చోటు కాదు మనసు ముఖ్యం

గౌతమబుద్ధుడికి మేఘియ అనే శిష్యుడు ఉండేవాడు. అతడో రోజు సమీప గ్రామంలో భిక్ష స్వీకరించి ఆశ్రమానికి తిరిగొస్తున్నాడు. మధ్యలో గుబురు చెట్లతో ఆకర్షణీయంగా ఉన్న మామిడి తోటను చూశాడు.

Updated : 03 Aug 2023 04:47 IST

గౌతమబుద్ధుడికి మేఘియ అనే శిష్యుడు ఉండేవాడు. అతడో రోజు సమీప గ్రామంలో భిక్ష స్వీకరించి ఆశ్రమానికి తిరిగొస్తున్నాడు. మధ్యలో గుబురు చెట్లతో ఆకర్షణీయంగా ఉన్న మామిడి తోటను చూశాడు. ఆ చోటు ధ్యానానికి అనుకూలం అనిపించింది. గురువు అనుమతితో ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని ధ్యాన సాధన కొనసాగించాలి అనుకున్నాడు. అది చెబితే తథాగతుడు కొన్నాళ్లు ఆగ మన్నాడు. శిష్యుడి ధ్యాన సామర్థ్యం, ఆధ్యాత్మిక స్థాయి తెలిసే అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేశాడు బుద్ధుడు. మేఘియ పట్టు వదలకపోయేసరికి సరేనని గౌతముడు వెళ్లమన్నాడు.

ఆ బౌద్ధభిక్షువు అమితోత్సాహంతో మామిడితోటకు వెళ్లాడు. సాధన చేసేందుకు పట్టుదలగా ప్రయత్నించాడు. రోజంతా కూర్చున్నా, మేఘియకు ఏకాగ్రత కలగ లేదు. ఆలోచనలు పరిభ్రమిస్తూనే ఉన్నాయి. కాస్తయినా నిలకడ సాధించలేక ఆరామానికి తిరిగొచ్చాడు. బుద్ధుడి ఎదుట తన నిస్సహాయతను తెలియజేశాడు. గౌతముడు మందహాసంతో ‘మేఘియా! స్థలం మారినంతలో మనసు మారదు. మొదట మనసును నియంత్రించుకోవడం నేర్చుకో! అప్పుడిక నువ్వెక్కడున్నా మనసు నిలకడగా ఉంటుంది. రణగొణ ధ్వనుల నడుమ కూడా ధ్యానంలో నిమగ్నమవుతావు’ అంటూ ప్రబోధించాడు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని