ఐదునిమిషాల గురుదక్షిణ

నడిచే దేవుడిగా భావించే కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ఒకసారి గోదావరి తీరంలోని గోష్పాద క్షేత్రం కొవ్వూరు వచ్చారు.

Updated : 24 Aug 2023 05:43 IST

డిచే దేవుడిగా భావించే కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ఒకసారి గోదావరి తీరంలోని గోష్పాద క్షేత్రం కొవ్వూరు వచ్చారు. ఆయన ప్రసంగం మనసుకు హత్తుకునేలా సాగడంతో భక్తులు ఉప్పొంగిపోయారు. తర్వాత అందరూ గురుదక్షిణ సమర్పించేందుకు అనుమతించమని వేడుకున్నారు. అప్పుడాయన ‘మీరలా అనుకోవడం ధర్మమే. అయితే ఆ దక్షిణేదో నేను అడిగింది ఇస్తే సంతోషం’ అన్నారు. అంతా సరేనన్నారు. ధనికులు స్వామి ఎంత ధనం అడిగినా.. అది తమ అదృష్టంగా భావించి తక్షణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతలో స్వామివారు ‘మీరంతా మీ జీవితాల్లోంచి ప్రతిదినం ఓ ఐదు నిమిషాలు నాకు గురుదక్షిణగా సమర్పించండి’ అన్నారు. సభికులు ఆశ్చర్యంగా చూస్తోంటే.. ‘ఆ ఐదునిమిషాలు ఉదయం నిద్ర లేవగానే కావచ్చు. రాత్రి పడుకునే ముందు కావచ్చు. వేరే ఎప్పుడైనా కావచ్చు. మొత్తానికి ఆ సమయంలో మీకు నచ్చిన ఏ దేవుడి నామాన్నయినా జపించడమే మీరు నాకిచ్చే గురుదక్షిణ. ఎవరైతే భగవవంతుణ్ణి ఆర్తితో స్మరిస్తారో వారు తరిస్తారు. నాకు కావాల్సింది అదే’ అన్నారు. ‘స్వామి ఎంతటి మహోన్నత గురువు!’- అనుకుంటూ ఆయనడిగిన గురుదక్షిణ ఆనందంగా సమర్పిస్తామని మాటిచ్చారు.

గొడవర్తి శ్రీనివాసు, ఆలమూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని