నమ్మకమే నడిపిస్తుంది

రావణాసురుడు హతుడై విభీషణుడు లంకను పాలిస్తున్న రోజులవి. ఓ వ్యక్తి తీర్థయాత్రలు చేయదలచి ఆయన దగ్గరకు వచ్చాడు. సముద్రాన్ని దాటి ఆవల పుణ్యక్షేత్రాల్ని దర్శించా లన్న కాంక్షతో సాయమడిగాడు.

Published : 26 Oct 2023 00:04 IST

రావణాసురుడు హతుడై విభీషణుడు లంకను పాలిస్తున్న రోజులవి. ఓ వ్యక్తి తీర్థయాత్రలు చేయదలచి ఆయన దగ్గరకు వచ్చాడు. సముద్రాన్ని దాటి ఆవల పుణ్యక్షేత్రాల్ని దర్శించా లన్న కాంక్షతో సాయమడిగాడు. శ్రీరాముడి పరమభక్తుడైన విభీషణుడు- రాజమందిరంలోకి వెళ్లి.. గుప్పెట్లో ఓ వస్తువు తెచ్చి యాత్రికుడి అంగవస్త్రానికి కట్టి ముడివేశాడు. ఆ ముడిలో ఏముందో అతడికి తెలియదు. ‘భయపడకు! నువ్వు నీటిపై నడిచి సముద్రాన్ని క్షేమంగా దాటగలవు. కానీ ఒకటే నియమం! ఎట్టి పరిస్థితిలోనూ నేను కట్టిన ముడి విప్పి చూడకు. చూస్తే నీ ప్రయాణానికి ఆటంకం కలుగుతుంది’ అన్నాడు. విభీషణుడికి కృతజ్ఞతలు చెప్పి, బయల్దేరాడు. నేల మీద నడచినంత సులభంగా సముద్రంపై నడుస్తున్నాడు. కడలి మధ్యలోకి వెళ్లాక.. ‘ఇంత సునాయాసంగా నీళ్ల మీద ఎలా నడవగలుగుతున్నాను? అసలు మహారాజు అంగవస్త్రానికి కట్టిన ముడిలో ఏముందో చూద్దాం!’ అనుకున్నాడు. ముడి విప్పితే.. అందులో ‘శ్రీరామ’ నామం రాసి ఉన్న ఆకు ఉంది. ‘ఓహో ఇంతేనా!’ అనుకున్నాడో లేదో.. వెంటనే నీళ్లలో మునిగిపోయాడు. రామకృష్ణ పరమహంస ఈ కథను విద్యాదాత, సంఘసేవకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌కి చెప్పి.. ‘భగవంతుడి నామంపై విశ్వాసం ప్రధానం. అదే కష్టాల సాగరం నుంచి గట్టెక్కించి ముందుకు నడిపిస్తుంది. విశ్వాసం కోల్పోయిన నాడు సర్వం కోల్పోతాం’ అన్నారు. 

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని