సమభావనే పారమార్థికత

ఎంతో సాధన చేసిన ఓ సాధువు భిక్షాటనకు బయల్దేరాడు. మార్గమధ్యంలో ఓ జమీందారు తన వద్ద పనిచేసే వ్యక్తిని కొడుతున్నాడు. దయార్ద్రహృదయుడైన ఆ సాధువు పరుగున వెళ్లి, కొట్టవద్దని భూస్వామిని బతిమాలాడు.

Updated : 30 Nov 2023 01:00 IST

ఎంతో సాధన చేసిన ఓ సాధువు భిక్షాటనకు బయల్దేరాడు. మార్గమధ్యంలో ఓ జమీందారు తన వద్ద పనిచేసే వ్యక్తిని కొడుతున్నాడు. దయార్ద్రహృదయుడైన ఆ సాధువు పరుగున వెళ్లి, కొట్టవద్దని భూస్వామిని బతిమాలాడు. దాంతో జమీందారు సాధువుమీద కూడా చెయ్యి చేసుకోవడంతో స్పృహతప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి సాధువును మఠానికి తరలించాడు. సోదరసాధువులు జాగ్రత్తగా పడుకోబెట్టారు. చల్లని నీళ్లు ముఖంపై చల్లుతూ, కొంచెం కొంచెం పాలు పడుతూ ఉపచారాలు చేశారు. గాయపడిన సాధువు క్రమంగా తేరుకున్నాడు. అందరినీ తేరిపార చూస్తున్నాడు. తమను గుర్తించడంలేదని భయపడి.. ‘సోదరా! నీకు పాలు పట్టిందెవరు?’ అనడిగారు. సాధువు హీనస్వరంతో ‘అయ్యో! గుర్తించకపోవటమేంటి? నన్ను గాయపరచిన వారే పాలు పట్టారు!’ అని బదులిచ్చాడు. ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యులకు ఈ కథ చెప్పి.. ‘మనకి మేలు చేసిన వాళ్లలోనే కాదు, కీడు తలపెట్టిన వాళ్లలోనూ భగవంతుడే ఉన్నాడు. సమభావంతో మెలగటం పారమార్థికతకు పరాకాష్ఠ’ అని విస్పష్టం చేశారు.

చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని