కార్తిక వ్రత నియమాలు ఏంటి?

కార్తిక వ్రతాచరణకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ మాసంలో తినకూడని పదార్థాల్ని గురించి వ్రత గ్రంథాలు, పురాణాలు

Updated : 14 Mar 2023 16:25 IST

కార్తిక వ్రతాచరణకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ మాసంలో తినకూడని పదార్థాల్ని గురించి వ్రత గ్రంథాలు, పురాణాలు వివరించి చెబుతున్నాయి. మాంసం, తేనె, రేగుపండ్లు, నల్ల ఆవాలు, ఉల్లిపాయల లాంటివి తినకూడదు. పరుల సొమ్ముతో సిద్ధం చేసిన అన్నాన్ని భుజించడం, పరులకు ద్రోహం చేయటం, దేశాటనం లాంటివి చేయకూడదు. దేవతలు, గురువులు, రాజులు, స్త్రీలు, గోవులు, వ్రతం చేసే వారిని దూషించకూడదు. అవిశెనూనె, నువ్వులనూనె, మరొకరు విక్రయించిన అన్నం లాంటివి తినకూడదు. ప్రాణి సంబంధిత మాంస పదార్థాలను, నిమ్మకాయలను, కొర్రలు వంటి ధాన్యాన్ని తీసుకోకూడదు. మేక, గేదె, ఆవుపాలు తప్ప మరే ఇతర ప్రాణుల క్షీరాలనూ స్వీకరించకూడదు. రసాలను, ఉప్పును విడిచిపెట్టాలి. చెలమలలోని నీళ్ళులాంటివి తాగకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేల మీదనే పడుకోవాలి. ఆకుల్లోనే భోజనం చేయాలి.

నాలుగో జామున భోజనం చేయటమే శ్రేష్ఠం. తైలంతో తలంటుకొని స్నానం చేయకూడదు. విష్ణు వ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయల్నీ తినకూడదు. వ్రత భ్రష్టులతోనూ, వేదాలను నిరాదరించే వారితోనూ మాట్లాడకూడదు. ఒకసారి వండి మళ్ళీ ఉడికించినది కానీ, వేయించిన అన్నాన్నికానీ తినకూడదు. తన శక్తి కొద్దీ విష్ణుప్రీతి కోసం ప్రతి వ్యక్తీ ఈ మాసంలో తీవ్రమైన వ్రతాల్ని ఆచరించాలి. కార్తిక వ్రతాన్ని నియమ నిబంధనలతో కచ్చితంగా పాటించే వారిని చూస్తే యమభటులు బెదిరి పారిపోతారు. ఇంద్రాది దేవతలూ కార్తిక వ్రతాన్ని చేసే వ్యక్తికి అమిత గౌరవాన్ని ఇస్తారు.

విష్ణుప్రీతి కోసం, వ్రత సాఫల్యం కోసం కార్తిక శుద్ధ చతుర్ధశినాడు వ్రతం చేసేవారు ఏదైనా ఒక తోటలో ఆ రోజంతా గడపాలి. అక్కడే ఒక తులసి మొక్కను నాటి, దాని చుట్టూ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండపం నాలుగు ద్వారాలకు పువ్వులతో, మామిడి ఆకు తోరణాలతో చక్కగా అలంకరించాలి. నాలుగు ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ, విజయ అనే నలుగురు ద్వార పాలికలను మట్టితో రూపొందించి నిలపాలి. ఈ ద్వారపాలికలకూ ప్రత్యేక పూజలర్పించాలి. తులసి మొక్క ముందు చక్కగా రంగులతో ముగ్గులు వేసి సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి. దాని మీద పంచరత్న సమన్వితం, నారికేళ సమ్మిళితం అయిన ఓ కలశాన్ని పెట్టి శంఖ చక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుడిని ఆవాహన చేసి పూజించాలి. ఇంద్రాది అష్ట దిక్పాలకులను ఆయా మండలాల్లో అర్చించాలి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనం ఇచ్చి, చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు. కాబట్టి భక్తులంతా నిర్మలచిత్తులై ఉపవాస దీక్షతో ఆ రోజున యథావిధిగా శ్రీమహావిష్ణువును పూజించాలి. ఆయనకు షోడశోపచారాలతో పూజలు చేసి పంచభక్ష్య పరమాన్నాలను నివేదించాలి.

గీత, వాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి జాగరణ చేసి మరునాడు ఉదయం స్నాన విధులయ్యాక నిత్యక్రియలను ఆచరించాలి. ఆ తరువాత హోమ, సమారాధనలు చేసి యథావిధిగా పండితులకు దక్షిణ సమర్పించాలి. ఇలా వైకుంఠ చతుర్దశి నాడు పూజలర్పించటం విష్ణువుకు ప్రీతికరం. కార్తికమాసంలో తినకూడని పదార్థాలను గురించి కార్తిక పురాణం వివరిస్తోంది. ఈ ఆహార నియమాలు ఈ మాసంలో ఎదురయ్యే వాతావరణ పరమైన సమస్యలకు శరీరం అనారోగ్యం పాలుకాకుండా ఉంటుందని పురాణ పరిశీలకులు, వైద్యులు కూడా పేర్కొంటున్నారు. అలాగే కార్తికంలో దేశాటనం చేయకూడదు అని అనటం వెనుక వ్రత భంగం కాకూడదన్న సూచన కనిపిస్తుంది. వ్రత విధానాన్ని చెప్పింది చెప్పినట్లుగా ఆచరిస్తే ఆరోగ్యం సమకూరుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని