కాకి చెప్పిన నిజం

భక్త కబీర్‌ ఎప్పట్లాగే భుజాన జోలెతో రామగీతాలు పాడుకుంటూ కాశీ వీధుల్లో సాగిపోతున్నాడు. ఇల్లిల్లూ తిరుగుతూ ఓ పెద్ద భవంతి ముందు నిలబడ్డాడు. అది సౌందర్యవతి అయిన ప్రసిద్ధ కళాకారిణి భవనం.

Updated : 25 May 2023 00:42 IST

భక్త కబీర్‌ ఎప్పట్లాగే భుజాన జోలెతో రామగీతాలు పాడుకుంటూ కాశీ వీధుల్లో సాగిపోతున్నాడు. ఇల్లిల్లూ తిరుగుతూ ఓ పెద్ద భవంతి ముందు నిలబడ్డాడు. అది సౌందర్యవతి అయిన ప్రసిద్ధ కళాకారిణి భవనం. కబీర్‌ ‘భిక్షాం దేహీ!’ అనగానే కాలిమువ్వల సవ్వడితో, కాటుక దిద్దిన కలువరేకుల్లాంటి కనుదోయితో ఆ అభినేత్రి బయటకు వచ్చింది. అందాలు ఒలకబోస్తూ పరమభక్తుడి జోలెలో భిక్ష వేసింది. కట్టిపడేసే ఆమె కళ్లవంక పసిబాలుడిలా చిరునవ్వుతో వీక్షించి ఆశీర్వదిస్తూ ముందుకు సాగిపోయాడు కబీర్‌.

కొన్నాళ్ల తర్వాత కబీర్‌ ఆ వీధికి మరో సారి భిక్షాటనకు వచ్చి, ఆ సౌందర్యరాశి ఇంటి ముందు ఆగాడు. మునుపు రాజ భోగాలతో వెలిగిన ఆ భవనం నేడు బూజు పట్టి బోసిపోయి ఉంది. ఎంత పిలిచినా గడియ వేసి ఉన్న ఆ భవనం నుంచి ఎవరూ బయటకు రాలేదు. అలా ముందుకెళ్లి శ్మశానం దగ్గర చెట్టు కింద విశ్రమించాడు కబీర్‌. కొద్ది దూరంలో కపాలం ఉంది. అది దీర్ఘవ్యాధితో బాధపడుతూ కన్నుమూసిన నటీమణి దేహమని కాటికాపరి చెప్పాడు. ఇంతలో ఓ కాకి వచ్చి కపాలంపై వాలింది. కబీర్‌కి గతంలో చూసిన ఆమె నయనాలు స్ఫురించాయి. ‘అయ్యో! నాడు కాటుకతో కళకళలాడుతూ సౌందర్యం చిందించిన ఆ కళ్లు ఇప్పుడు ఏమయ్యాయి? కపాలంలో గుంటలుగా మారిన కనుదోయిపై కాకి వాలి కావు కావుమంటోంది. అందం, ఆకర్షణ, వైభోగం ఏవీ శాశ్వతం కావు... కావు... అని జీవనసారాన్ని గుర్తుచేస్తున్నాయి..

తన్‌ కీ ధన్‌ కీ కౌన్‌ బడా యీ!
దేఖత్‌ నైనో మే మాటీ మిలాయీ
అపనే ఖాతర్‌ మహల్‌ బనాయా!  
ఆపహి జాకర్‌ బంగల్‌ సోయా

దేహానికీ, ధనానికీ ఏముంది గొప్పతనం? చూసే కళ్లు మట్టిలో కలిసిపోతాయి. తన కోసం భవనం నిర్మించుకుంటాడు. కానీ తానే వెళ్లి వల్లకాటిలో పవళిస్తాడు’ అంటూ ఆశువుగా వేదాంత గీతం పాడుకున్నాడు భక్త కబీర్‌.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని