దైవకృప ముఖ్యం

చేసిన పని విజయవంతమైనప్పుడు అది తన కృషితోనే సాధ్యమైంది అనడం పరిపాటి. కానీ దైవకృప లేనిదే ఏదీ పూర్తికాదని, మనం నిమిత్తమాత్రులమే అని మహనీయులు ఉద్ఘాటించారు.

Published : 22 Jun 2023 00:25 IST

చేసిన పని విజయవంతమైనప్పుడు అది తన కృషితోనే సాధ్యమైంది అనడం పరిపాటి. కానీ దైవకృప లేనిదే ఏదీ పూర్తికాదని, మనం నిమిత్తమాత్రులమే అని మహనీయులు ఉద్ఘాటించారు.
అర్జునుడు మత్స్య యంత్ర పరీక్షలో నెగ్గి ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. ఆ సందర్భంలో స్వయంవర వేడుకకు విచ్చేసిన రాజులు, పెద్దలు అందరూ అర్జునుణ్ణి అభినందించారు. కృష్ణుడు మాత్రం నోరు మెదపక పోవడంతో ‘బావా, నువ్వొక్కడివే నన్ను ప్రశంసించలేదు. ఎందుకో తెలుసుకోవచ్చా?’ అనడిగాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ‘ఇందులో నీ గొప్పతనం ఏముంది అర్జునా?’ అన్నాడు. ‘అదేంటి? విలువిద్యలో అన్ని మెలకువలూ ఉపయోగించి ఏకాగ్రతతో మత్స్యయంత్రంలో ఉన్న చేపకన్నును, కింద జలాశయంలో దాని నీడను చూసి బాణం ప్రయోగించడం చిన్న విషయమా? తక్కిన రాజులు చేయలేని పనిని నేను చేశాను కదా’ అన్నాడు అర్జునుడు.
కృష్ణుడు నవ్వి ‘అర్జునా! నీకంటే ముందు వాళ్లకి జలాశయంలో నీళ్లు గాలికి అలలుగా కదలడం వల్ల చేప నీడను సరిగా చూడలేక పోయుంటారు. అలా గురి తప్పి ఉంటుంది. నువ్వు బాణం ఎక్కు పెట్టినప్పుడు వాయుదేవుడు సహకరించినందున అలలు లేక చేప కన్నును స్పష్టంగా చూసి గురిపెట్టగలిగావు. అంతే’ అన్నాడు. కనుక నేను అనే అహం లేకుండా ప్రయత్నించాలి. దానికి దైవకృప తోడైతేనే పనిలో విజయం సాధ్యమౌతుంది.
గోవిందం ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని