యక్ష ప్రశ్నలు ఏవి?

ధర్మాన్ని దీక్షతో తపస్సులా ఆచరించాలి. మనసా, వాచా, కర్మణా పాటించాలి. చేతనలోను, అచేతనలోను ధర్మబద్ధులై ఉండాలి. ధర్మరాజు బ్రహ్మవేత్త, పండితుడు, జ్ఞాని, సత్యవంతుడు, స్థితప్రజ్ఞుడు. విదురుడి ప్రశంస పొందినవాడు. ధర్మచింతనతో, ...

Updated : 14 Mar 2023 17:10 IST

ర్మాన్ని దీక్షతో తపస్సులా ఆచరించాలి. మనసా, వాచా, కర్మణా పాటించాలి. చేతనలోను, అచేతనలోను ధర్మబద్ధులై ఉండాలి. ధర్మరాజు బ్రహ్మవేత్త, పండితుడు, జ్ఞాని, సత్యవంతుడు, స్థితప్రజ్ఞుడు. విదురుడి ప్రశంస పొందినవాడు. ధర్మచింతనతో, ధర్మానురక్తితో భీష్ముడి అభిమానానికి పాత్రుడై రాజనీతిని, దానిలోని రహస్యాలను ఆయన నుంచి గ్రహించినవాడు. ధర్మజుడి ధర్మనిష్ఠకు దర్పణమే యక్షప్రశ్నా ఘట్టం. ఇది మహాభారతంలోని అరణ్య పర్వంలోనిది.

అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులు ద్వైతవనానికి చేరుకున్నారు. అప్పుడు తన అరణి (నిప్పు పుట్టించడానికి ఉపయోగపడే కొయ్య)ని ఒక మృగం అపహరించిందని, దాన్ని తనకు సంపాదించిపెట్టమని ఓ పండితుడు ధర్మరాజును ప్రార్థిస్తాడు. ఆ ప్రయత్నంలో వెళ్ళిన తన సోదరులు ఎంతసేపటికీ రాకపోవడంతో ధర్మరాజు బయలుదేరి ఒక సరస్సు దగ్గర విగతజీవులైన భీమ, అర్జున, నకుల, సహదేవులను చూస్తాడు. ఖిన్నుడవుతాడు. నోరు పిడచ కట్టుకుపోవటంతో నీరు తాగడానికి సరస్సులో దిగుతుండగా ఓ యక్షుడి హెచ్చరిక వినిపిస్తుంది. తన ప్రయత్నాన్ని విరమించుకుని అతడి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సంసిద్ధుడవుతాడు. అవే యక్షప్రశ్నలు. యక్షుడు అడిగిన ప్రశ్నలు తత్వజ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి చెందినవి.

ఆత్మవిద్యలో మనిషికి సహాయపడగలవి మనసు, ప్రాణం, ఇంద్రియ నిగ్రహం. వీటి సముపార్జనకు జ్ఞానసంపన్నులైన గురువులను ఆశ్రయించాలి. భూమి కంటే గొప్పది తల్లి. ఆకాశం కంటే ఎత్తయిన వ్యక్తి తండ్రి. వీరికి సేవ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనిషికి దానమే ఎంతో కీర్తినిస్తుంది. సత్యమే స్వర్గం. సత్యపథం ఆనందాన్నిస్తుంది. ఆ ఆనందస్థితే స్వర్గం. ధర్మరాజు చెప్పిన కొన్ని సమాధానాల సారాంశమిది.

భూతదయ కలిగి ఉండటం ఉత్తమ ధర్మం. మోక్ష సాధనమైన ప్రణవం నశించని ఫలం. అది శాశ్వతమైనది. ఆ ప్రణవంలో నిశ్చలతకు మనోనిగ్రహమే శరణ్యం. ఈ మనో నిగ్రహమే సంసారం వల్ల ఏర్పడే శోకాన్ని తట్టుకుని అధిగమించే మానసిక స్థైర్యాన్నిస్తుంది. ఆత్మతత్వాన్ని బోధపరుస్తుంది. ఈ మనోనిగ్రహాన్ని సత్పురుషుల సాంగత్యంతోనే పొందగలం. వీరితో స్నేహాన్ని వీడక, జీవితాంతం నిలుపుకోవాలి.

ధర్మంలో ప్రీతి, భక్తి కలవాడు సద్గతిని పొందుతాడన్న ధర్మరాజు సమాధానం విన్న యక్షుడు అతడి జ్ఞాన సంపదకు ఎంతో సంతోషించాడు. యుధిష్ఠిరుడి ధర్మనిష్ఠ ఆచరణలో ఏ పాటిదో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది.

‘రాజా, నీ సమాధానాలతో ఎంతో తృప్తి పొందాను. నీ తమ్ముళ్లలో ఒకరిని కోరుకో’ అన్నాడు. నకులుణ్ని బతికించమని కోరుకున్న ధర్మరాజును- ధనుర్విద్యా పారంగతుడు అర్జునుణ్ని గాని, అమేయ బల సంపన్నుడైన భీముణ్ని గాని ఎందుకు ఎంచుకోలేదని యక్షుడు ప్రశ్నించాడు. ధర్మరాజు తన తల్లి కుంతికి తానున్నాడు కనుక పినతల్లి కుమారుణ్ని జీవింపజేయమని అడిగానన్నాడు. యుధిష్ఠిరుడి ధర్మనిష్ఠకు పరమానందాన్ని పొందిన యక్షరూపంలో ఉన్న యముడు అందరికీ ప్రాణదానం చేశాడు.

యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు అతడి ధర్మతత్వ గూఢతను, గాఢతను, అందుకున్న లోతులను తెలియజేస్తాయి. ధర్మతత్వ శోధనలో అతడి జిజ్ఞాస ఆచరణలో ఎంతవరకు నిలబడగలదో పరీక్షించేందుకే తన ఎంపిక నిర్ణయాన్ని విశదపరచమని ధర్మరాజును అడిగాడు. నిజానికి అతడి ధర్మాచరణ నిష్ఠను లోకవిదితం చేయడమే యముడి సంకల్పం.

తనకు సత్యంకన్నా సమత గొప్పదని, తన ధర్మశీలతను నిశితంగా గమనించే లోకానికి తాను జవాబుదారుణ్నని ధర్మరాజు అంటాడు. ధర్మాచరణ విశిష్టత చూపడానికి యక్షప్రశ్నలు, వాటికి యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానాలు అద్భుత ప్రమాణంగా కలకాలం నిలుస్తాయి!

యక్షుడి రూపంలో యమధర్మరాజు అడిగిన ప్రశ్నలు ఇవే!

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? బ్రహ్మం
2. సూర్యుని చుట్టూ తిరిగేదెవరు? దేవతలు
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? ధర్మం
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? సత్యం
5.మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? వేదం
6. దేనివలన మహత్తును పొందును? తపస్సు
7. మానవునికి సహాయపడునది ఏది? ధైర్యం
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుటవలన
9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? అధ్యయనము వలన
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? మృత్యు భయమువలన
12. జీవన్మృతుడెవరు? దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు
13. భూమికంటె భారమైనది ఏది? జనని
14. ఆకాశంకంటే పొడవైనది ఏది? తండ్రి
15. గాలికంటె వేగమైనది ఏది? మనస్సు
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది
17. తృణం కంటే దట్టమైనది ఏది? చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యతో
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయుటవలన
21. జన్మించియున్నా ప్రాణంలేనిది? గుడ్డు
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? రాయి
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడంవలన
24. ఎల్లప్పుడూ వేగం గలదేది? నది
25. రైతుకు ఏది ముఖ్యం? వాన
26. బాటసారికి, రోగికి, గృహస్థునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
27. ధర్మానికి ఆధారమేది? దయ దాక్షిణ్యం
28. కీర్తికి ఆశ్రయమేది? దానం
29. దేవలోకానికి దారి ఏది? సత్యం
30. సుఖానికి ఆధారం ఏది? శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు? భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు
33.మానవునకు జీవనాధారమేది? మేఘం
34.మనిషికి దేనివల్ల సంతసించును? దానం
35.లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం
36.సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం
37.ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస
38.దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు
39. ఎవరితో సంధి శిథిలమవదు? సజ్జనులతో
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? యాగకర్మ
41. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు
42. అన్నోదకాలు వేటి నుంచి ఉద్భవిస్తాయి? భూమి, ఆకాశములందు
43.లోకాన్ని కప్పివున్నది ఏది? అజ్ఞానం
44. శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో
46. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం
47. క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం
48. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం
49. సర్వధనియనదగు వాడెవ్వడు? ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు
50. జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగడం
51. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం
52. అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండడం
53. సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట
54. దు:ఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం
55. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం
56. స్నానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
57. దానం అంటే ఏమిటి? సమస్తప్రాణుల్ని రక్షించడం
58. పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు
59. మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు
60. ఏది కాయం? సంసారానికి కారణమైంది
61. అహంకారం అంటే ఏమిటి?
అజ్ఞానం
62. డంభం అంటే ఏమిటి? తన గొప్పతానే చెప్పుకోవటం
63.ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో, తన భర్తలో
64. నరకం అనుభవించే వారెవరు? ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు
65.బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే
66.మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి
67.ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు
68. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు
70. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు

72. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు?
నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని