మోక్షం ఎలా సిద్ధిస్తుందంటే..

పరీక్షిత్తు మహారాజులా తాను కూడా ఏడు రోజులపాటు భాగవతం విని మోక్షం పొందాలనుకున్నాడో రాజు. పండితుణ్ణి పిలిచి భాగవతం చదివించుకుని విన్నాడు. వారం గడిచినా.. ఇంకా తనకు మోక్షం ఎందుకు సిద్ధించలేదని అడిగాడు. ఆ మాటలు విన్న పండితుడు- ‘రాజా! నా పని భాగవతాన్ని వినిపించడం వరకే.

Published : 23 Nov 2023 00:06 IST

పరమహంస కథలు

రీక్షిత్తు మహారాజులా తాను కూడా ఏడు రోజులపాటు భాగవతం విని మోక్షం పొందాలనుకున్నాడో రాజు. పండితుణ్ణి పిలిచి భాగవతం చదివించుకుని విన్నాడు. వారం గడిచినా.. ఇంకా తనకు మోక్షం ఎందుకు సిద్ధించలేదని అడిగాడు. ఆ మాటలు విన్న పండితుడు- ‘రాజా! నా పని భాగవతాన్ని వినిపించడం వరకే. మోక్షం ఇప్పిస్తానని నేను చెప్పలేదు కదా! అయితే మీ ప్రశ్నకు మా గురువు సరైన సమాధానం ఇవ్వగలరు. ఆయన్ని పిలిపించండి’ అన్నాడు. గురువు వచ్చాడు. పండితుణ్ణి అడిగిన ప్రశ్నే అతణ్ణీ అడిగాడు రాజు. ‘ఒక్క పావుగంట పాటు నన్ను ఈ రాజ్యానికి రాజును చేస్తే.. మీ సందేహం తీరుస్తాను మహారాజా’ అన్నాడతను. అలాగేనన్నాడు రాజు. గురువు సింహాసనం అధిరోహించగానే.. పండితుణ్ణి, రాజునూ ఇద్దరినీ బంధించమన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత గురువు పండితుడి వంక చూసి ‘రాజును బంధ విముక్తుణ్ణి చెయ్యి’ అన్నాడు. దానికి పండితుడు ‘నా కట్లు విప్పకుండా నేనెలా విడిపించగలను?’ అన్నాడు. ‘రాజా! ఇప్పుడు మీ సందేహం తీరిందా? బందీ అయిన వ్యక్తి మరొకరి బంధనాలను తొలగించలేనట్లే.. ముక్తుడు కాని వ్యక్తి మరొకరికి ముక్తి కలిగించలేడు. శుకమహర్షి వంటి యోగి లభించి, పరీక్షిత్తు అంతటి శ్రద్ధాసక్తులు ఉన్నప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. అంటే బోధించే గురువు మహాజ్ఞాని అయ్యుండాలి. అలాగే అది వినే వ్యక్తికి అర్థం చేసుకునే గొప్ప విజ్ఞత ఉండాలి’ అంటూ వివరించాడు గురువు. మోక్షసిద్ధి గురించి ఒక శిష్యుడు అడిగిన ప్రశ్నకు రామకృష్ణ పరమహంస చెప్పిన కథ ఇది.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని