నిస్సంకోచ ప్రసంగం

శౌరిపుత్రుడు, మౌద్గల్యుడు గౌతమ బుద్ధుడి అగ్ర శిష్యులు. శౌరిపుత్రుడి దగ్గర శిష్యరికం చేశాడు మౌన తిస్సడు.

Published : 06 Jul 2023 00:37 IST

శౌరిపుత్రుడు, మౌద్గల్యుడు గౌతమ బుద్ధుడి అగ్ర శిష్యులు. శౌరిపుత్రుడి దగ్గర శిష్యరికం చేశాడు మౌన తిస్సడు. పారమార్థిక చింతనే తప్ప ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిలేని తిస్సడు లోకానికి మేలుచేస్తాడని గ్రహించిన శౌరి మోక్షవిద్యను బోధించాడు. జనావాసాలకు దూరంగా గడుపుతూ ఎవరైనా ఆశీర్వాదం కోసం వస్తే ‘సుఖీభవ.. దుఃఖః నిర్ముక్తోభవ’ అనే రెండు మాటలు తప్పించి మరేం మాట్లాడేవాడు కాదు తిస్సడు. ఒకరోజు శౌరి మౌద్గల్యుడితో కలిసి తిస్సణ్ణి చూద్దామని వెళ్లాడు. గ్రామ ప్రజలకు ఈ వార్త తెలిసి వారి ప్రవచనాలను వినాలని వచ్చారు. ఇద్దరిలో ఎవరు ముందు ప్రసంగిస్తారా అని చూస్తుండగా ఎప్పుడూ మాట్లాడని తిస్సడు శ్రేయోమార్గం గురించి అనర్గళంగా ప్రసంగించాడు. మొదట ఆశ్చర్యపోయి ఆపైన ఆనందించారంతా. ఈ వార్త గౌతమబుద్ధునికి చేరినపుడు ‘లాభం-నష్టం, కీర్తి-అపకీర్తి, సుఖం-దుఃఖం అనే ద్వంద్వాల నుంచి బయటపడినవాళ్లే ఇంత చక్కగా మాట్లాడగలరు. ఇహలోక ప్రయోజనాల కన్నా మోక్షం వైపు నడిపే మార్గం ఉత్తమమైంది. ఏకాంతవాసం, మౌనవ్రతం, నిరాసక్తత అనే మూడింటిని తిస్సడు సాధించాడు. ఎలాంటి ప్రలోభాలూ, భయాలూ లేనందున నిస్సంకోచంగా ప్రసంగించాడు. ప్రేరణ కలిగించాడు. ఎప్పుడో ఒకసారి నోరువిప్పే వారి మాటకు ఆకర్షణ, శక్తి ఉంటాయని మరోసారి రుజువైంది’ అంటూ విశ్లేషించాడు.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని