అశ్వమేధం.. నిధుల సేకరణ

కురుక్షేత్ర యుద్ధానంతరం పరిపాలన చేపట్టిన ధర్మరాజులో బంధుమిత్రులను కోల్పోయామన్న అశాంతి ఉండేది. అది గమనించిన వ్యాసమహర్షి అశ్వమేధ యాగం చెయ్యమని సూచించడమే కాకుండా యాగ సంస్కారాలను వివరించాడు.

Updated : 24 Aug 2023 05:43 IST

కురుక్షేత్ర యుద్ధానంతరం పరిపాలన చేపట్టిన ధర్మరాజులో బంధుమిత్రులను కోల్పోయామన్న అశాంతి ఉండేది. అది గమనించిన వ్యాసమహర్షి అశ్వమేధ యాగం చెయ్యమని సూచించడమే కాకుండా యాగ సంస్కారాలను వివరించాడు. అందుకు అవసరమయ్యే నిధుల విషయం ప్రస్తావనకు రాగా.. ‘ఉన్న ధనమంతా ఖర్చయింది, భూమండలమంతా వెదికినా చిల్లిగవ్వ దొరకదు’ అన్నాడు భీముడు.

షోడశ మహారాజుల్లో ఒకడైన మరుత్తుడు హిమవత్పర్వతం మీద యజ్ఞం చేసి బ్రాహ్మణులకు దానమివ్వగా మిగిలిందక్కడే వదిలేసినట్లు గతంలో వ్యాసమహర్షి చెప్పిన సంగతి వారికి గుర్తొచ్చింది. అంతే! ధర్మరాజులో ఉత్సాహం ప్రవేశించింది. యాగం చేసేందుకు ధృతరాష్ట్రుడు, కుంతీదేవిల అనుమతి అడిగాడు. వారి సమ్మతితో అనేకమంది మిత్ర రాజులు, వీరులు తోడు రాగా హిమవత్పర్వతం చేరి వ్యాసుడి కోసం ప్రార్థించాడు. వ్యాసుడు ప్రత్యక్షమై వారికో ప్రదేశం చూపించి- మహాశివుడు, కుబేరుడు, మణిభద్రుడు, యక్షులు, ప్రమథగణాలు, సమస్త భూతాలను ఆవాహన చేసి పూజించమన్నాడు. తర్వాత, వ్యాసుడి ఆదేశం మేరకు ఒకచోట మహాబలాఢ్యులైన సేవకులు తవ్వడం ప్రారంభించారు. కొంతసేపటికి నిధులు బయటపడ్డాయి. ఆ బంగారు కాంతులతో నలుదిక్కులు ప్రకాశించాయి. పాండవ సోదరులు సంతృప్తులయ్యారు. ధర్మరాజు ఆ నిధులను పూజించి, వ్యాస మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలిపాడు. వేలాది బండ్లు, ఒంటెలు, గుర్రాలు, ఏనుగుల మీద బంగారు మూటలు వేశారు. బలాఢ్యులెందరో బంగారు మంచాలు, రోళ్లు లాంటి వస్తువుల్ని మోస్తుండగా హస్తినకు బయల్దేరారు. వీరి సౌకర్యం కోసం రెండు కోసులకొక మజిలీ ఏర్పాటుచేసి ఆహారం, విశ్రాంతి దొరికేట్లు చేశాడు ధర్మరాజు. అలా తరలిపోతున్న బంగారు నిధిని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. 

నారంశెట్టి ఉమామహేశ్వర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని