల్లే ఊరుకో ఏం మాట్లాడుతున్నావ్‌. ఇలాంటి పిచ్చి వాగుడు వాగకుండా ముందు మా ఇంట్లో నుంచి బయటికి నడువు’’ అన్నాడు గిరీష్‌ తండ్రి. ఇంతలో లోపల్నుంచి గిరీష్‌ వచ్చాడు... ‘‘ఏం వాగుతున్నావు నువ్వు, నా చెల్లెలు అంత చిన్న పిల్ల- దానికి అప్పుడే పెళ్ళి చేయాలా? అది కూడా ఎవరో జులాయి వాడికి ఇచ్చి’’ అంటూ.

ఇక నాకు కోపం ఆగలేదు. వాడి చెంప మీద నా శక్తినంతా ఉపయోగించి లాగిపెట్టి కొట్టాను. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు.

‘‘నిజమే మీ మల్లిక చిన్నపిల్ల. తన గురించి నేను అలా  మాట్లాడి ఉండకూడదు. నేను అలా మాట్లాడటం తప్పే. మరి, మా ఐశ్వర్య చిన్నపిల్ల కాదా... నువ్వు చేసే పని ఏంటి? తను స్కూల్‌కి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ ‘నిన్ను పెళ్ళి చేసుకుంటా, ఎక్కడికైనా లేచిపోదామా’ అని అడుగుతూ నోటికొచ్చినట్టు వెకిలిగా మాట్లాడుతూ... చున్నీ లాగడం, ఆడపిల్ల నీ మాటలకి నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే పైశాచికానందం అనుభవించడం... ఏంటిది? అమ్మాయిల్ని స్వేచ్ఛగా బతకనివ్వర్రా మీరు? అది చిన్నపిల్ల. చదువూ ఆటపాటలూ తప్ప మరో ధ్యాస లేని పసిపిల్ల. నీలాంటి పనికిమాలినవాడి మాటలకీ చేతలకీ భయపడిపోయి, తనకు ఎంతో ఇష్టమైన చదువు కూడా మానేయాలి అనుకుంటున్న పిచ్చిపిల్ల’’ అంటూ మరో రెండు వాయించాను వాడిని. ఇంతలో వాళ్ళ అమ్మానాన్నలకి
ఏం జరిగిందో తెలిసి వాడు చేసిన తప్పు అర్థమై తెలివి వచ్చినట్టుంది. ‘‘అసలు ఏం జరిగింది’’ అంటూ అడిగారు.

నా స్నేహితురాలు రమణి- ఐశ్వర్య విషయంలో గిరీష్‌ చేస్తున్నదంతా వాళ్ళకి వివరంగా చెప్పింది. అప్పుడు నేను అన్నాను... ‘‘ఈ విషయం పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి కంప్లైంట్‌ ఇవ్వొచ్చు మీవాడి మీద. అప్పుడు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి.

మీ పరువు పోతుంది. అది మీకు ఎంత అవమానం. అలాగే వాడి భవిష్యత్తూ నాశనం అవుతుంది. అందుకే అవన్నీ ఆలోచించి మీరే అర్థం చేసుకుని
మీ కొడుకుని దారిలో పెడతారు అని మీకు ఈ విషయం తెలియ చెప్పాలని మీ ఇంటికి వచ్చాను’’ అన్నాను.

వాళ్ళ నాన్నకి నా మాటలు వినగానే తన కొడుకుపైన చాలా కోపం వచ్చేసింది. ‘‘మనకీ ఒక ఆడపిల్ల ఉంది, మరో ఆడపిల్లను అలా ఏడిపించవచ్చా తప్పు కదా’’ అంటూ ఆయన మరో రెండు తగిలించాడు గిరీష్‌కి. ‘‘చదువూ సంధ్యా మానేసి పనీ పాటా లేకుండా తిరుగుతుంటే ఏదో చిన్నతనంలే, నువ్వే మారతావు అనుకున్నాను. రోడ్లమీద పడి ఇలాంటి పిచ్చివేషాలు వేస్తున్నావు అన్నమాట. మరొక్కసారి ఇలాంటిది ఏదైనా జరిగిందని తెలిస్తే- నేనే నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసి, నీ మీద పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తా’’ అంటూ, కొడుక్కి వార్నింగ్‌ ఇచ్చి ‘‘ఆమెకు క్షమాపణ చెప్పు. మరోసారి ఇలాంటి తప్పు చేయనని’’ అన్నాడు. వాళ్ళ అమ్మా నానమ్మా తాతయ్యా కూడా వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఏమో నాకైతే చూస్తుంటే వాడిలో కాస్త పశ్చాత్తాపం వచ్చినట్టే అనిపించింది.

‘‘ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చేయను ఆంటీ, నన్ను క్షమించండి’’ అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు.

నేను వాడికి దూరంగా జరుగుతూ ‘‘చూస్తాను, మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే- ఇప్పటిలాగా మంచిమాటలతో చెప్పను. నీకు జీవితం అనేదే లేకుండా చేస్తాను నా బిడ్డ జోలికొస్తే. నోరులేని జంతువులూ పక్షులే- ఎవరైనా తమ పిల్లల జోలికొస్తే ఊరుకోవు. అలాంటిది అన్నీ తెలిసిన మనిషిని నేనెలా ఊరుకుంటా అనుకున్నావ్‌- నా కూతురిని ఏడిపిస్తే’’ అన్నాను.

వాడు ‘‘మరోసారి ఇలాంటి తప్పు జరగదు ఆంటీ’’ అంటూ రెండు చేతులు జోడించాడు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ‘‘మమ్మల్ని క్షమించమ్మా, ఇది మా పెంపకంలో లోపమే. మరోసారి ఇలా జరగకుండా మేము చూసుకుంటాం’’ అనడంతో ఇక బయటికి వచ్చేశాం.

బిడ్డని కన్నతల్లిని నాకు తెలియదా ఇలాంటి రాబందుల బారినుంచి నా చిట్టితల్లిని ఎలా రక్షించి కాపాడుకోవాలో. సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చిన తర్వాత తాజాగా అప్పుడే విరిసిన సిరిమల్లెపువ్వులా కిలకిలా నవ్వుతున్న ఐశ్వర్యని చూశాక... అప్పటిదాకా ఉద్వేగంతో ఊగిపోతున్న నా హృదయం కాస్త కుదుటపడింది. ‘సమస్య ఇంతటితో మమ్మల్ని వదిలి పోయిందిలే’ అనుకుంటూ కళ్ళ నిండుగా నా బిడ్డను చూసుకుంటుంటే మనసులో... ఎంతో శాంతీ సంతోషం..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..