కొండచిలువగా మారిపో!

గర్గమహర్షి శిష్యులకు పాఠం చెబుతున్నాడు- ‘బకాసురుడి పెద్దకొడుకు అఘాసురుడు. కంసుడి ప్రేరణతో కొండచిలువ రూపం ధరించి యమునాతీరంలో ఆడుకుంటున్న గోపబాలకులను, ఆలమందలను కృష్ణుడితో సహా మింగేశాడు.

Updated : 14 Mar 2023 13:23 IST

ర్గమహర్షి శిష్యులకు పాఠం చెబుతున్నాడు- ‘బకాసురుడి పెద్దకొడుకు అఘాసురుడు. కంసుడి ప్రేరణతో కొండచిలువ రూపం ధరించి యమునాతీరంలో ఆడుకుంటున్న గోపబాలకులను, ఆలమందలను కృష్ణుడితో సహా మింగేశాడు. లోపల ఊపిరి ఆడక కొందరు చనిపోయారు, మిగిలినవారు ప్రాణాపాయ స్థితిని చేరుకున్నారు. కృష్ణుడు అఘాసురుడి నవరంధ్రాలను మూసి, పొట్ట ఉబ్బి పగిలిపోయేట్టు చేశాడు. దాంతో మిగిలినవారు నెమ్మదిగా కోలుకున్నారు. చనిపోయినవారిని కృష్ణుడు తన యోగశక్తితో బతికించాడు. అప్పుడు కృష్ణుడు ‘అతడు మింగడానికి వస్తుంటే పారిపోవచ్చు కదా! ఎందుకలా చేయలేదు?’ అన్నాడు. దానికి ‘నువ్వున్నావనే ధైర్యంతో’ అంటూ బదులిచ్చారు. ‘ఒకవేళ నేనిక్కడ లేనప్పుడు ఇలా జరిగితే?’ అన్నాడు. ‘అప్పుడూ నువ్వున్నావనే మా ధైర్యం’ అన్నారు. ‘మీరంతా నామీద అతినమ్మకంతో ఉన్నారు. మీ క్షేమం, రక్షణ కోసం నేను నిద్రాహారాలు మాని మరీ పనిచేయాల్సి వస్తోంది’ అంటూ ప్రేమగా మందలించాడు’ అంటూ ఆగి వారివంక చూశాడు. ఒక శిష్యుడు లేచి ‘అసలు అఘాసురుడు కొండచిలువలా ఎందుకు మారాడు?’ అనడిగాడు. ‘గత జన్మలో శంఖుడనే రాక్షసుడికి పుట్టిన అఘాసురుడు మహా రూపవంతుడు. ఆ గర్వంతో ఎనిమిది వంకరలతో ఉన్న అష్టావక్రుణ్ణి చూసి గేలి చేశాడు. దాంతో ఆయన ఆగ్రహించి- కొండచిలువ రూపం పొందమని శపించాడు. తప్పు తెలుసుకుని ప్రార్థించగా ‘ఒకరిని ఎగతాళి చేయడం, నిందించడం వల్ల మన పుణ్యంలో సగం వారికి వెళ్తుంది. అలాగే వారి పాపంలో సగం మనకు వస్తుంది. పరనింద అంత ఘోరమైందని తెలుసు కున్నావు కదా! ద్వాపరంలో కృష్ణుడి వల్ల శాపవిమోచనం కలిగి ముక్తి పొందుతావు- అన్నాడు అష్టావక్రుడు’ అంటూ వివరించాడు మహర్షి.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని