ఈ మార్కెట్లు ఎంతో ప్రత్యేకం!

ఒక ఊరు పేరు చెప్పగానే ఆ ఊరి ప్రత్యేకతలు గుర్తొస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఊళ్లకు స్థానిక మార్కెట్లు ఆ ప్రత్యేకతను తెస్తున్నాయి.

Updated : 11 Jun 2023 04:10 IST

ఒక ఊరు పేరు చెప్పగానే ఆ ఊరి ప్రత్యేకతలు గుర్తొస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఊళ్లకు స్థానిక మార్కెట్లు ఆ ప్రత్యేకతను తెస్తున్నాయి. వాటిలో రెండు ఆధునిక బాటపట్టి గుర్తింపు సాధించగా, ఒకటి మాత్రం దశాబ్దాల చరిత్రను కొనసాగిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.


తాజాదనంలో తిరుగులేదు!

ఇరుకు దారిలో దుకాణాలు, విపరీతమైన రద్దీ, దుమ్మూధూళీ... మార్కెట్‌ అనగానే మనకు గుర్తొచ్చే దృశ్యం. కానీ తెలంగాణలోని గజ్వేల్‌లో నిర్మించిన సమీకృత మార్కెట్‌ ఇందుకు పూర్తి భిన్నం.  ఆరెకరాల విస్తీర్ణంలో రూ.22.85 కోట్ల వ్యయంతో ఈ మార్కెట్‌ని 2019లో  నిర్మించారు. క్లాక్‌టవర్‌తో ఈ మార్కెట్‌ బయటకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీన్లో ఆరు బ్లాకుల్లో 240 స్లాళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో మూడు బ్లాకులు కూరగాయలకూ, పండ్లూ పూలకోసం రెండూ, ఒక బ్లాకుని మాంసాహార దుకాణాలకూ కేటాయించారు. కూరగాయలూ, పండ్లూ, చేపలూ, పూల వ్యాపారాల్ని 90 శాతం మహిళలే సాగిస్తున్నారు. ఇక్కడ ఏసీ హాళ్లలో దుకాణాలు ఉంటాయి. దుకాణాల మధ్య తగినంత దూరం ఉంటుంది. ఎండ బెడద లేకపోవడంతో కూరగాయలూ, పండ్లూ, పువ్వులూ... అన్నీ తాజాగా ఉంటాయి. తాజా కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలతో రాష్ట్రంలోనే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) గుర్తింపు పొందిన ప్రథమ విపణిగా నిలిచింది గజ్వేల్‌ మార్కెట్‌. తరచూ పొరుగు రాష్ట్రాల అధికారులూ, ప్రజాప్రతినిధులూ దీన్ని సందర్శిస్తూ ప్రశంసించి వెళుతున్నారు. తాజా కూరగాయలు సరసమైన ధరలకు విక్రయించటమేగాక పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతుండటంతో మార్కెట్‌ నిర్వహణ ప్రశంసలందుకుంటోంది. దీన్లో కోల్డ్‌ స్టోరేజీ, పిల్లలకు ప్లే ఏరియాలాంటి ఏర్పాట్లూ ఉన్నాయి. రోజుకు సగటున రూ.12 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి.

తాడెం యాదగిరి న్యూస్‌టుడే, గజ్వేల్‌


తాడే‘ఉల్లి’గూడెం!

కశ్మీర్‌ ఆపిల్స్‌కీ, నాగ్‌పుర్‌ కమలాలకీ ప్రసిద్ధి. అలాగే తాడేపల్లిగూడెం ఉల్లికి మంచి పేరుంది. అలాగని ముందు చెప్పిన పండ్లలా గూడెంలో ఉల్లి సాగుచేయరు. అయినా ఇక్కణ్నుంచి వేల టన్నుల ఉల్లి ఎగుమతి చేస్తున్నారంటే ఆ ఘనత మాత్రం స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌ది. స్వతంత్రానికి ముందు హైదరాబాద్‌ నుంచి ఉల్లి, వెల్లుల్లి తదితరాలను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి స్థానిక అవసరాలకు వినియోగించేవారు. అనతి కాలంలోనే వీటికోసం తాడేపల్లిగూడెంవైపు చూసే స్థాయికి తీసుకొచ్చారు ఇక్కడి వ్యాపారులు. కర్నూలుతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచీ ఉల్లిని రైతులే ఇక్కడికి తీసుకొస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం వినియోగం తాడేపల్లిగూడెం ఉల్లిదే. ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లద్వారా ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బిహార్‌ తదితర రాష్ట్రాలకూ బంగ్లాదేశ్‌, నేపాల్‌లకూ సరఫరా చేస్తున్నారు. లారీల్లోనూ వేల టన్నుల ఉల్లి వివిధ రాష్ట్రాలకు రవాణా అవుతోంది. పదెకరాల విస్తీర్ణంలో ఉండే ఈ మార్కెట్‌పైనే దాదాపు 2000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అపరాలకూ ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద మార్కెట్‌. మంచి ధర, వెంటనే చెల్లింపులు... స్థానిక వ్యాపారుల విధానం. ఆ విశ్వాసాన్ని దశాబ్దాలుగా నిలబెట్టుకుంటున్న విధానమే రైతులు తమ పంటను తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తీసుకొచ్చేలా చేస్తోంది.

గురువెల్లి రమణమూర్తి ఈనాడు, తాడేపల్లిగూడెం


వ్యర్థాలతో విద్యుత్‌!

సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డ్‌... రోజుకు 17వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తాయిక్కడికి. 23 ఎకరాల్లో ఉన్న ఈ యార్డ్‌ తెలంగాణలోనే అతిపెద్దది.  చుట్టుపక్కల రాష్ట్రాల నుంచీ ట్రక్కులు కూరగాయలను తీసుకొస్తుంటాయి. అదే సమయంలో కూరగాయల వ్యర్థాల్ని శుభ్రం చేయడం, తరలించడం కోసం ఏడాదికి ముప్ఫై లక్షలు ఖర్చయ్యేది. ఈ నేపథ్యంలో బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. అందుకు సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేసిన అనరోబిక్‌ గ్యాస్‌ లిఫ్ట్‌ రియాక్టర్‌ టెక్నాలజీతో పనిచేసే బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు అధికారులు. 2021లో కేంద్రప్రభుత్వం అందించిన రూ.3 కోట్లతో బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. దాని ద్వారా విద్యుత్‌ తయారు చేయడం మొదలుపెట్టారు. దీంతో రోజూ సేకరించే 15వేల టన్నుల చెత్త నుంచి రోజుకు 500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్‌ భవనం, నీటి సరఫరా, కోల్డ్‌స్టోరేజీ, 170 దుకాణాలు, 100 వీధి లైట్లకూ కావాల్సిన కరెంట్‌ను ఆ బయోగ్యాస్‌ ప్లాంటే అందిస్తోందిప్పుడు. అక్కడున్న కిచెన్‌కూ ఈ ప్లాంట్‌ ద్వారానే గ్యాస్‌ అందుతోంది. ద్రవరూప వ్యర్థాలనూ ఎరువుగా విక్రయించడంతో అదనపు ఆదాయమూ సమకూరుతోంది.

బి. కె.శ్రీకాంత్‌రాజ్‌ న్యూస్‌టుడే, కంటోన్మెంట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..