సాతాను వలలో పడకండి!

ఈ ప్రపంచం త్వరలో అంతమైపోతుందని బైబిల్‌ చెబుతోంది. ఆ యుగాంతం లేదా డూమ్స్‌ డే సమీపించినప్పుడు అక్రమాలు వ్యాపించడం, పరస్పర ప్రేమాభిమానాలు మృగ్యమవడం యుగాంతానికి సూచనలని మత్తయి 24వ అధ్యాయంలో బైబిల్‌ వెల్లడించింది.

Published : 13 Jul 2023 01:57 IST

ఈ ప్రపంచం త్వరలో అంతమైపోతుందని బైబిల్‌ చెబుతోంది. ఆ యుగాంతం లేదా డూమ్స్‌ డే సమీపించినప్పుడు అక్రమాలు వ్యాపించడం, పరస్పర ప్రేమాభిమానాలు మృగ్యమవడం యుగాంతానికి సూచనలని మత్తయి 24వ అధ్యాయంలో బైబిల్‌ వెల్లడించింది. అయితే ‘ఆ ఘడియ మర్మమైంది, యెహోవాకు తప్ప మనుషులకు గానీ ఆఖరికి దేవదూతలకు కూడా తెలియదు’ అని ప్రభువు చెప్పాడు. ప్రళయం రావడం తథ్యం కనుక నైతికంగా పతనం కాకుండా, పవిత్రంగా ఉంటూ సాతాను విసిరే రంగుల వలలో చిక్కుకోకూడదని బైబిల్‌ చెబుతోంది. ఈరోజో, రేపో యుగాంతం రాబోతోందనే గ్రహింపుతో పరలోకం చేరేందుకు సిద్ధంగా ఉండాలని ఏసు సూచించాడు. మానవాళికి దేవుడు రాసిన ప్రేమలేఖగా విరాజిల్లుతున్న బైబిల్‌ను అనుసరించడం మన కర్తవ్యం. మరణం ఒక్కటే జీవితానికి అంతం కాదు. ఈ దేహం మట్టిలో లయమైనప్పుడు అందులో దేవుడు వెలిగించిన దీపం లాంటి ఆత్మ తిరిగి ఆయన వద్దకే వెళ్తుంది. ధర్మవిరోధి అయిన సాతాను వెలుగుదూత వేషంలో వచ్చి పరలోక రాజ్యంలో మనిషికి తావు లేకుండా అగ్నిగుండాన్ని పోలిన నరకంలోకి తోసేందుకు కుతంత్రం చేస్తుంటాడు. మనమే అప్రమత్తంగా ఉండి, నిత్య సంతోషంగా ఉండే మరణానంతర జీవితం దైవసన్నిధిలో గడపాలని ఏసు ఉవాచ. ద్వితీయాగమనంలో ప్రభువు పాపరహితుల్ని తనతోపాటు పైకి తీసుకెళ్తాడు. ఆ శుభఘడియ కోసం ఎదురుచూద్దామా?!

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని