కొండపాక
కాకతీయ కళావైభం.. రుద్రేశ్వరాలయం
పంచాక్షరీ మంత్రం మారుమోగినచోట శతాబ్దాలపాటూ శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలింది. నరపతులూ గజపతులూ కొలిచిన శివలింగం శిథిలాల మధ్య చిక్కుకుపోయింది. ఆ పరిస్థితుల్లో... కొండపాక ప్రజలు కొండంత చారిత్రక స్పృహతో వ్యవహరించారు. రుద్రేశ్వరాలయాన్ని పునర్నిర్మించుకున్నారు.
కతీయ నిర్మాణశైలి... అలనాటి శిల్పకళా ప్రతిభకు తార్కాణం! అందమైన స్తంభాలూ, అంతెత్తు ద్వారాలూ, గర్జించే సింహాలూ, పురాణ గాథలూ - ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేం. రాతితో మలచిన రమణీయ కావ్యాలవి! మెదక్‌జిల్లా కొండపాకలోని రుద్రేశ్వరాలయమూ ఆ శిల్పకళారీతికి ప్రతీకే. సుమారు 820 సంవత్సరాల నాటి ఈ క్షేత్రం అనేకానేక కారణాలతో శిథిలావస్థకు చేరుకుంది. తాతముత్తాతలు కథలుకథలుగా చెప్పిన ఓ మహాలయ వైభవం మట్టికొట్టుకుపోతుంటే కొండపాక గ్రామస్థులు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ఆ వారసత్వ సంపదను కాపాడుకోవాలని తీర్మానించారు. వ్యయప్రయాసలకోర్చి పూర్వ రూపాన్ని తీసుకొచ్చారు.
తూర్పునకు అభిముఖంగా ఉన్న ఆలయంలోకి వెళ్లగానే...మధ్యలోని మంటపంలో శివలింగ స్వరూపంలో రుద్రేశ్వరుడు దర్శనమిస్తాడు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడిలోని ప్రాణవట్టం నమూనాలోనే ఇక్కడి ప్రాణవట్టం కూడా చతురస్రాకారంలో ఉంటుంది. జిల్లాలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదైన శివలింగంగా రుద్రేశ్వరుడికి పేరు! ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారంలో శివపంచాయతనంతోపాటూ కన్యకాపరమేశ్వరి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, మార్కండేయుడు, వీరభద్రుడు, త్రిమాతలు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కొలువై ఉన్నాయి.
సైనికులే నిర్మించారు!
ఆలయ చరిత్రనంతా ఇక్కడున్న శాసనాల్లో నిక్షిప్తం చేశారు. రుద్రదేవుడు పాలన చేస్తున్న సమయంలో...కాకతీయుల కొలువులో పనిచేసిన ముప్ఫైమంది సైనికులు ఈ ఆలయాన్ని కట్టించారు. ఆ ప్రకారంగా, రుద్రేశ్వరాలయ నిర్మాణం క్రీ.శ 1194లో జరిగింది. ప్రాంగణంలోనే త్రికూటేశ్వర (సూర్య-శివ-అంబిక) ఆలయమూ ఉండేదట. గణపతిదేవుడు పాలిస్తున్న కాలంలో... డెబ్భై గ్రామాలపై అధికారమున్న ఆదిత్య అమాత్యుడు త్రికూటేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ గుడి పూర్తిగా శిథిలమైపోయింది. సమష్ఠి కృషితో...రుద్రేశ్వరాలయానికి వైభవాన్ని తీసుకొచ్చిన గ్రామస్థులు, త్రికూటేశ్వర ఆలయ పునర్నిర్మాణానికీ నడుంబిగించారు.
కోరికలు తీర్చే దేవుడు!
ఆలయంచుట్టూ నలభై ఒక్క ప్రదక్షిణలు చేసి, శివుడి ఎదురుగా ఉండే నందికేశ్వరుడి చెవిలో ఏ కోరిక కోరుకున్నా... జరిగి తీరుతుందని ప్రతీతి. కాబట్టే స్థానికులు, రుద్రేశ్వరుడిని కోరికలు తీర్చే దేవుడిగా కొలుస్తారు. వందేళ్లక్రితం ఓసారి, ఈ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో రుద్రేశ్వరుడికి గ్రామస్థులు సహస్ర ఘటాభిషేకం (వెయ్యి బిందెలతో గర్భాలయంలో నీళ్లు నింపడం) చేశారట. వెంటనే కుండపోత వర్షం కురిసి ... కరవు కనిపించకుండా పోయిందట! ఈ ప్రాచీన ఆలయాన్ని పునర్నిర్మించాలని మొదట సంకల్పించింది కొండపాక గ్రామానికి చెందిన మరుమాముల సీతారామశర్మ. సంకల్పించడమే కాదు, కొంత మొత్తాన్ని విరాళంగా కూడా ఇచ్చారు. దురదృష్టవశాత్తూ పనులు ప్రారంభించకుండానే ఆయన కన్నుమూశారు. తర్వాత ఓసారి... శ్రీగురుమదనానంద సరస్వతీ పీఠాధిపతులు మాధవానంద స్వామి ఈ ప్రాంతానికి వచ్చినపుడు ఆలయ చరిత్ర గురించి విన్నారు. గ్రామస్థుల్ని సమావేశపరచి, పునః ప్రతిష్ఠాపనకు ప్రేరణ కలిగించారు. పల్లెజనమంతా కలిసి కోటి రూపాయలకుపైగా ఖర్చుచేసి, చారిత్రక ఆలయానికి జీవంపోశారు.
రుద్రేశ్వరాలయ పునర్నిర్మాణం 2006 ఆగస్టులో ప్రారంభమైంది. ఆలయ నిర్మాణ శైలికి ఏ భంగమూ వాటిల్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమిళనాడు నుంచి నిపుణులైన శిల్పులను పిలిపించారు. ఆ కార్యక్రమానికి ఓ రూపం రావడానికి ఆరేళ్లు పట్టింది. 2012 ఫిబ్రవరి 12న ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. కాకతీయుల శివలింగాన్నే పునఃప్రతిష్ఠించారు. లింగాన్ని కళావరోహణం చేశాక... మళ్లీ ప్రతిష్ఠించే వరకూ జలాధివాసంలోనే ఉంచారు. ఆ ఆరేళ్లూ అఖండదీపం వెలిగించారు. అప్పటి రాతి ధ్వజస్తంభం చెక్కుచెదరకుండా ఉండటంతో దాన్నే నిలబెట్టారు.
విశేష పూజలు..
రుద్రేశ్వరాలయంలో ప్రతి మాసశివరాత్రికీ మాస బ్రహ్మోత్సవాలూ మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం జరుగుతాయి. శివరాత్రికి ఘనంగా జాతర నిర్వహిస్తారు. ఆ రోజు గ్రామస్థులంతా ఎడ్ల బండ్లనూ వాహనాలనూ చక్కగా అలంకరించుకొని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసే కార్యక్రమం కన్నుల పండువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే రాజీవ్ రహదారిపైనే కొండపాక ఉంది. కొమురవెల్లి, సిద్దిపేట కోటిలింగాల గుడి... సమీపంలోని దర్శనీయ స్థలాలు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Go First flight: గో ఫస్ట్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే..?
-
General News
Cm jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. పీడీఎఫ్ రూపంలో పాఠ్యాంశాలు: సీఎం జగన్
-
India News
Covid: స్వాతంత్ర్య దినోత్సవం నాడు గుమిగూడొద్దు.. కేంద్రం సూచన
-
Politics News
Munugode: పిలవని పేరంటానికి వెళ్లను.. పీసీసీ తీరుపై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్
-
General News
Laparoscopy: అత్యవసరమైతే లాప్రోస్కోపీ ఎంతో మేలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- GST On Rentals: అద్దెపై 18 శాతం జీఎస్టీ.. అందరూ చెల్లించాల్సిందేనా?
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!