అనంతాత్మలో విలీనం!

శరీరం అశాశ్వతమైంది. అవసానం ఆసన్నమైనపుడు మృత్యువు దీన్ని కబళిస్తుంది. అశరీరం (శరీరం లేనిది), అనశ్వరం (నాశనం లేనిది) అయిన ఆత్మకు ఈ శరీరం ఒక ఆధారం మాత్రమే.

Updated : 30 Nov 2023 00:59 IST

రీరం అశాశ్వతమైంది. అవసానం ఆసన్నమైనపుడు మృత్యువు దీన్ని కబళిస్తుంది. అశరీరం (శరీరం లేనిది), అనశ్వరం (నాశనం లేనిది) అయిన ఆత్మకు ఈ శరీరం ఒక ఆధారం మాత్రమే. ఆత్మ ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఎంత కాలం ఉంటుందో.. అంత కాలం శరీరానికి సుఖం, దుఃఖం లాంటి అనుభవాలు తప్పవు. రూపం, ఒక నిర్దిష్ట ఆకారం లేని ఆకాశంలో.. మేఘాలు, మెరుపుతీగలు కొద్దిసేపు ఏవో ఆకృతుల్లో సంచరిస్తాయి. వాటి పని కాగానే అంతరిస్తాయి. అలాగే శరీరం ఆత్మకు ఆధారంగా ఉండి.. తన అవసరం తీరిపోగానే నశిస్తుంది. ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకూ దేహంలో భాగంగా ఉన్న కన్ను, చెవి, మనసు మొదలైనవి ఆత్మను చూడటానికి, వినడానికి, ఆలోచించడానికి ఉపయోగపడతాయి. దేహం అవసరం తీరాక శరీరంలోని ఆత్మ.. అనంతాత్మలో విలీనమవుతుంది. అదే అసలు సత్యం. నీవు అనేది అనంతాత్మ స్వరూపమే. ‘తత్త్వమసి’ పదాన్ని విడదీస్తే.. తత్‌ త్వం అసి- అవుతుంది. (తత్‌=అది, త్వమ్‌= నువ్వు, అసి=ఉన్నావు) అంటే.. ‘అదే నీవై ఉన్నావు’ అంటూ బ్రహ్మదేవుడు- ఆత్మ స్వరూపం గురించి ఇంద్రుడికి ‘ఛాందగ్యోపనిషత్‌’లో చెప్పాడు.

శివలెంక ప్రసాదరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని